సినిమా టికెట్ల ధరల నూతన GO: భలే మెలిక పెట్టిన ఏపీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-03-08T03:33:40+05:30 IST

సినిమా టికెట్ల ధరలను సవరిస్తూ ఏపీ ప్రభుత్వం సోమవారం సరికొత్తగా జీవోని జారీ చేసింది. ఇంతకు ముందు ఉన్న టికెట్ ధరలతో పోల్చితే ఈసారి కాస్త వర్క్ చేసి, ఈ జీవోని తయారు చేసినట్లుగా చెప్పుకోవచ్చు. అయితే ఇందులోనూ కొన్ని మెలికలు పెట్టడం ఆశ్చర్యాన్ని కలిగించే..

సినిమా టికెట్ల ధరల నూతన GO: భలే మెలిక పెట్టిన ఏపీ ప్రభుత్వం

సినిమా టికెట్ల ధరలను సవరిస్తూ ఏపీ ప్రభుత్వం సోమవారం సరికొత్తగా జీవోని జారీ చేసింది. ఇంతకు ముందు ఉన్న టికెట్ ధరలతో పోల్చితే ఈసారి కాస్త వర్క్ చేసి, ఈ జీవోని తయారు చేసినట్లుగా చెప్పుకోవచ్చు. అయితే ఇందులోనూ కొన్ని మెలికలు పెట్టడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. చిన్న సినిమాలు కూడా బతకాలంటూ 5వ షో విషయంలో ఏపీ ప్రభుత్వం చేసిన ఆలోచన, అలాగే సూపర్ బడ్జెట్ చిత్రాలకు 10 రోజుల పాటు ధరలు పెంచుకునే అవకాశం విషయంలో ఏపీ ప్రభుత్వం ఈ జీవోలో కొన్ని మెలికలు పెట్టింది. అవేంటంటే..


అలా అయితేనే 5వ షో:

ఉదయం 11 గంటల నుండి రాత్రి 9 గంటల మధ్యలో ఖచ్చితంగా ఒక షోని లో-బడ్జెట్ చిత్రాలకు కేటాయిస్తేనే 5వ షోకు అనుమతి ఉంటుంది. ఎంత పెద్ద చిత్రం ఆడుతున్నా, ఆఖరికి పండగ రోజు అయినా సరే.. ఈ టైమింగ్స్‌లో ఖచ్చితంగా ఒక షో చిన్న చిత్రాలకు కేటాయించాలి. (రెమ్యూనరేషన్స్, నిర్మాణం మొత్తం కలిపి రూ. 20 కోట్ల కంటే తక్కువ బడ్జెట్‌తో నిర్మించబడిన చిత్రాలు లో-బడ్జెట్ చిత్రాలుగా పరిగణించబడతాయి..). ఇది తాజాగా విడుదల చేసిన జీవోలో ఉన్న 7వ షరతు. (అంటే మార్నింగ్ 11 గంటల లోపు, అలాగే రాత్రి 9 గంటల తర్వాత కాకుండా.. మార్నింగ్, మ్యాట్నీ, ఫస్ట్ షో లలో ఏదో ఒక షో ఖచ్చితంగా లో-బడ్జెట్ చిత్రాలకు కేటాయించాలి)




10 రోజుల పాటు రేట్లు పెంచుకోవచ్చు.. కానీ?   

8వ షరతు ప్రకారం.. సూపర్ బడ్జెట్ చిత్రాలకు (అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భారీ క్రియేటివ్ ఎలిమెంట్స్, విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందే చిత్రాలు) భారీగా ఖర్చవుతుంది. ఇలాంటి చిత్రాలను ప్రత్యేకంగా పరిగణించాలని కమిటీ కోరింది. హీరో, హీరోయిన్, డైరెక్టర్ రెమ్యూనరేషన్ కాకుండా.. రూ. 100 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందే చిత్రాలను ఈ పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. అటువంటి చిత్రాలకు ప్రభుత్వ అనుమతితో విడుదల రోజు నుండి 10 రోజుల వరకు టికెట్లను పెంచుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది. అయితే అటువంటి చిత్రాలు కనీసం 20శాతం షూటింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్రీకరణ జరుపుకుని ఉండాలి.

Updated Date - 2022-03-08T03:33:40+05:30 IST