పరిశ్రమ బిడ్డగా కలిశానన్న చిరు.. అది వ్యక్తిగతం అంటోన్న మంచు విష్ణు

ABN , First Publish Date - 2022-02-08T00:50:18+05:30 IST

తెలుగు సినిమా ఇండస్ట్రీ సమస్యలను ఏపీ సీఎం జగన్‌తో కూలంకషంగా చర్చించినట్లుగా ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలోనే ఇండస్ట్రీ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని సమావేశం తర్వాత చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే చిరంజీవి, జగన్‌ల మీటింగ్‌ను

పరిశ్రమ బిడ్డగా కలిశానన్న చిరు.. అది వ్యక్తిగతం అంటోన్న మంచు విష్ణు

తెలుగు సినిమా ఇండస్ట్రీ సమస్యలను ఏపీ సీఎం జగన్‌తో కూలంకషంగా చర్చించినట్లుగా ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలోనే ఇండస్ట్రీ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని సమావేశం తర్వాత చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే చిరంజీవి, జగన్‌ల మీటింగ్‌ను కొందరు.. వ్యక్తిగతమని, రాజకీయాలకు సంబంధించిన మీటింగ్ అంటూ రూమర్స్ క్రియేట్ చేయడంతో.. వాటిపై కూడా చిరు ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చారు. ఆ తర్వాత ఆ విషయం అక్కడితో సర్దుమణిగింది. ఇప్పుడు సమస్య పరిష్కారం దిశగా నడుస్తున్న సమయంలో.. మంచు విష్ణు వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. చిరు, జగన్‌ల భేటీని వ్యక్తిగతం అంటూ మంచు విష్ణు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో మరోసారి దుమారాన్ని రేపుతున్నాయి.  


ఏపీ సీఎం జగన్‌తో సమావేశానంతరం చిరు ఏం చెప్పారంటే.. 

1. కొద్ది రోజులుగా సినిమా టికెట్‌ ధరల విషయంలో ఒక మీమాంశ ఉంది. దీని వల్ల పరిశ్రమలో అగమ్యగోచర పరిస్థితి ఏర్పడింది. ఏం జరుగుతుందోననే అసంతృప్తి ఓ వైపు.. ఇండస్ర్టీకి మంచి చేద్దామనేదే తమ ఉద్దేశం అని చెబుతున్న ప్రభుత్వం ఒక వైపు. పరిష్కారం దొరకని ఈ సమస్య రోజురోజుకి పెద్దది అవుతోంది. ఈ నేపథ్యంలో సీయం జగన్‌ ప్రత్యేకంగా నన్ను పిలిచారు. ఒక సమస్య గురించి నిర్ణయం తీసుకునే ముందు ఒక కోణంలోనే వినటంకాదు రెండో కోణంలోనూ వినాలని అన్నారు. 


2. మీరు వచ్చి సమస్యలను వినిపిస్తే దానిపై తుది నిర్ణయం తీసుకోవచ్చు అని ఆయన నాతో అన్న మాటలకు నాపై పెట్టిన నమ్మకం, భరోసా ఎంతో బాధ్యతగా అనిపించింది.


3. సామాన్య ప్రజలకు వినోదం అందుబాటులో ఉండాలనే ఆయన ప్రయత్నాన్ని అభినందిస్తూ, పరిశ్రమలో ఉన్న సాధక బాధకాలు, ఎగ్జిబిషన్‌ రంగంలో థియేటర్‌ యజమానులు పడుతున్న కష్టాలను ఆయనకు వివరించాను. ఆయన సానుకూలంగా స్పందించారు.


4. థియేటర్లు మూసి వేయాలనే అభద్రతా భావం కూడా ఉంది. ఈ సమస్యలు అన్నింటిని జగన్‌‌గారి ముందు ఉంచాను. అన్నింటినీ ఆయన అవగాహన చేసుకున్నారు. అన్ని కోణాల్లోనూ ఆలోచించి అందరికీ మంచి జరిగేలా నిర్ణయం తీసుకుని జీవో పాస్‌ చేస్తామని ధైర్యం కల్పించేలా మాట్లాడారు.


5. దయచేసి పరిశ్రమకు సంబంధించిన ఎవరూ కూడా మాటలు జారవద్దు. నా మాట మన్నించి సంయమనం పాటించండి.


6. ఆయనతో జరిగిన చర్చ మొత్తాన్ని మా ఇండస్ట్రీకి సంబంధించిన అందరికీ తెలియజేస్తానని, వారేమన్నా సలహాలు ఇస్తే వాటిని కూడా తర్వాతి మీటింగ్‌లో మీ ముందు ఉంచుతానని జగన్‌‌గారితో చెప్పాను 


7. తర్వాత మీటింగ్‌కు జగన్‌గారు వందమందితో రమ్మంటే పరిశ్రమ అందరితోనూ వస్తాను.. అదే అందంగా ఉంటుంది. ఇప్పుడు జగన్‌గారితో మాట్లాడటానికి పరిశ్రమ పెద్దగా కాదు.. బిడ్డగా వచ్చాను.


జనవరి 13న సీఎం జగన్, మెగాస్టార్ చిరంజీవి మధ్య జరిగిన సమావేశంపై నేడు(ఫిబ్రవరి 07) ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు కామెంట్స్:


1. ఇటీవల చిరంజీవిగారు జగన్‌ని కలిశారు. అది వ్యక్తిగత సమావేశం. దానిని అసోసియేషన్‌ మీటింగ్‌గా భావించకూడదు. 


2. రెండు ప్రభుత్వాలు ఇండస్ట్రీని ప్రోత్సహిస్తున్నాయి. ప్రభుత్వాలతో ఛాంబర్‌ చర్చలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ ఇస్తోంది. అలా కాకుండా వ్యక్తిగతంగా కలవాలని కోరితే మేం కూడా ఆయా ప్రభుత్వాలను కలిసి చర్చిస్తాం.


అయితే మంచు విష్ణు చేసిన ఈ కామెంట్స్‌‌‌తో ప్రస్తుతం ఆయనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. ఇండస్ట్రీ సమస్యలలో ఉన్నప్పుడు ఎవరో ఒకరు సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నప్పుడు.. వీలైతే మద్దతు అందించాలి.. లేదంటే కామ్‌గా ఉండాలి. చిరంజీవి అంత క్లియర్‌గా చెప్పినా.. ‘వ్యక్తిగతం.. అదీ, ఇదీ’ అంటూ మాట్లాడటం మీ మధ్య వైరాన్ని తెలియజేస్తుంది తప్ప.. మరొకటి కాదంటూ మంచు విష్ణు మాటలపై నెటిజన్లు రియాక్ట్ అవుతుండటం గమనార్హం. ఏపీ సీఎంతో చాలా దగ్గర సంబంధాలు కలిగిన మీరు.. ఈ సమస్యను ఇంత వరకు రానీయకుండా చేసి ఉంటే.. ఈ రోజు ఇండస్ట్రీ ఇంకోలా ఉండేదని.. అప్పుడు మీరు ఏం మాట్లాడినా దానికో అర్థం ఉండేదంటూ విష్ణు వ్యాఖ్యలపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - 2022-02-08T00:50:18+05:30 IST