‘విక్రమ్’ ఎవరో తెలియాలంటే సినిమా చూడాల్సిందే: Kamal Haasan

Twitter IconWatsapp IconFacebook Icon
విక్రమ్ ఎవరో తెలియాలంటే సినిమా చూడాల్సిందే: Kamal Haasan

‘‘విక్రమ్ (Vikram) సినిమాలో గ్రేట్ మ్యాజిక్ వుంది. ‘విక్రమ్’ ఎవరో తెలియాలంటే సినిమా చూడాల్సిందే..’’ అన్నారు యూనివర్సల్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan). ఆయన హీరోగా, విజయవంతమైన చిత్రాల దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘విక్రమ్’. విజయ్ సేతుపతి (Vijay Sethupathi), ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (Raaj Kamal Films International) బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్‌ (R Mahendran)తో కలిసి కమల్ హాసన్ నిర్మించారు. స్టార్ హీరో సూర్య (Suriya) ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. హీరో నితిన్‌ (Nithiin)కి చెందిన శ్రేష్ఠ్ మూవీస్ (Sreshth Movies) సంస్థ.. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల చేయనుంది. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం భారీగా విడుదలకు సిద్ధమవుతున్న  నేపథ్యంలో.. విశ్వనటుడు కమల్ హాసన్ ఈ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు. కమల్ చెప్పిన ‘విక్రమ్’ విశేషాలివే..


తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్‌(Rajinikanth)గారిని  కలిశారు కదా.. మీ మధ్య ఎలాంటి అంశాలు చర్చలోకి వస్తుంటాయి?

మేము తరచుగా కలుస్తూనే వుంటాం. గత నలభై ఏళ్లుగా ఇది జరుగుతూనే వుంది. మా సినిమాలు గురించి, స్నేహితుల గురించి సరదాగా మాట్లాడుకుంటాం. ‘‘ ‘విక్రమ్’ సినిమాకి చాలా మంచి వైబ్రేషన్స్ వున్నాయి, కంగ్రాట్యులేషన్స్’’ అని రజనీ చెప్పారు.


రాజకీయాలు (Politics) గురించి కూడా మాట్లాడుతుంటారా?

చాలా తక్కువ. మా ఇద్దరిది భిన్నమైన మనస్తత్వం. మేము ఎప్పుడూ పొలిటికల్ డిబేట్స్ జోలికి వెళ్ళం. మా స్నేహానికి గౌరవం ఇస్తాం.


‘విక్రమ్’ ట్రైలర్‌లో అడవిలో వేట అన్నట్టుగా చూపించారు.. వేటకి సంబంధించిన ఫిలాసఫీ కూడా చెప్పారా?

ఇది కాంక్రీట్ అడవి అనుకుంటే..  ఇది కూడా అడవే.  క్రైమ్ విషయానికి వస్తే డ్రగ్స్ కానీ మరొకటి కానీ.. మనిషిని వేటాడే జంతువులా మారిపోయాడు మనిషి. అనుకోకుండా ఇలాంటి అడవిలో మనమంతా బాగస్వాములుగా వున్నాం. విలన్ అనే వాడు మార్స్ నుండి దిగిరాడు. విక్రమ్ కథలో ఇలాంటి అంశాలన్నీ చూడబోతున్నాం. ఇందులో ప్రతి పాత్రకు రెండు కోణాలు వుంటాయి.


ఇంతకీ ఇందులో విక్రమ్ ఎవరు?

ఇది ముందే చెప్పేస్తే మ్యాజిక్ పోతుంది. మెజీషియన్ తన హార్ట్ నుండి రాబిట్ తీస్తాడు. అది అసంభవమని మనకి తెలుసు. కానీ అది ఎలా తీశాడో మెజీషియన్ చెప్పడు. అదే మ్యాజిక్. విక్రమ్ ఎవరో?.. సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. (నవ్వుతూ)

విక్రమ్ ఎవరో తెలియాలంటే సినిమా చూడాల్సిందే: Kamal Haasan

హీరో నితిన్ హోమ్ బ్యానర్ ‘శ్రేష్ఠ్ మూవీస్’ ఈ చిత్రాన్ని తెలుగులో భారీగా విడుదల చేస్తున్నారు కదా?  

