మా సైన్యంపై నమ్మకం ఉందంటోన్న ఉక్రెయిన్ డైరెక్టర్

ABN , First Publish Date - 2022-02-26T23:00:11+05:30 IST

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి పాల్పడుతున్న సంగతి తెలిసిందే

మా సైన్యంపై నమ్మకం ఉందంటోన్న ఉక్రెయిన్ డైరెక్టర్

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధంపై ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు గళమెత్తారు. హాలీవుడ్ డైరెక్టర్ డేవిడ్ లించ్ అయితే పుతిన్‌కు తప్పకుండా మరణం సంభవిస్తుందని చెప్పారు. తాజాగా ఉక్రెయిన్ దర్శకుడు స్లానిస్లావ్ కప్రలోవ్ కూడా ఈ ఉదంతంపై స్పందించారు.‘‘నేను కుటుంబంతో కలసి ఉక్రెయిన్‌లో నివసిస్తున్నాను. ప్రస్తుతం ఉక్రెయిన్ నుంచి బయటికి వెళ్లే సూచనలు లేవు. అందువల్ల కీవ్ నుంచి పశ్చిమ ఉక్రెయిన్ ప్రాంతానికి తరలి వచ్చాం. మా నాన్న, అమ్మమ్మ ఇప్పటికి కూడా కీవ్‌లోనే ఉన్నారు. బాంబుల నుంచి తప్పించుకోవడానికి బంకర్లల్లో వారు తలదాచుకున్నారు. ఉక్రెయిన్ సైన్యంపై మాకు నమ్మకం ఉంది. రష్యన్లతో వారు వీరోచితంగా పోరాడుతున్నారు. రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌లో అందరు ఏకమయ్యారు. ఉక్రెయినియన్లు అందరూ హిట్లర్ కాలం నాటి జర్మనీతో రష్యాను పోలుస్తున్నారు. అంతర్జాతీయ సమాజం రష్యా దాడిని ఖండిస్తుంది తప్ప అంతకంటే ఎక్కువ చర్యలు ఏ మాత్రం చేపట్టడం లేదు’’ అని స్లానిస్లావ్ కప్రలోవ్ చెప్పారు. 


హిట్లర్‌ను ఆపడానికి అప్పట్లో మొత్తం యూరప్ ఏవిధంగా ఏకమైందో అదేవిధంగా ఉక్రెయిన్ పోరాడుతుందని చెప్పారు. ప్రస్తుతం ఉక్రెయిన్ ఒంటరి పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. గగనతలాన్ని మూసివేయడానికి నాటో నిరాకరించందన్నారు. రష్యాను స్విఫ్ట్ (సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ పైనాన్షియల్ టెలీ కమ్యూనికేషన్) నుంచి తొలగించడానికి జర్మనీ, ఇటలీ, హంగరీ నిరాకరించయని వెల్లడించారు. 


గతంలో కప్రలోవ్ ‘ఎగ్రెగర్’ అనే మిస్టరి థ్రిల్లర్‌కు దర్శకత్వం వహించారు. మరో కత్త ప్రాజెక్టును పట్టాలెక్కించే ప్రయత్నంలో ఆయన ప్రస్తుతం ఉన్నారు. ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే సదరు చిత్రంలోని కొంత భాగాన్ని చెర్నోబిల్ ప్రాంతంలో షూట్ చేయాలి. కానీ, రష్యన్ మిలిటరీ దళాలు ఈ ప్రాంతాన్ని ఇప్పటికే ఆక్రమించాయి. దీంతో తన మూవీ షూటింగ్‌ను యూరప్‌లో జరపాలని కప్రలోవ్ నిర్ణయించారు.

Updated Date - 2022-02-26T23:00:11+05:30 IST