సినిమా రివ్యూ : విక్రమ్ (Vikram)

ABN , First Publish Date - 2022-06-03T20:06:53+05:30 IST

‘ఖైదీ, మాస్టర్’ లాంటి యాక్షన్ చిత్రాలతో మాస్ ప్రేక్షకుల్ని ఓ రేంజ్ లో థ్రిల్ చేసిన దర్శకుడు లోకేష్ కనగారాజ్ (Lokesh kanagaraj). ముచ్చటగా మూడో ప్రయత్నంగా.. లోకనాయకుడు కమల్‌హాసన్, మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి, మలయాళ విలక్షణ నటుడు ఫహద్ ఫాజిల్‌లతో అంతకు మించి అనే స్థాయిలో అదిరిపోయే కథాకథనాలతో విక్రమ్ (Vikram) చిత్రాన్ని తెరకెక్కించాడు.

సినిమా రివ్యూ : విక్రమ్ (Vikram)

చిత్రం : విక్రమ్ 

విడుదల తేదీ : జూన్ 3, 2022

నటీనటులు : కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, సూర్య, చంబన్ వినోద్ జోస్, హరీష్ పేరడి, నరేన్, కాళిదాస్ జయరామ్, హరీశ్ ఉత్తమన్, గాయత్రీ శంకర్, షాన్వీ శ్రీవాత్సవ, శివానీ నారాయణన్, మారిముత్తు, అర్జున్ దాస్, రమేశ్ తిలక్, అరుళ్ దాస్, సంపత్ రామ్, గోకుల్ నాథ్ తదితరులు. 

సంగీతం : అనిరుధ్ రవిచంద్రన్

సినిమాటోగ్రఫీ : గిరీష్ గంగాధరన్

ఎడిటింగ్ : ఫియోమిన్ రాజ్

నిర్మాతలు : కమల్ హాసన్, ఆర్.మహేంద్రన్

రచన, దర్శకత్వం : లోకేష్ కనగరాజ్

‘ఖైదీ, మాస్టర్’ లాంటి యాక్షన్ చిత్రాలతో మాస్ ప్రేక్షకుల్ని ఓ రేంజ్ లో థ్రిల్ చేసిన దర్శకుడు లోకేష్ కనగారాజ్ (Lokesh kanagaraj). ముచ్చటగా మూడో ప్రయత్నంగా.. లోకనాయకుడు కమల్‌హాసన్, మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి, మలయాళ విలక్షణ నటుడు ఫహద్ ఫాజిల్‌లతో అంతకు మించి అనే స్థాయిలో అదిరిపోయే కథాకథనాలతో విక్రమ్ (Vikram) చిత్రాన్ని తెరకెక్కించాడు. టీజర్, ట్రైలర్స్‌కు మంచి స్పందన రావడంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ రోజే (జూన్ 3) ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ స్థాయిలో థ్రిల్ చేసింది? లోకేష్ దర్శకత్వ మాయాజాలం ఏ తరహాలో ఉంది? అనే విషయాలు రివ్యూలో చూద్దాం. (Vikram Movie Review)


కథ

చాలా ఖరీదైన ఓ కొకైన్ కంటైనర్ కనిపించకుండా పోతుంది. ఆ తర్వాత వరుసగా కొందరు పోలీసాఫీసర్స్ మర్డర్ అవుతారు. సీక్రెట్ మిషన్స్‌లో ఆరితేరిన అమర్ (ఫహద్ ఫాజిల్) ఆ కేస్ ను టేకప్ చేస్తాడు. తన టీమ్ తో కలిసి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు. ఆ క్రమంలో కర్ణన్ (కమల్ హాసన్), మాస్క్ మేన్ గురించి తెలుసుకుంటాడు. సంతానం (విజయ్ సేతుపతి) అనే ఓ కరుడు గట్టిన డ్రగ్ స్మగ్లర్ ఆ కంటైనర్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఇంతకీ కర్ణన్, అమర్, సంతానంకు ఉన్న లింకేంటి? కర్ణన్ లక్ష్యమేంటి? అతడి కొడుకు ప్రభంజన్ (కాళిదాస్ జయరామ్)కు దీంతో సంబంధమేంటి? అన్నది మిగతా కథ. (Vikram Movie Review)


