కథలతో హీరోల దోస్తీ

ABN , First Publish Date - 2022-03-27T05:30:00+05:30 IST

ఇప్పుడు టాలీవుడ్‌లో కొందరు యువ హీరోలు నటన వరకే తమ పరిధి అని గిరిగీసుకోని ఆగిపోవడం లేదు. తాము నటిస్తున్న సినిమా కథలపైనా కసరత్తులు చేస్తున్నారు...

కథలతో హీరోల దోస్తీ

ఇప్పుడు టాలీవుడ్‌లో కొందరు యువ హీరోలు నటన వరకే తమ పరిధి అని గిరిగీసుకోని ఆగిపోవడం లేదు. తాము నటిస్తున్న సినిమా కథలపైనా కసరత్తులు చేస్తున్నారు.  ఒక మంచి లైన్‌ అనుకుని కథను డెవలప్‌ చేస్తున్నారు. కొందరు హీరోలు సంభాషణల విషయంలో మాట సాయం చేస్తుంటే,  మరికొందరు ఏకంగా  డైలాగులు రాసేసి ఫుల్‌బౌండ్‌ స్ర్కిప్ట్‌తో సిద్ధమవుతున్నారు. దర్శకులతో కలసి సినిమా బాగా వచ్చేందుకు తమ రచనా నైపుణ్యానికి సాన పెడుతున్నారు. 


రైటర్‌గా, హీరోగా సక్సెస్‌

2019లో ‘రాజావారు రాణిగారు’ చిత్రంతో పరిశ్రమకు హీరోగా పరిచయమయ్యారు కిరణ్‌ అబ్బవరం. మంచి ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరితో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారాయన. అదే స్పీడ్‌లో తను స్వయంగా రాసుకున్న కథతో ‘ఎస్‌ ఆర్‌ కల్యాణమండపం’ చిత్రం తీసి కరోనా సమయంలో థియేటర్లలో విడుదల చేసి హీరోగా మంచి విజయమే అందుకున్నారు. తన జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనల ఆధారంగా కిరణ్‌ అబ్బవరం ఆ కథను రాసుకున్నారు. ఆ సినిమా  ఆయన్ను కుటుంబ ప్రేక్షకులకు దగ్గర చేసింది. అటు హీరోగా, ఇటు కథా రచయితగానూ కిరణ్‌ అబ్బవరం ఆ చిత్రంతో సక్సెస్‌ అందుకున్నారు. 


సినిమాల్లోకి రాకమునుపు బెంగళూరులో ఉద్యోగం చేస్తూ సొంతంగా రాసుకున్న కథలతో షార్ట్‌ ఫిల్మ్‌లు తీసిన అనుభవం కిరణ్‌ సొంతం. ఆ అనుభవంతో సొంతంగా కథలు రాసుకున్నట్టు ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తను హీరోగా చేసే చిత్రాల కథ, స్ర్కీన్‌ప్లే రూపకల్పనలో  దర్శకులతో కలసి వర్క్‌ చేయడం కిరణ్‌ అబ్బవరానికి అలవాటు. ఓ పక్క హీరోగా కొత్త సినిమాలతో బిజీగా ఉన్నా కథలు రాయడం మాత్రం మానలేదు. 


స్ర్కీన్‌రైటర్‌ గా సక్సెస్‌ ట్రాక్‌పైకి

గతేడాది ‘జాతిరత్నాలు’తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్నారు హీరో నవీన్‌ పొలిశెట్టి. నటుడిగానే కాదు కథలు రాయడంలోనూ ఆయన దిట్టే. సినిమాల్లోకి రాకమునుపు కొన్నాళ్లు ఆయన స్టాండప్‌ కమెడియన్‌గా పనిచేశారు. అప్పుడు తన షోల కోసం సొంతంగా స్ర్కిప్ట్‌ రాసుకొనేవారు. ఇండస్ట్రీకి వచ్చాక నవీన్‌కు ఆ అనుభవం అక్కరకొచ్చింది. 


హీరోగా నటించిన తొలి చిత్రం ‘ఏజంట్‌ సాయి శ్రీనివాస్‌ ఆత్రేయ’ హిట్టవడంలో తెరవెనుక ఆయన కృషి చాలా ఉంది. దర్శకుడు స్వరూప్‌ ఆర్‌ఎస్‌జెతో కలసి స్ర్కిప్ట్‌ను అద్భుతంగా మలిచాడు. ముందు హీరోగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే ప్రయత్నంలో ఆయన నిమగ్నమయ్యారు. భవిష్యత్తులో మంచి కథలతో రచయితగానూ ప్రేక్షకులను అలరించడం ఖాయం అంటున్నారు నవీన్‌ పొలిశెట్టి. 


