ఆయన సినిమా పాటలు రాసినందుకు చింతిస్తున్నాను.. సిరివెన్నెల గురించి త్రివిక్రమ్ గతంలో అన్న మాటలివి..

ABN , First Publish Date - 2021-12-01T01:20:47+05:30 IST

ఇంతకీ, భీమవరంలోని ఆ 16 ఏళ్ల కుర్ర వాడు ‘శబ్దరత్నాకరం’ ఎందుకు వెదికి పట్టుకుని, తన అన్వేషణ మొదలు పెట్టాడు? 2012లో ‘మా మ్యూజిక్ అవార్డ్స్’ ఫంక్షన్ సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్.. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గురించి చెప్పిన మాటలు అక్షరమక్షరం చదివితే మనకు స్పష్టంగా అర్థం అవుతుంది...

ఆయన సినిమా పాటలు రాసినందుకు చింతిస్తున్నాను.. సిరివెన్నెల గురించి త్రివిక్రమ్ గతంలో అన్న మాటలివి..

సిరివెన్నెల సీతారామ శాస్త్రి, త్రివిక్రమ్... వారిద్దరి బంధమూ, అనుబంధమూ... అందరికీ తెలిసినవే. ఆయన రచయిత, ఈయన దర్శకుడు మాత్రమే కాదు... ఆయన మామ, ఈయన అల్లుడు కూడా! త్రివిక్రమ్‌కు ఆయన భార్య తరుఫు నుంచీ సిరివెన్నెల సీతారామశాస్త్రి అత్యంత దగ్గరి బంధువు అవుతారు. కానీ, అది కూడా నిజంగా విశేషమేం కాదు. ఎందుకంటే, పాటల మాంత్రికుడు సిరివెన్నెలతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ది ఇంకా, ఇంకా పురాతన సాహితీ బంధం! అసలు ఆకేళ్ల శ్రీనివాస్... త్రివిక్రమ్‌గా సినీ రంగంలో అవతరించక ముందే... సీతారామ శాస్త్రి తీవ్రమైన ప్రభావం చూపారు ‘గురూజీ’ మీద! గురూజీకే గురూజీగా మారి ఏళ్ల కిందటే గొప్ప ప్రేరణనిచ్చారు! ఇంతకీ, భీమవరంలోని ఆ 16 ఏళ్ల కుర్ర వాడు ‘శబ్దరత్నాకరం’ ఎందుకు వెదికి పట్టుకుని, తన అన్వేషణ మొదలు పెట్టాడు? 2012లో ‘మా మ్యూజిక్ అవార్డ్స్’ ఫంక్షన్ సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్.. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గురించి చెప్పిన మాటలు అక్షరమక్షరం చదివితే మనకు స్పష్టంగా అర్థం అవుతుంది... 


“సీతారామ శాస్త్రి పోయెట్రీ గురించి చెప్పటానికి నాకున్న శక్తి సరిపోదు. నాకున్న వొకాబులరీ సరిపోదు. సిరివెన్నెల సినిమాలోని పాట విన్నాకే తెలుగు డిక్షనరీ.. ‘శబ్ద రత్నాకరం’ ఒకటి ఉంటుంది అనేది ఫస్ట్ తెలుసుకున్నాను. శబ్ద రత్నాకరం చూసి ఆ పాటలోని ఒక్కో పదానికి అర్థం తెలుసుకున్నాను. 


ఆడియన్స్ చూసే, అర్థమయ్యే పాటలే కాదు.. అర్థం చేసుకోవాలి అనే కోరికను కూడా పుట్టించే పాటలు రాయొచ్చని ఆ తర్వాతే అనిపించింది. తెలుగు పాట స్థాయిని పెంచిన వ్యక్తి సీతారామశాస్త్రి.


పదహారేళ్ల కుర్రాడు ఓ పాటలోని అర్థం తెలుసుకుని ఆ రోజుకు ఆ ఎగ్జైట్ మెంట్ తో పడుకుంటాడు. అలాంటి తపనను రేకెత్తించగలిగిన స్థాయి ఉన్న కవి ఆయన. సినిమా పాటలో అనేక గొప్ప పదాలు తీసుకొచ్చి.. ప్రేక్షకుడి స్థాయిని పెంచిన కవి సీతారామశాస్త్రి.