విశ్లేషణ

లోకనాయకుడు కమల్‌హాసన్ (Kamal Haasan), మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi), మలయాళ విలక్షణ నటుడు ఫహద్ ఫాజిల్ (Fahad Fasil) లాంటి మహామహులైన నటులు కలిసి నటిస్తున్న సినిమా అనగానే.. ప్రేక్షకుల అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి. దానికి ఏమాత్రం తగ్గని స్థాయిలో ఈ ముగ్గురి పాత్రల్ని ఎంతో జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకొని.. కథాకథనాల్ని వండాల్సి ఉంటుంది. ఏ దర్శకుడికైనా ఈ వ్యవహారం కత్తిమీద సామే. అయితే లోకేష్ కనగరాజ్ ఈ విషయంలో ఎంతో బ్రిలియన్సీని ప్రదర్శిస్తూ విక్రమ్ సినిమాను ఆద్యంతం ప్రేక్షకుల ఊహకు అందని రీతిలో ఎంతో థ్రిల్లింగ్‌గా  తెరకెక్కించాడు. ప్రారంభ సన్నివేశం ఎంతో ఆసక్తిగా మొదలవుతుంది. ఒకో పాత్ర పరిచయం అవుతూ.. సినిమాలో లీనమయ్యేలా చేస్తాయి. లోకేష్ కనగరాజ్ ప్రతీ సినిమాలోనూ డ్రగ్ కామన్ పాయింట్. తను తీసిన తొలి రెండు చిత్రాల్లోనూ దాని ప్రముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే విక్రమ్ సినిమాను మాత్రం దాన్నే ప్రధాన వస్తువుగా తీసుకొని.. దాన్ని చుట్టూ హాలీవుడ్ స్టాండర్డ్స్ లోని కథాకథనాల్ని అల్లుకొన్నాడు. (Vikram Movie Review)


డ్రగ్ మాఫియాను, ఆ ముఠా సభ్యుల ప్రవర్తనను, కరడుకట్టిన వారి నైజాన్ని ఎంతో డీటెయిల్డ్ గా చూపించి ప్రేక్షకుల్ని థ్రిల్ చేశాడు దర్శకుడు. ఇక ‘ఖైదీ’ (Khaidi) చిత్రంలోని కొన్ని సన్నివేశాల్ని, పాత్రల్ని ఇందులో కంటిన్యూ చూస్తూ.. ఆ సినిమా క్రేజ్‌ను ఎంతో తెలివిగా వాడుకున్నాడు. కథానాయకుడు కమల్ హాసన్, విలన్ విజయ్ సేతుపతి, సినిమాలో ఎంతో కీలకమైన పాత్రను పోషించిన ఫహద్ ఫాజిల్ నుంచి అద్భుతమైన నటనను రాబట్టాడు. బోర్ కట్టని సన్నివేశాలతో.. తనదైన స్టైలిష్ నెరేషన్ తో ప్రేక్షకుల్ని కుర్చీలకు కట్టేశాడు. కొన్ని సన్నివేశాలు మన ఊహకు అందే విధంగా ఉన్నప్పటికీ.. స్ర్కీన్ ప్లే మాయాజాలంతో కట్టిపడేశాడు లోకేష్. థ్రిల్ చేసే ఇంటర్వెల్ బ్యాంగ్, అబ్బురపరిచే క్లైమాక్స్.. విక్రమ్ చిత్రానికి పిల్లర్స్ గా నిలిచిపోతాయి. 


విక్రమ్ గా కమల్‌హాసన్ ఒన్ మేన్ షో చేశాడు. ఈ వయసులో కూడా ఎంతో ఎనర్జిటిక్ గా తన పాత్రను రక్తికట్టించాడు. యాక్షన్ సన్నివేశాలతో పాటు ఎమోషనల్ సీన్స్ లోనూ కమల్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. తన పాత్రలోని వేరియేషన్స్‌ను చాలా బాగా పలికించాడు. ఇక సంతానంగా విజయ్ సేతుపతి తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మాస్టర్ చిత్రంలో అతడు తన పాత్రను ఎలా ఓన్ చేసుకున్నాడో.. అంతకు మించిన నటనతో ఇందులో చెలరేగిపోయాడు. ఇక తను ఎంత విలక్షణ నటుడో అమర్ పాత్ర ద్వారా మరోసారి నిరూపించాడు ఫహద్ ఫాజిల్. ఇందులో ఫహద్ సెకండ్ హీరో తరహా పాత్రను పోషించాడు. ప్రథమార్ధమంతా ఫహద్ ఫాజిల్ తన నటనతో రక్తికట్టిస్తే.. సెకండాఫ్ కమల్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. అలాగే.. చంబన్ వినోద్ జోస్, నరేన్, అర్జున్ దాస్ నటన మెప్పిస్తాయి. ఇక క్లైమాక్స్ లో సూర్య (Surya) రోలెక్స్ అనే పాత్రలో కనిపించి.. ఈ సినిమాకి తాను కూడా ఓ ప్రధాన పాత్రనే అని గుర్తు చేస్తాడు. కమల్ లాంటి లోకనాయకుడి స్థాయికి తగినే సినిమానే తెరకెక్కించాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్. మొత్తానికి యాక్షన్ థ్రిల్లర్స్ ఇష్టపడే ప్రేక్షకుల్నే కాకుండా.. సాధారణ ప్రేక్షకుల్ని కూడా ఎంతగానో అలరించే చిత్రం ‘విక్రమ్’ అని చెప్పాలి. (Vikram Review)  

ట్యాగ్ లైన్ : కమల్ ఒన్ మేన్ షో..  

Updated Date - 2022-06-03T20:06:53+05:30 IST