హీరో నితిన్, వారి నాన్న గారు సుధాకర్ రెడ్డిగారికి సినిమాపై ప్యాషన్ వుంది. వారి నిర్మాణంలో చాలా మంచి సినిమాలు వచ్చాయి. వారికి సినిమాల పట్ల మంచి అభిరుచి వుంది. ఈ చిత్రాన్ని దాదాపు 400పైగా థియేటర్స్‌లో భారీగా విడుదల చేయడం ఆనందంగా వుంది. వారికి స్పెషల్ థ్యాంక్స్.    


ఒక సినిమా ఒప్పుకునేటప్పుడు ఏదైనా ఒక ఛాలెంజ్ ఉండేలా చూసుకుంటారు కదా.. విక్రమ్‌లో మీకు ఛాలెంజ్ అనిపించిన అంశం ఏమిటి?

ఈ రోజుల్లో సినిమా బాగా ఆడటం, సినిమా బావుండటం రెండూ ఛాలెంజులే.  మంచి సినిమా తీస్తే ఆడదనే నమ్మకం డిస్ట్రిబ్యూటర్స్‌కి వుంది. అలా కాదని నిరూపించడానికి కాస్త ధైర్యం కావాలి. అంత ధైర్యం వున్న బాలచందర్, విన్సెంట్ మాస్టర్ లాంటి వాళ్ళు చాలా తక్కువ.

 

‘విక్రమ్’లో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్, సూర్య వంటి స్టార్లు కూడా వున్నారు కదా..  వాళ్ళ పాత్రలకు ఎలాంటి ప్రాధాన్యత వుంటుంది?

నా సినిమాల్లో అన్ని పాత్రలకు ప్రాధాన్యత వుంటుంది. నా సినిమాల విషయానికి వస్తే నన్ను నేను ఎప్పుడూ స్టార్ అనుకోను. నేను ఒక ఆర్టిస్ట్‌ని. కానీ అభిమానులు ప్రేమతో స్టార్ అని పిలుస్తారు. కానీ లోపల నేనెప్పుడూ ఒక కళాకారుడినే. కళాకారుడికి నాటకం ముఖ్యం. నేను స్వయంగా రాసిన చిత్రాలలో కూడా పవర్ ఫుల్ పాత్రలు రాశాను. నా చిత్రాలతో చాలా మంది నటీనటులు పరిచయమయ్యారు.. హీరోలయ్యారు. ‘పోతురాజు’  సినిమాలో పశుపతి (Pasupathi),  ‘అన్బే శివం’లో మాధవన్ (Madhavan) పాత్రలు ఎంతో బలమైనవి. ఈ సినిమాలో కూడా అన్ని పాత్రలకూ ప్రాధాన్యత ఉంటుంది.


తెలుగులో నేరుగా సినిమా ఎప్పుడు చేయబోతున్నారు?

నాకూ చేయాలనే వుంది. నేరుగా తెలుగులో సినిమా చేసి చాలా కాలమైంది. దీని కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.


మీరు చేసే ప్రతి సినిమా.. ప్రతి భాషలోకి వెళుతుంది. ఇది ఎప్పటి నుండో వుంది. కానీ ఇప్పుడది పాన్ ఇండియా ట్రెండ్ అయ్యింది. దీన్ని ఎలా చూస్తారు?

