భూదానం: 101 మంది నిరుపేద టీవీ కళాకారులకు ఉచితంగా ఇళ్ల స్థలాలు

ABN , First Publish Date - 2022-06-06T02:09:37+05:30 IST

‘‘తెలుగోడి ఆత్మ గౌరవం.. దివంగత నేత అన్న నందమూరి తారక రామారావు (NTR) వంటి నటుడు, రాజకీయ నాయకుడు.. ఇంకెవరూ లేరు’’ అని అన్నారు తెలంగాణ రాష్ట్ర మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav). టెలివిజన్ రంగంలోని 24 క్రాఫ్ట్స్‌లో వెనుకబడిన పేద కళాకారులకు విజన్ వివికే వి.విజయ్ కుమార్ 101 ఫ్లాట్స్‌ను ఉచితంగా అందిస్తున్న సందర్భంగా..

భూదానం: 101 మంది నిరుపేద టీవీ కళాకారులకు ఉచితంగా ఇళ్ల స్థలాలు

‘‘తెలుగోడి ఆత్మ గౌరవం.. దివంగత నేత అన్న నందమూరి తారక రామారావు (NTR) వంటి నటుడు, రాజకీయ నాయకుడు.. ఇంకెవరూ లేరు’’ అని అన్నారు తెలంగాణ రాష్ట్ర మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav). టెలివిజన్ రంగంలోని 24 క్రాఫ్ట్స్‌లో వెనుకబడిన పేద కళాకారులకు విజన్ వివికే వి.విజయ్ కుమార్ 101 ఫ్లాట్స్‌ను ఉచితంగా అందిస్తున్న సందర్భంగా.. హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం విజన్ వివికే వి. విజయ్ కుమార్ ఇచ్చిన మాట ప్రకారం 101 మంది నిరుపేద టీవీ కళాకారులకు ఉచిత ఇళ్ల స్థలాల పత్రాలను.. తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు కె.వి.రమణాచారి (KV Ramana Chari) చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, టెలివిజన్ రంగానికి చెందిన ప్రముఖులు హాజరయ్యారు.


ఈ కార్యక్రమంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘విజయ్ కుమార్ టీవీ రంగానికి సంబంధించిన పేద కళాకారులకు సహాయం చేసే మంచి నిర్ణయం తీసుకున్నారు. టెలివిజన్ రంగంలోని 24 క్రాఫ్ట్స్‌లలో ఉన్న ఒక్కొక్క క్రాఫ్ట్ నుండి ఐదుగురు పేద కళాకారులను ఎంపిక చేసి.. వారికి 101 ఫ్లాట్స్ ఇవ్వడం గొప్ప విషయం. సుమారు రూ. 6 కోట్ల విలువ చేసే భూమిని ఇవ్వడం గొప్ప విషయం. పేదవాడి ఆశీర్వాదాలు ఇలాంటి వారికి జీవితకాలం తోడుగా ఉంటాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు పేద ప్రజలకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అవన్నీ ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. సినీ పరిశ్రమ ఇంతగా ఎదగడానికి ఒక చరిత్ర ఉంది. దివంగత నేత, అన్న నందమూరి తారక రామారావుగారు ఒక గొప్ప కళాకారుడే కాదు తిరుగులేని రాజకీయ నాయకుడు కూడా.‌ ఒకప్పుడు చెన్నై నగరంలో తెలుగు వారందరూ షూటింగ్ చేస్తున్నపుడు వారిని మదరాసి అనేవారు. దాంతో  తెలుగు గడ్డపై వున్న మమకారంతో అక్కినేని నాగేశ్వరావు(ANR), రామారావు వంటివారు ఇక్కడికి వచ్చి సినిమా స్టూడియోలను స్థాపించడం జరిగింది. అయితే రామారావుగారు తెలుగు నేలకు నేను ఏమైనా చేయాలని తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి.. భారతదేశ రాజకీయాలను గడగడ లాడించారు. ఆయన దయ వల్ల ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి గుర్తింపు వచ్చింది. కాబట్టి ఆయనలాంటి నటుడు, రాజకీయ నాయకుడు, తెలుగోడి ఆత్మ గౌరవం.. ఇలాంటి వ్యక్తి రాడు రాలేడని.. ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఆ తర్వాత కార్మిక పక్షపాతిగా, పేదవర్గాల పక్షపాతిగా సినిమారంగంలో దాసరి(Dasari)గారు ఏది వచ్చినా తన భుజాలమీద వేసుకొని పరిష్కారం ఇచ్చేవారు. పేదవారికి అండగా నిలబడేందుకు విజయ్ కుమార్ వంటి వారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు ఆయనకు అభినందనలు..’’ అని తెలిపారు.


విజన్ వివికే విజయ్ కుమార్ (VVK Vijay Kumar) మాట్లాడుతూ.. ‘‘నేను చేసేది సేవ. ఎవరికైతే మాటిచ్చామో.. వారికి అందితే చాలు. తీసుకున్న వారికి.. ఇచ్చిన వారికి తెలిస్తే చాలు, బహిరంగంగా ఇటువంటి కార్యక్రమాలు వద్దని రమణాచారిగారితో చెపితే.. లేదు ఇలాంటి మంచి విషయం అందరికీ తెలియాలని.. నాగబాల సురేష్ గారి టీమ్‌తో ఇంత ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. వారందరికీ నా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసానిగారు, ఎమ్మెల్యే గోపినాథ్‌గారితో పాటు పలువురు పెద్దలు రావడం చాలా సంతోషంగా ఉంది. గత సంవత్సరం టీవీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పలువురు పెద్దల సమక్షంలో ఒక సభ జరిగింది. వారి సమక్షంలో టెలివిజన్ రంగంలోని 24 క్రాఫ్ట్స్‌లో ఉండే వెనుకబడిన పేద కళాకారులు వారి కష్టాలు, కన్నీళ్లు చెబుతూ ఉంటే నా మనసు చలించిపోయింది. మనం ఎంతసేపు నేను, నా పిల్లలు, వారి పిల్లలు అంటూ కుటుంబ మొత్తానికి తరతరాలు తిన్నా.. తరగని కోట్ల ఆస్తిని సంపాదించుకొని వారసత్వంగా ఎన్నో ఆస్తులు పిల్లలకు కూడబెట్టడం కాదు.. కష్టాలలో వున్నవారికి.. ఇబ్బందుల్లో వున్నవారికి కొంత చేయూత నిచ్చి.. సహకరించగలిగితే చాలు అనేది నా అభిప్రాయం. ఆ రోజే మాటిచ్చాను. ఇప్పుడది నిరూపించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కోట్ల విలువజేసే భూమిని ఎందుకు ఇవ్వడం అని చాలా మంది అన్నారు. అయితే నా దృష్టిలో మన పిల్లలకు మనం కోట్ల ఆస్తిని ఇవ్వడం ముఖ్యం కాదు. మన చుట్టూ ఉన్న పేద కార్మికులకు సహాయం చేస్తే మనకంటూ ఒక దైవశక్తి వస్తుంది. ఆ దైవశక్తి ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. మన పిల్లలకు మంచి నాలెడ్జ్, ఆలోచనలు ఇస్తే.. వారు కూడా సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేస్తారనేది నా అభిప్రాయం..’’ అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ప్రభుత్వ సలహాదారుడు రమణాచారి, నటుడు జాకీ, హరిత, తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా టెక్నీషియన్స్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు ప్రసంగించారు.

Updated Date - 2022-06-06T02:09:37+05:30 IST