Sham Kaushal: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకుందామనుకున్న విక్కీ కౌశల్ తండ్రి.. కారణం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-08-09T18:35:55+05:30 IST

బాలీవుడ్‌లో మంచి పాపులారిటీ ఉన్న నటుల్లో విక్కీ కౌశల్ ఒకరు. ఆయన తండ్రి శ్యామ్ కౌశల్ బాలీవుడ్‌లో ఫేమస్ యాక్షన్ డైరెక్టర్..

Sham Kaushal: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకుందామనుకున్న విక్కీ కౌశల్ తండ్రి.. కారణం ఏంటంటే..

బాలీవుడ్‌లో మంచి పాపులారిటీ ఉన్న నటుల్లో విక్కీ కౌశల్ ఒకరు. ఆయన తండ్రి శ్యామ్ కౌశల్ బాలీవుడ్‌లో ఫేమస్ యాక్షన్ డైరెక్టర్. దంగల్, బాజీరావ్ మస్తానీ వంటి సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించారు. కొన్నేళ్ల క్రితం శ్యామ్ కౌశల్ ఉదర క్యాన్స‌ర్‌తో పోరాడి గెలిచారు. ఆ సమయంలో ఆయన పరిస్థితిని, ఆత్మహత్య ఆలోచన వచ్చిన విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.


శ్యామ్ మాట్లాడుతూ.. ‘సెప్టెంబర్ 2003లో.. నేను లక్ష్య చిత్రీకరణను పూర్తి చేసి లడఖ్ నుంచి తిరిగి వచ్చా. అప్పుడు నాకు కడుపులో ఇబ్బంది మొదలైంది. శ్యామ్ బెనగల్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఆ సమయంలో దీపావళి రోజు మాకు సెలవు. ఆ రోజు కడుపులో చాలా నొప్పి వచ్చింది. మరుసటి రోజు, నేను చెక్ చేయించుకోవడానికి నానావతి ఆసుపత్రికి వెళ్లాను. అనంతరం వారు నాకు ఆపరేషన్ చేశారు. ఆ సమయంలో చాలా ఇబ్బందులు పడ్డా.  అయితే నేను అంతకుముందే నానా పటేకర్‌ కలిసి అపెండిక్స్ సమస్యతో ఆ ఆసుపత్రికి వెళ్లాను. అందుకే వారికి నా పరిస్థితి తొందరగా అర్థమయ్యింది’ అని చెప్పుకొచ్చారు.


శ్యామ్ ఇంకా మాట్లాడుతూ.. ‘పుణెలో షూటింగ్‌లో ఉన్న నానా పటేకర్‌ను వైద్యులు పిలిచారు. నానాజీ వెంటనే అక్కడి నుంచి వెళ్లి నేరుగా ఆసుపత్రికి వచ్చారు. అప్పుడు నేను అపస్మారక స్థితిలో ఉన్నా. నా కడుపులో ఇన్ఫెక్షన్ వచ్చింది. వైద్యులు కడుపులో కొంతభాగాన్ని కోసి పరీక్షలకు పంపించారు. అది క్యాన్సర్‌గా నిర్ధారణ అయింది. నేను బ్రతుకుతానో లేదో తెలియలేదు. నేను దీన్ని ఎవరితోనూ పంచుకోలేదు. నేను 50 రోజులపాటు ఆసుపత్రిలో ఉన్నాను. ఆ తర్వాత మళ్లీ పనిలోకి వచ్చాను. వారు నన్ను ఒక సంవత్సరం పాటు పరీక్షిస్తూనే ఉన్నారు. అయితే అదృష్టవశాత్తూ క్యాన్సర్ వ్యాపించలేదు. ఆ సమయంలో బతికే అవకాశం చాలా తక్కువ అని డాక్టర్స్ చెప్పారు. దాంతో కెరీర్ అయిపోయిందని ఫీల్ అయ్యా. అందుకే ఆత్మహత్య చేసుకుందామనుకున్నా. కానీ దేవుడి దయవల్ల ప్రమాదం నుంచి బయటపడగలిగాను. ఆ సంఘటన జరిగి ఇప్పటికి 19 ఏళ్లు’ అని చాలా ఎమోషనల్‌గా తెలిపారు.

Updated Date - 2022-08-09T18:35:55+05:30 IST