Actors Undressed: ఈ హీరోలకు ఏమైంది..? విప్పి చూపించడమే ఇప్పటి ట్రెండా..?

ABN , First Publish Date - 2022-07-25T18:25:23+05:30 IST

నగ్నంగా ఫొటోలకు ఫోజులివ్వడం, ఒంటిపై నూలు పోగు లేకుండా సినిమాల్లో నటించడం ఇప్పుడు ఓ ట్రెండ్ అయిపోయింది...

Actors Undressed: ఈ హీరోలకు ఏమైంది..? విప్పి చూపించడమే ఇప్పటి ట్రెండా..?

నగ్నంగా ఫొటోలకు ఫోజులివ్వడం, ఒంటిపై నూలు పోగు లేకుండా సినిమాల్లో నటించడం ఇప్పుడు ఓ ట్రెండ్ అయిపోయింది. అలా నటించడం అనేది గొప్పగా ఫీలవుతున్న రోజులు ఇవి. అయితే సినిమాల్లో సందర్భానుసారం, తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేయాల్సి వస్తే తప్పులేదు కానీ.. కావాలనే, సోషల్ మీడియాలో ట్రెండ్ అవాలన్న తాపత్రయంతో చేస్తే వాళ్లే బజారున పడతారు. నలుగురి మధ్య చులకన అవుతారు. సోషల్ మీడియాలో ఇప్పుడు అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ (Vijay devarakonda) నగ్నంగా నటించిన సీన్‌కు సంబంధించి పోస్టర్ బయటకు వచ్చినప్పటి నుంచి ఇతర హీరోలు కూడా ఇదే ట్రెండ్‌ను కొనసాగిస్తున్నారు. ఇదేం పనయ్యా బాబూ అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా, తెగ ట్రోలింగ్ చేస్తున్నా ఆ నటులు పట్టించుకోకపోవడం శోచనీయం.


టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ మొదట ఈ నగ్న ఫొటోల ట్రెండ్‌ని ప్రారంభించాడు. ఈ యువ నటుడు, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ అనే సినిమా చేస్తున్నాడు. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలకానుంది. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25న రిలీజ్ కానున్న ఈ మూవీలోని విజయ్‌కు సంబంధించిన ఓ పోస్టర్‌ను ఇటీవల చిత్రబృందం విడుదల చేసింది. అందులో విజయ్ దాదాపు పూర్తి నగ్నంగా ఉన్నాడు. ప్లవర్ బోకేను అడ్డుపెట్టుకుని పూర్తి నగ్నంగా ఉన్న ఆ ఫొటో నెట్టింట తెగ వైరల్ అయింది. మిలియన్ల కొద్దీ లైకులు, లక్షల్లో కామెంట్లు, నెటిజన్ల మధ్య హాట్ డిబేట్ జరిగింది. ఈ లుక్‌పై కొందరు నెటిజన్లు పాజిటివ్‌గా.. మరికొందరు నెగటివ్‌గా రెస్పాండ్ అయ్యారు. అయితే.. మూవీ టీం ఈ విమర్శలపై స్పందిస్తూ ఈ ఫోజుకి అసలు కారణం సినిమా చూస్తే తెలుస్తుందని తెలిపింది. కానీ.. ఈ పిక్స్ బాగా వైరల్ అవ్వడంతో విజయ్‌ని ఫాలో అవుతూ మరికొందరు నటులు సైతం నగ్న ఫొటోలకి ఫోజులు ఇచ్చారు.




అందులో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh)  కూడా ఉన్నారు. ఆయన ఓ పేపర్ మేగజైన్ కోసం నగ్నంగా ఫోజులిచ్చారు. ఈ పిక్స్ సైతం సోషల్ మీడియాని ఓ ఊపు ఊపేశాయి. అయితే.. ఎప్పటిలాగే ఈ ఫొటోలపై కూడా పలువురు నెటిజన్లు స్పందిస్తూ ‘డబ్బు కోసం ఏమైనా చేస్తారా’ అంటూ ట్రోలింగ్ కూడా చేశారు. అంతేకాకుండా.. ‘అన్ని విప్పి చూపించడం ట్రెండ్ అవ్వడం దారుణం’ అంటూ విమర్శలు గుప్పించారు. దీనిపై రణ్‌వీర్ స్పందిస్తూ.. ‘నాకు అన్ని చూపించే ధైర్యం ఉంది. మీకు నచ్చకపోతే చూడకండి’ అంటూ అదేస్థాయిలో కౌంటర్ సైతం ఇచ్చాడు. ఈ వివాదం ఇంతటితో పోయిందిలే అనుకుంటే.. మరో నటుడు కూడా వీరిని ఫాలో అయ్యాడు. కేవలం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవడం కోసమే ఈ పని చేశానంటూ ఆ నటుడే చెప్పుకోవడం గమనార్హం.