ట్రెండ్ అనేది కొత్త న్యూస్ అంతే. చరిత్ర చూస్తే ఇది ఎప్పటి నుండో వుంది. ఏఎన్ఆర్‌గారి ‘దేవదాస్’ (ANR Devadasu) తెలుగు వెర్షన్ చెన్నైలో మూడేళ్ళు ఆడింది. ‘మరోచరిత్ర’ (Marocharitra)కి కూడా ఇదే జరిగింది. ‘సాగర సంగమం’ (Sagara Sangamam) డబ్ చేశారు. ఇది కూడా అక్కడ సిల్వర్ జూబ్లీ విజయాన్ని అందుకుంది. అలాగే ‘స్వాతిముత్యం’ (Swathi Muthyam). పాన్ ఇండియా అనేది కె. బాలచందర్ (K. Balachander) వంటి దర్శకులు ఎప్పుడో ప్రూవ్ చేశారు.


మీరు కూడా తెలుగు, తమిళ అని కాకుండా ఇండియన్ సినిమా అనడానికే ఇష్టపడతారు కదా?

అవునండీ. ప్రస్తుతం హైదరాబాద్ (Hyderabad) నేషనల్ ఫిలిం మేకింగ్ హబ్‌గా వుంది. ముందు చెన్నై వుండేది. నాగిరెడ్డి (Nagireddy)గారి లాంటి దర్శకులు ‘మాయాబజార్’ (Mayabazar) లాంటి చిత్రాలని తెలుగు, తమిళ్‌లో తీసేవారు. ‘రాముడు భీముడు’ (Ramudu Bheemudu) తెలుగు , ‘ఎంగవిట్టి పిళ్ళై’ తమిళ్, ‘రామ్ ఆర్ శ్యామ్’  హిందీ .. ఈ చిత్రాలన్నీ ఒకే నిర్మాణ సంస్థ తీసింది. ‘చంద్రలేఖ’ (Chandralekha) మొదటి పాన్ ఇండియా సినిమా. అలాగే ఇప్పుడు ‘బాహుబలి’ (Bahubali). పాన్ ఇండియా సినిమా అనేది ఎప్పటి నుండో వుంది. బాలీవుడ్ నిర్మాణ సంస్థలు లాంగ్వేజ్ సినిమాలు తీయలేదు కానీ.. సౌత్ నుండి అన్ని భాషల చిత్రాలు తెరకెక్కాయి. రామానాయడు(Ramanaidu)గారు అన్ని భాషల చిత్రాలు తీశారు. ఆయన నేషనల్ ప్రొడ్యుసర్, పాన్ ఇండియా ప్రొడ్యుసర్.


ఓటీటీ(OTT)లో కూడా ఇంత మార్పు వస్తుందని మీరు ముందే గ్రహించారు కదా?

ఓటీటీ మార్పు రావాలని నేనేం పట్టుపట్టలేదు. అది కచ్చితంగా రావాలి. ఇప్పుడు వచ్చింది.  ఐతే ఎన్ని మార్పులు వచ్చినా.. దేని ప్రాధాన్యత దానికి వుంటుంది. చేతికి పెట్టుకునే వాచ్ వచ్చిందని.. టవర్ క్లాక్‌కి డిమాండ్ తగ్గలేదు కదా. తిరుపతి క్యాలెండర్ ఇంట్లో ఉన్నంత మాత్రాన అక్కడ భక్తుల రద్దీ తగ్గిపోదు కదా. థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కూడా అంతే. థియేటర్ అనేది గుడి కంటే గొప్ప చోటని భావిస్తా. ఎందుకంటే పక్కనున్నవాడు ఏ జాతి, మతం అనే పట్టింపు ఎవరికీ వుండదు. ఇది కేవలం స్పోర్ట్స్, సినిమా థియేటర్‌లోనే సంభవిస్తుంది.


ఒకప్పుడు మీ సినిమాని నేరుగా టీవీలో రిలీజ్ చేస్తామంటే గొడవ జరిగింది.. కానీ ఇప్పుడు నేరుగా ఓటీటీలోనే విడుదల చేస్తున్నారు కదా?

