Sai Pallavi వ్యాఖ్యలపై విజయశాంతి స్పందన..

ABN , First Publish Date - 2022-06-17T16:08:02+05:30 IST

రానా (Rana), సాయి పల్లవి (Sai Pallavi) ప్రధాన పాత్రల్లో.. ప్రియమణి (Priyamani), నందిత దాస్, నివేతా పేతురాజ్ కీలక పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘విరాట పర్వం’ (Virata Parvam).

Sai Pallavi వ్యాఖ్యలపై విజయశాంతి స్పందన..

రానా (Rana), సాయి పల్లవి (Sai Pallavi) ప్రధాన పాత్రల్లో.. ప్రియమణి (Priyamani), నందిత దాస్, నివేతా పేతురాజ్ కీలక పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘విరాట పర్వం’ (Virata Parvam). వేణు ఊడుడుల (Venu Udugula) రూపొందించిన  సినిమా నేడు ప్రేక్షకుల ముందుకువచ్చి హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే, ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. మత హింస, వామపక్ష-అతివాద భావజాలంపై సాయి పల్లవి మాట్లాడుతూ.. కశ్మీర్ ఫైల్స్ (Kshmir Files) సినిమాలో చూపించిన హింస, గోరక్షక దళాలు చేస్తోన్న దాడులు ఒకటేనని, వ్యక్తులు ఏ మతానికి చెందినా, ఏ వాదాన్ని నమ్మినా మానవత్వాన్ని మర్చిపోతే ప్రయోజనం ఉండదు..అని అభిప్రాయాన్ని తెలిపారు. 


అయితే, సాయి పల్లవి చేసిన ఈ వ్యాఖ్యలపై హిందూవాదులు మండిపడ్డారు. పండిట్లను చంపిన ఉగ్రవాదులతో గోవులను కాపాడిన రక్షకులను ఎలా  పోల్చుతారని ప్రశించారు. ఈ క్రమంలో సాయి పల్లవిపై ఫిర్యాదులు, విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తాజాగా సీనియర్ నటి, బీజేపీ నేత విజయశాంతి స్పందించారు. 'కశ్మీర్ పండిట్లపై దారుణ అకృత్యాలకు పాల్పడిన వారిని.... గోవధ కోసం ఆవుల అక్రమరవాణాకు పాల్పడేవారిని అడ్డుకున్న గోసంరక్షకులను ఒకే గాటన కడుతూ హీరోయిన్ సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర వివాదానికి దారి తీశాయి. మతోన్మాదంతో పండిట్లపై మారణకాండ సృష్టించడం... ధర్మం కోసం దైవసమానమైన గోవులను కాపాడుకునేందుకు గోరక్షకులు చేసే పోరాటం ఒకటే ఎలా అవుతాయో కాస్త ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది. డబ్బు కోసం దోపిడీ దొంగ ఎవరినైనా కొట్టడం.... తప్పు చేసిన పిల్లవాడిని తల్లి దండించడం ఏవిధంగా ఒకటవుతాయి? 


ఆ దోపిడి దొంగను, తల్లిని ఒకేలా చూస్తారా? ఎవరైనప్పటికీ తమకు అవగాహన లేని విషయాల ప్రస్తావన వచ్చినప్పుడు సున్నితంగా ఆ అంశాన్ని పక్కన పెట్టడం మంచిది.నేడు మనం మాట్లాడే ప్రతి మాట క్షణాల్లో కోట్లాదిమందికి చేరిపోతూ.... ఆ మాటల్లో ఏ మాత్రం తేడా ఉన్నా పట్టుకుని ప్రశ్నించే సమాజంలో ఉన్నాం. అందువల్ల మాట్లాడే అంశాలపై సమగ్ర అవగాహనతో... సామాజిక స్పృహతో స్పందించడం చాలా అవసరమని గ్రహించాలి. ఏది ఏమైనా ఆ సినిమా ఆర్ధిక లాభాలతో ఆసక్తి ఉన్న నిర్మాణ సంబంధితులు, కశ్మీర్ ఫైల్స్ పోలిక తెచ్చి, ప్రజల దృష్టిని ఆకట్టుకోవడానికి చేసిన ప్రీరిలీజ్ కార్యక్రమంలో ఆ కథానాయికను సమస్యల్లోకి లాగినట్టుందేమో అని కొందరు అభిప్రాయపడుతున్నట్టు సమాచారం కూడా అందుతోంది'..అని విజయశాంతి పేర్కొన్నారు.

Updated Date - 2022-06-17T16:08:02+05:30 IST