Vijayashanthi: రాములమ్మ కామెంట్స్ మెగాస్టార్‌పైనేనా!

ABN , First Publish Date - 2022-08-03T02:42:39+05:30 IST

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ (Aamir Khan) నటించిన చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha). ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోన్న ఈ చిత్రంలో సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం

Vijayashanthi: రాములమ్మ కామెంట్స్ మెగాస్టార్‌పైనేనా!

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ (Aamir Khan) నటించిన చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha). ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోన్న ఈ చిత్రంలో సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాపై, ఆమిర్ ఖాన్‌పై లేడీ సూపర్ స్టార్, రాజకీయ నాయకురాలు విజయశాంతి (Vijayashanthi) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ (BJP) సర్కారుపై గుడ్డి వ్యతిరేకతతో భారతమాతను అవమానిస్తూ 2015లో ఆమిర్ చేసిన అసహన వ్యాఖ్యల ఫలితాన్ని ఆయన ఇప్పుడు అనుభవిస్తున్నట్లుగా రాములమ్మ (Ramulamma) చెప్పుకొచ్చారు. ఈ సినిమా విషయంలో జనం చైతన్యవంతంగా వ్యవహరిస్తున్నా.. సౌత్ హీరోలు కొందరు పట్టించుకోకుండా ఆయన సినిమాని ప్రమోట్ చేస్తుండటం సమంజసం కాదని.. ఆమె వెల్లడించారు. ఈ విషయంలో వారు ఒక్కసారి ఆలోచించాల్సిందిగా.. రాములమ్మ హిత బోధ చేశారు. కాగా, టాలీవుడ్ విషయానికి వస్తే.. ఈ సినిమాని మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తుంటే.. గీతా ఆర్ట్స్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో రాములమ్మ వ్యాఖ్యలు చిరంజీవిపైనే.. అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


విజయశాంతి చేసిన పోస్ట్ ఇదే.. 

‘‘ప్రజల్ని అమాయకులుగా భావించి నోటికొచ్చినట్టు మాట్లాడితే... ఆ పరిణామాలు ఎలా ఉంటాయో బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్‌గారికి జనం అర్థమయ్యేలా చేస్తున్నారు. బీజేపీ సర్కారుపై గుడ్డి వ్యతిరేకతతో భారతమాతను అవమానిస్తూ 2015లో ఆమిర్ చేసిన అసహన వ్యాఖ్యల ఫలితాన్ని ఇప్పుడాయన చూస్తున్నారు. భారత్‌లో అసహనం పెరిగిపోయిందని... ఈ దేశం విడిచిపోవాలని తన భార్య ప్రతిపాదించిందని అప్పట్లో జరిగిన జర్నలిజం అవార్డుల కార్యక్రమంలో ఆమిర్ అన్నారు. భారతదేశంలోని ప్రభుత్వ, ప్రయివేట్ వ్యవస్థల్లో హైందవేతరులు ఎన్నెన్ని గొప్ప గొప్ప స్థానాల్ని పొందారో... ఇప్పటికీ పొందుతున్నారో... చరిత్రను, సమకాలీన పరిస్థితుల్ని పరిశీలిస్తే తెలుస్తుంది. మనకి స్వాతంత్ర్యం రావడానికి ముందు, తర్వాత, నేడు... ఎప్పుడు చూసుకున్నా ఈ దేశం మతసామరస్యంతో అందరికీ స్థానమిచ్చి గౌరవిస్తోంది. ఇందుకు పెద్ద ఉదాహరణ ఆమిర్‌తో సహా బాలీవుడ్‌లో సముచిత గౌరవం అందుకుంటున్న ఖాన్ త్రయాన్నే చెప్పుకోవచ్చు. కానీ, వాస్తవమేంటో తెలిసిన ప్రజలు ఆమిర్ వ్యాఖ్యల్ని తిప్పికొట్టడంతో పాటు, ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న వాణిజ్య ఉత్పత్తుల్ని కూడా బహిష్కరించారు.


గతంలో ఆమిర్ నటించిన పీకే సినిమాలో సైతం హిందూ వ్యతిరేకతనే ప్రధానంగా చూపించడమేగాక, హిందూ దేవుళ్లని అవమానించారు. అప్పట్లో హిందూ సంస్థలు ఆ సినిమాని నిషేధించాలని కూడా డిమాండ్ చేశాయి. ఇలా ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’ అనే ఇన్స్‌పిరేషనల్ మూవీతో ముందుకొచ్చారు. కానీ, ప్రజల్లో ఏమాత్రం స్ఫూర్తిని నింపే స్థితిలో లేని ఆమీర్... గతంలో చేసిన దేశ వ్యతిరేక వ్యాఖ్యల్ని ప్రజలు ఆయనకి గుర్తు చేస్తూ Boycott Laal Singh Chaddha హ్యాష్ ట్యాగ్‌తో ఈ సినిమాకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అందర్నీ మేలుకొలుపుతున్నారు. దురదృష్టమేంటంటే.. జనం ఇంత చైతన్యంతో వ్యవహరిస్తున్నా మన సౌత్ హీరోలు కొందరు ఆ ప్రజల మనోభావాలు తమకు తెలియదన్నట్టు , ఆమిర్ చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ  టీవీ షోల్లో పాల్గొంటున్నారు. దేశం పట్ల ప్రజల్లో ఉన్న ప్రేమాభిమానాలను పట్టించుకోకుండా  వ్యవహరించడం సమంజసం కాదేమో వారు ఆలోచించాలి’’.. అని విజయశాంతి తన సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేశారు.



Updated Date - 2022-08-03T02:42:39+05:30 IST