విజయ్ దేవరకొండ, రణ్‌వీర్ సింగ్ బాటలో కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్ (Vishnu Vishal) సైతం ఈ ట్రెండ్‌ని ఫాలో అయ్యాడు. తన నగ్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. పైగా ఆ పిక్స్ తీసింది ఆయన భార్య గుత్తా జ్వాలాయేనని ట్వీట్‌లో ప్రస్తావించాడు కూడా. ఈ పిక్స్‌ని పోస్ట్ చేసిన విష్ణు.. ‘నేను కూడా ఈ ట్రెండ్‌లో జాయిన్ అవుతున్నా.. వీటి కోసం నా భార్య గుత్తా జ్వాల ఫొటోగ్రాఫర్‌గా మారింది’ అంటూ రాసుకొచ్చాడు. ఈ ఫొటోలపై అయితే నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేశారు. ‘నువ్వు నటించిన ఓ సినిమాను చూడమని నా స్నేహితుడికి గంట క్రితమే సూచించాను. ఇలా దిగజారిపోతావని అస్సలు ఊహించలేదు’ అంటూ ఓ అభిమాని కామెంట్ పెట్టగా.. ట్రెండింగ్ అవడానికి ఎలాంటి నీచమైన పనులు చేయడానికైనా సిద్ధమేనా.. అంటూ ఓ నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేయగా.. మళ్లీ ఆదిమానవుల నాటి కాలం రాబోతోందేమో.. అంటూ మరో నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశాడు. 


విజయ్ దేవరకొండ లైగర్ సినిమా కోసం నగ్నంగా నటించాల్సి వచ్చింది. దానికి అసలు కారణం ఏంటో అన్నది సినిమా చూస్తే తెలుస్తుంది. ఇక రణ్‌వీర్ సింగ్ మాత్రం ఓ మేగజైన్ కోసం ఫొటోషూట్ నిర్వహణలో భాగంగా నగ్నంగా కనిపించాడు. దీనిపై విమర్శలు వస్తే మరింత ఘాటుగా ఈ  హీరో రియాక్ట్ అయ్యాడు. రణ్ వీర్‌పై వచ్చిన విమర్శలు చూసి అయినా విష్ణు విశాల్ ఆగి ఉండాల్సింది. కానీ అతడు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. కావాలనే భార్యతో ఫొటోలు తీయించుకుని మరీ నగ్న ఫొటోలను నెట్టింట షేర్ చేయడం విమర్శలకి కారణమైంది. 


‘యాక్.. ఇదేం ట్రెండ్’, ‘ఇలాంటి చెత్త ట్రెండ్ అవసరం ఏం వచ్చింది’, ‘ఈ ట్రెండ్ కొనసాగకూడదని కోరుకుంటున్నా’, ‘ఒకరి తర్వాత ఒకరు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు’, ‘నటులు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కాదు’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే.. ‘ఈ హీరోలకు ఏమైంది..? విప్పి చూపించడమే ఇప్పటి ట్రెండా..?’ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొందరేమో ఈ ట్రెండ్ కొనసాగుకూడదని కోరుకుంటున్నారు. ఈ విమర్శలు దేశంలోని దాదాపు అన్ని సినిమా ఇండస్ట్రీల నుంచి, అని ప్రాంతీయ భాషల్లోని అభిమానులు ఈ ట్రెండ్‌ని అసహ్యించుకుంటూ ఇలాంటి కామెంట్స్ చేశారు. ఇప్పటికైనా ఈ నగ్న ట్రెండ్‌కి పుల్‌స్టాప్ పడుతుందో.. లేక మరో నటుడు ఎవరైనా ఫామ్‌లోకి వస్తాడో చూడాలి మరి..





Updated Date - 2022-07-25T18:25:23+05:30 IST