చిరంజీవి సినిమాలో “తరలి రాద తనే వసంతం.. తన దరికి రాని వనాల కోసం” అనే మాటలు పాటలో రాయడానికి, దర్శకుడు, నిర్మాతను ఒప్పించడానికి సీతారామశాస్త్రికి ఎన్ని గట్స్ ఉండాలో దర్శకుడిగా నాకు తెలుసు. అందుకే ఆయన పాదాలకు నమస్కారం పెడుతున్నా.


‘బొబ్బిలిరాజా‘లో.. ‘కొమ్మల్లో కుకూలు.. కొండల్లో ఎకోలు..’ అనే సర్రిలియజిస్టిక్ పోయెట్రీని దివ్యభారతి, వెంకటేశ్ డ్యూయెట్ లో పెట్టడానికి అక్కడ స్పేస్ లేదు. స్పేస్‌ను ఆయన క్రియేట్ చేసుకుని దాన్ని తీసుకున్నాడు. ఆయన వాడుకున్నాడు. కమర్షియల్ సినిమా అంటే.. దిగజారుడు సాహిత్యం కాదు. ఆ ఇరుకు సందులో కూడా ఆయన గొప్ప సాహిత్యాన్ని ఇరికించగలిగాడు. చార్మినార్ సందులో పోర్స్చే కారును నడపలేం. ఆయన పాటలు అలాంటివే. ఆయన తన పాటల్లో స్పేస్ క్రియేట్ చేసుకోగలిగారు.


హీరోల ఇమేజ్, దర్శకుల అర్థంలేని తనం, నిర్మాతల వ్యాపార విలువలు, ప్రేక్షకుల అర్థం చేసుకోలేని తనం వీటన్నింటి మధ్యలో కూడా గొప్ప పాటను ఇవ్వడానికి రాత్రుళ్లు ఆయన టేబుల్ మీద ఆయన ఖర్చుచేసుకున్న క్షణాలు.. ఆయన ఖర్చుచేసుకున్న జీవితం.. ఆయన ఒదులుకున్న కుటుంబం.. ఆయన మాట్లాడలేని మనుషులు.. ఇలా ఎంతో విలువైన జీవితాన్ని కోల్పోయారు.


సిరివెన్నెల ప్రపంచమంతా పడుకున్నాక లేస్తారు. ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు.. అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు. ఆయన పదాలు అనే కిరణాలు తీసుకుని.. అక్షరాలు అనే తూటాలతో ప్రపంచం మీద వేటాడటానికి బయల్దేరతారు. మనం సమాధానం చెప్పలేని ప్రశ్నలను సంధిస్తాడు. మన ఇంట్లోకి వస్తాడు..మన హాల్లో కూర్చుంటాడు. మన బెడ్రూంలో మన పక్కనే నిలబడతాడు. మనల్ని క్వశ్చన్ చేస్తాడు. ఎప్పుడూ ఓటమి ఒప్పుకోవద్దు అంటాడు.


కొన్నేళ్లకిందట లక్డీకాపూల్ లో అమరావతి సినిమా హాల్లో ‘సింధూరం’ చూశాను. సినిమా మొత్తం అయిపోయింది. ఏదో అసంతృప్తి ఉంది. ఆ చివర్లో ‘అర్థశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా’ అనే పాటలోని ఆ ఒక్క మాటతో రెండు చేతులు జేబులో పెట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నాను. నేను ఎక్కడికి వెళ్తున్నానో కూడా తెలియదు.

ఒక మనిషిని ఇంతలా కదిలించగల శక్తి సాహిత్యానికి, అక్షరానికి మాత్రమే ఉంటుంది.


ఆయన తెలుగు సినిమా కవి అవ్వడం మూలంగా.. ఇక్కడే మిగిలిపోయాడేమోనని బాధగా ఉంది. సినిమా పాటకు ఇక్కడ సాహిత్య విలువ లేదు. చాలామంది కవులు సినిమాలకు పాటలు రాయడం మూలంగా ఎందుకూ పనికిరాకుండా పోయారు. నోబుల్ స్థాయి వచన కవిత్వం రాయగలిగిన సీతారామశాస్త్రి అందరి మధ్యలో వెనకాల కూర్చుండిపోయారు. గొప్ప కవులంతా తెలుగు సినిమాకు పాటలు రాయడం వాళ్ల దురదృష్టం. మనందరి అదృష్టం. నేను తప్పులు మాట్లాడితే అందరూ క్షమించాలి.        

Updated Date - 2021-12-01T01:20:47+05:30 IST