Krishnam Raju: వారిని కృష్ణంరాజు గారే అడ్డుకున్నారు..వాణిశ్రీ వెల్లడించిన ఆసక్తికరమైన విషయాలు..

ABN , First Publish Date - 2022-09-11T22:25:33+05:30 IST

సీనియర్ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు (Krishnam Raju) ఈ రోజు తెల్లవారు జామున 3.25 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Krishnam Raju: వారిని కృష్ణంరాజు గారే అడ్డుకున్నారు..వాణిశ్రీ వెల్లడించిన ఆసక్తికరమైన విషయాలు..

సురేష్ కవిరాయని 

సీనియర్ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు (Krishnam Raju) ఈ రోజు తెల్లవారు జామున 3.25 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఈ సందర్భగా సీనియర్ నటీమణి వాణిశ్రీ (Vanisri) తన సహ నటుడుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచుచేసుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. "కృష్ణం రాజు కొంతకాలం విలన్ వేషాలు వేశాక, కథానాయకుడిగా చెయ్యాలనుకున్న సినిమా కృష్ణవేణి. ఆ సినిమాకి అయనే నిర్మాతగా వ్యవహరించారు. నన్ను కథానాయికగా తీసుకున్నారు. కృష్ణం రాజు గారికి నా మీద అపారమయిన అభిమానం ఉండేది. మొట్టమొదటి సినిమా పెళ్లి సంబంధం తరువాత జీవన తరంగాలు చేశాము. కృష్ణవేణి, భక్త కన్నప్ప, సతీ సావిత్రి కూడా చేశాను.


అయన ఒక సోదరుడిలా ఉండేవారు, అయన సంస్థలో నేను చేశాను కాబట్టి, నన్ను ప్రత్యేక అభిమానంతో చూసేవారు. నేను సినిమాలు చెయ్యటం ఆపేసినా కూడా, కృష్ణం రాజు గారితో మధ్య మధ్యలో చాలాసార్లు మాట్లాడేవాళ్ళం. చాలా మంచివారు, సహృదయులు, ఎవరిని కూడా క్రిటిసైజ్ చేసేవారు కాదు. సెట్స్ లో రాజకీయాలు కూడా మాట్లాడేవారు కాదు. తన పని ఏదో తాను చూసుకొని అందరితో చాలా స్నేహభావంతో ఉండేవారు"..అని తెలిపారు.


అలాగే, ఒక సంఘటన వల్ల పరిశ్రమలో కొందరు.. నన్న రాకుండా, బాయికాట్ చెయ్యాలని చూస్తే, ఆ సమయంలో కృష్ణం రాజు గారు నాకు సపోర్ట్ గా నిలిచి, అందరితో మాట్లాడి, ఆయనే సమస్యను పరిష్కరించారు. తెలుగు మహా సభలు జరుగుతున్న సమయంలో మా సినిమా ఆర్టిస్టులు కొన్ని ప్రధాన నగరాల్లో పర్యటించి, చిన్న చిన్న స్కిట్స్ ప్లే చేశాము. అలా నెల్లురులో వేసినప్పుడు.. నేను, కాంచన,లక్ష్మి, సరస్వతి.. నెల్లూరులో ఏదో ఫిష్ కర్రీ బాగుంది అని లక్ష్మి చెపితే, దానికి నేను మిగతా వాళ్ళం ఎదో పంచ్ వేసేవాళ్ళం. ఇదే క్రమంలో విజయవాడలో కూడా ఇచ్చాము, తరువాత వైజాగ్ లో కూడా చేశాము. వైజాగ్ లో చేసేటప్పుడు.. 'అక్కినేని దేవదాస్ సినిమాకి టికెట్స్ దొరకటం లేదు'.. అని ఆ స్కిట్ లో చెప్పా. అయితే, అప్పటికే అక్కినేని నటించిన దేవదాస్ సినిమాని వేరే వాళ్ళు కూడా రీమేక్ చేసి విడుదల చేసారు. 