కొత్తది ఏది వచ్చినా మొదట భయం వేస్తుంది. పిజ్జాని చూసి కూడా మొదట ఇలానే ఫీలై ఉంటాము కదా.. అయితే కేవలం పిజ్జానే తినాలంటే ఒప్పుకోము.  మనకి ఉలవచారు కూడా ఇష్టం. అన్నీ రుచులు వుంటాయి. అయితే ఫైనల్‌గా ఒక ఒరిజినల్ రుచి బయటికి వస్తుంది. ప్రేక్షకుడు అంతిమంగా సినిమాని థియేటర్‌లో చూడటానికే ఇష్టపడతాడు. మనందరికీ కిచెన్ వుంటుంది. కానీ ఒకరోజు ఫ్యామిలీ అంతా వెళ్లి హాయిగా హోటల్‌లో భోజనం చేస్తాం కదా. ఇదీ అంతే.


అనిరుద్(Anirudh) మ్యూజిక్ గురించి..?

అనిరుద్ పెద్ద కళాకారుల కుటుంబం నుండి వచ్చారు. ఆయన గ్రేట్ గ్రాండ్ ఫాదర్ సుబ్రహ్మణ్యంగారు చాలా అద్భుతమైన కళాకారుడు. చాలా గొప్ప సినిమాలకు పని చేశారు. అనిరుద్ మంచి మ్యూజిక్ ఇవ్వడంలో నాకు ఎలాంటి ఆశ్చర్యం లేదు. అంత గొప్ప  కళాకారుల కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి ఖచ్చితంగా మంచి సంగీతం అందించాలి.


ఈ సినిమాలో పాట కూడా పాడారు?

కె. విశ్వనాధ్‌ (K Viswanath)గారి నుండి నాకు ఒకటే అలవాటు. సినిమా కోసం ఏదైనా చేయమంటే తప్పకుండా చేస్తాను. విక్రమ్‌లో పాట పాడమని అడిగారు. పాడాను.


విశ్వనాధ్ గారిని కలుస్తుంటారా?

చెన్నైలో ఉండేటప్పుడు వారానికి, నెలకి ఒకసారైనా కలిసేవాడిని. ఇప్పుడు ఆయన హైదరాబాద్ వచ్చారు. ఫోన్‌లో తరుచూ మాట్లాడుతుంటాం.

విక్రమ్ ఎవరో తెలియాలంటే సినిమా చూడాల్సిందే: Kamal Haasan

నటన, నిర్మాణం, రాజకీయం.. వీటిని ఎలా బ్యాలన్స్ చేస్తున్నారు?

సౌత్‌లో ఇది కొత్త కాదు. సౌత్‌లో సినిమా, రాజకీయం విడదీయరాని ఒక కలయిక. నా ముందు తరం నటులు, నిర్మాతలు, పెద్దవాళ్ళు అందరూ చేసిందే నేను చేస్తున్నా.


‘భారతీయుడు 2’ దర్శకత్వం మీరే చేస్తున్నారా?

నా నుండి ప్రేక్షకులు ఏడాదికి రెండు సినిమాలైనా కోరుకుంటున్నారు. దర్శకత్వ బాధ్యతలు తీసుకుంటే ఇది సాధ్యపడదు. అందుకే దర్శకత్వం వేరే వాళ్లకు అప్పగించి నటనపై దృష్టిపెట్టాలని భావిస్తున్నా.


‘భారతీయుడు 2’ (Indian 2) ఈ ఏడాది పూర్తవుతుందా?

పూర్తి చేయడానికే ప్రయత్నిస్తున్నాం.


ఫైనల్‌గా ‘విక్రమ్’ గురించి..?

విక్రమ్ డార్క్ మూవీ. దర్శకుడు లోకేష్ కనకరాజ్ అద్భుతంగా తీశారు. విక్రమ్ గ్రేట్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ వున్న సినిమా. అందరూ థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయండి.

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.