Ramgopal Varma : మన హీరోలకు, బాలీవుడ్ హీరోలకు తేడా అదే !

ABN , First Publish Date - 2022-09-13T16:07:40+05:30 IST

బాలీవుడ్‌పై సౌత్ సినిమా ఆదిపత్యం మొదలైంది. అక్కడి సినిమాల్ని, హీరోల్ని మనవాళ్ళు బాయ్‌కాట్ చేయడం ఓ ఉద్యమంలా మారుతోంది. లాక్ డౌన్ తర్వాత విడుదలైన హిందీ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టేశాయి.

Ramgopal Varma : మన హీరోలకు, బాలీవుడ్ హీరోలకు తేడా అదే !

బాలీవుడ్‌పై సౌత్ సినిమా ఆదిపత్యం మొదలైంది. అక్కడి సినిమాల్ని, హీరోల్ని మనవాళ్ళు బాయ్‌కాట్ చేయడం ఓ ఉద్యమంలా మారుతోంది. లాక్ డౌన్ తర్వాత విడుదలైన హిందీ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టేశాయి. అదే సమయంలో ‘ఆర్.ఆర్.ఆర్ (RRR), కేజీఎఫ్ 2 (KGF2), పుష్ప (Pushpa), కార్తికేయ 2 (Karthikeya 2)’ లాంటి సినిమాలకు అక్కడి ప్రేక్షకులు పట్టంగట్టారు. ఒక్క ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra) చిత్రానికి మాత్రం దీనికి మినహాయింపునివ్వొచ్చు. సినిమాలో విషయం ఉంటే.. బాయ్‌కాట్ ఉద్యమాలు ఏమీ చేయలేవని ఆ సినిమా నిరూపించింది. అసలు బాలీవుడ్‌కు ఈ పరిస్థితి ఎందుకొచ్చిందంటే.. దానికి ఆ హీరోల యాటిట్యూడే కారణమంటున్నారు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ఆ విషయంలో మన హీరోల్ని ఆకాశానికెత్తేశారు కూడా. 


తెలుగు హీరోలు చాలా వినమ్రంగా ఉంటారని, బాలీవుడ్ హీరోలు యాటిట్యూడ్ చూపిస్తారని, వారు మీడియా ముందు చాలా పొగరుగా మాట్లాడతారని, ఆ విషయాన్ని బాలీవుడ్ ప్రేక్షకులు కనిపెట్టారని వర్మ అంటున్నారు. అందుకే యన్టీఆర్ (NTR), చరణ్ (Charan), ప్రభాస్ (Prabhas) లాంటి హీరోలు తమ వినమ్రతతో బాలీవుడ్ ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారని, ఇప్పుడు తెలుగు హీరోల్ని బాలీవుడ్ కాపీ కొడుతోందని వర్మ అన్నారు. 


ఇక విజయ్ దేవకొండ (Vijay Devarakonda) యాటిట్యూడ్‌ను ప్రస్తావిస్తూ .. ‘విజయ్ ముందు నుంచీ అలాగే ఉన్నాడు. తన యాటిట్యూడే తనని స్టార్‌ను చేసింది. అయితే ఇప్పుడు తనది కూడా రాంగ్ టైమింగే. ఎందుకంటే బాలీవుడ్ ప్రేక్షకులకు యాటిట్యూడ్ ఉన్న వారు నచ్చడంలేదు. వినమ్రంగా ఉన్న యన్టీఆర్, చరణ్, ప్రభాస్ లాంటి హీరోలే తెగ నచ్చుతున్నారు. పైగా ఒకరు ఎదుగుతుంటే.. ఈర్ష్య, అసూయతో ఓర్వలేని జనం పోగైపోతారు. వారు నెగెటివ్ ట్రోలింగ్స్ తో కార్నర్ చేస్తారు. విజయ్ విషయంలో అదే జరిగింది’ అని వర్మ చెప్పుకొచ్చారు. 

Updated Date - 2022-09-13T16:07:40+05:30 IST