అదే సమయంలో అక్కినేని దేవదాస్ కూడా విడుదల చేశారు. నేను మామూలుగా అనేశాను, దాంతో కొంతమంది పెద్దలు ఆగ్రహించి, నన్ను సినిమా ఇండస్ట్రీలోకి రాకుండా చేస్తాం.. అన్నారు. నన్ను బాయికాట్ చేస్తాం.. అని కూడా చెప్పారు. గుమ్మడి గారు, కృష్ణ గారు, విజయ నిర్మల గారు నేను ఇండస్ట్రీలో లేకుండా చెయ్యాలని చూశారు. ఆ టైంలో కృష్ణం రాజు గారు కలుగజేసుకొని అందరితో విడివిడిగా మాట్లాడి వాణిశ్రీ ని బాయికాట్ చెయ్యటం మంచిది కాదు అని చెప్పారు. అప్పుడు కృష్ణం రాజు గారు మన అందరం కలిసిమెలిసి ఉండాలని, విరోధులుగా ఉండకూడదు అని సర్ది చెప్పారు. కృష్ణం రాజు గారికి ఆ సంఘటనతో సంబంధం లేదు. కానీ, పరిశ్రమ మేలు కోరి, తనంతట తానే వచ్చి ఆ ఇష్యూ ని సాల్వ్ చేసారు..అని వివరించారు. 


నాకు మంచి తమ్ముడు దొరికాడు..

జీవన తరంగాలులో నాకు తమ్ముడుగా కృష్ణం రాజు వేశారు. అయితే, అయన చాలా పొడుగ్గా ఉండేవారు. నేను సరదాకి అనేదాన్ని, ఇదేంటండి నేను మీకు అక్కని ఏంటండీ, మీరేమో ఇంత పొడుగ్గా వున్నారు అని అంటే, వాణిశ్రీ గారూ నాలాంటి తమ్ముడు దొరకడం అదృష్టమే కాదనీ అని సరదాగా అనేవారు. ఆయనకి ఎందుకు మరి విలన్ రోల్స్ ఇచ్చేవారో నాకు అర్థం కాలేదు. అయన కూడా విలన్ రోల్ ఎందుకు చేశారో తెలియదు, చెయ్యకుండా ఉండాల్సింది అని చెప్పారు వాణిశ్రీ. ఆ తరువాత కృష్ణం రాజు గారు తన సొంత సంస్థ స్థాపించి మొదటి సినిమా కృష్ణవేణి తీసినప్పుడు, అందులో నన్నే హీరోయిన్ గా తీసుకున్నారు. ఒక హీరోయిన్ కి ఎంత మర్యాద.


భక్త కన్నప్ప.. 

ఆ తరువాత కృష్ణం రాజు గారు భక్త కన్నప్ప సినిమా తీస్తూ నా దగ్గరకి వచ్చి నేను అందులో హీరోయిన్ గా చెయ్యాలని చెప్పారు. నేను ఏమో ఎందుకండీ నేను అందులో, ఎవరిని అయినా పెట్టొచ్చు కదా అని అడిగితే, లేదు లేదు మీరే ఉండాలి అని చెప్పి నన్ను తీసుకున్నారు. దానికి బాపు రమణలు పని చేశారు. మీకా వేషం అక్కరలేదు, కానీ మీరు మా సినిమాలో చెయ్యటం వల్ల ఆ వేషానికి గుర్తింపు వస్తుంది.. అని చెప్పారు రాజుగారు.  బాపు రమణలు కూడా అయ్యబాబోయ్ ఎందుకండీ అంత పెద్ద హీరోయిన్, మనం ఎవరో చిన్న హీరోయిన్ ని పెట్టి చేసేద్దాం అని చెప్పారు. కానీ, కృష్ణం రాజు గారు నేనే ఉండాలి.. అని చెప్పి పట్టుబట్టి నన్ను ఆ సినిమాలో చేయించారు.  


ఆ సినిమా షూటింగ్ అంత బుట్టాయిగూడలో చేశాము. కరాటం కృష్ణమూర్తి గారు అని ఆ ఊర్లో ఒక పెద్దాయన వున్నారు. వాళ్ళ ఇంట్లోనే మాకు బస. అతను ఆ చుట్టుపక్కల వుండే ఊర్లు అంతటికీ సుపరిచితుడు. మమ్మల్ని అడవుళ్లకి తీసుకెళ్లి చూపించేవారు. కృష్ణమూర్తి గారే స్వయంగా డ్రైవ్ చేస్తూ నన్ను అక్కడ అందరిని పరిచయం చేసి, అడవిలో ఎన్నో ప్రదేశాలు చూపించారు. కృష్ణం రాజు గారి వల్ల చాలామంది ఆ విధంగా స్నేహితులు అయ్యారు నాకు..అని అప్పటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు వాణిశ్రీ. 

Updated Date - 2022-09-11T22:25:33+05:30 IST