హిట్‌ బాట పట్టారు...

ఇండస్ట్రీలో కథానాయకుడిగా అవకాశాలు పొందడం అంత సులభం కాదు. అదే మంచి కథ ఉంటే నిర్మాతను ఒప్పించడం కొంచెం తేలికే. అడివి శేష్‌ హీరోగా నటించిన తొలి చిత్రం ‘కర్మ’. సొంతకథతో ఆయనే దర్శకత్వం వహించారు. సినిమా నిరాశపరిచింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో సహాయనటుడి  పాత్రలు చేస్తూనే  హీరోగా అవకాశాల కోసం ప్రయత్నించారు. 2016లో ‘క్షణం’ చిత్రం హీరోగా ఆయన కెరీర్‌కు బ్రేక్‌ ఇచ్చింది. దర్శకుడు రవికాంత్‌తో కలసి ఈసినిమాకు శేష్‌ కథను అందించారు.


హీరోగా ఆయనకు ఈ సినిమా టర్నింగ్‌ పాయింట్‌గా నిలిచింది. పలు భాషల్లో అగ్రహీరోలతో ఆ సినిమాను రీమేక్‌ చేశారు. ఆ తర్వాత సొంత కథతో ‘గూఢచారి’ రూపంలో శేష్‌ మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. దీనికి సీక్వెల్‌గా రాబోతున్న ‘గూఢచారి 2’ సినిమాకు కథ, స్ర్కీన్‌ప్లే రూపొందిస్తున్నట్టు శేష్‌ గతంలో తెలిపారు. అలాగే  ‘మేజర్‌’ చిత్రంతో త్వరలో ఆయన ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవిత కథతో ఈ చిత్రం తెరకెక్కింది. దీనికి అడివిశేష్‌ కథను సమకూర్చారు. 


సొంత కథతో సక్సెస్‌

తొలి చిత్రం ‘సెహరి’తో హర్ష్‌ కనుమిల్లి  హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన తొలి సినిమాకు ఆయనే కథను అందించడం విశేషం. షార్ట్‌ ఫిలిమ్స్‌, యాడ్స్‌లో నటించిన అనుభవంతో ఎన్నో ప్రయత్నాలు చేసినా సినిమాల్లో మాత్రం హీరోగా అవకాశాలు రాలేదు. దాంతో లాభం లేదని సొంతంగా అవకాశాలు సృష్టించుకునేందుకు కథలు రాయడంపైన దృష్టి పెట్టానని హర్ష్‌ చెప్పారు.


డీజే మోగించారు

‘డీజే టిల్లు’తో ఈ ఏడాది సూపర్‌హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు హీరో సిద్ధు జొన్నలగడ్డ. హీరోగా నిలదొక్కుకోవడానికి చాలా స్ట్రగుల్‌ అయ్యారాయన. రూటు మార్చి సొంత కథతోనే హీరోగా తొలి సక్సెస్‌ను ఒడిసిపట్టారు సిద్ధు.


గత చిత్రాల వైఫల్యాలను మరిపిస్తూ సొంత కథతో 2016లో ‘గుంటూరు టాకీస్‌’తో మంచి హిట్‌ను సొంతం చేసుకున్నారు. ఆ చిత్ర దర్శకుడు ప్రవీణ్‌ సత్తార్‌కు కథా రచనలో సహకారం అందించడంతో పాటు సిద్ధు సంభాషణలు సమకూర్చారు. ‘మా వింత గాథ వినుమా’కు సిద్ధూనే కథను  అందించారు. గతేడాది వచ్చిన ‘కృష్ణ అండ్‌ హీజ్‌ లీలా’ సినిమాకు దర్శకుడు రవికాంత్‌తో కలసి ఆయన కథను డెవలప్‌ చేశారు. ‘డీజే టిల్లు’ చిత్రానికి కూడా దర్శకుడు విమల్‌కృష్ణతో కలసి ఆయన స్టోరీ, డైలాగ్స్‌ను అందించారు. 


విష్వక్‌  సేన్‌

విభిన్నమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ హీరోగా మంచి అభిమానగణాన్ని పొందారు విష్వక్‌ సేన్‌. ఆయనలో  మంచి నటుడే కాదు రచయితా ఉన్నాడు. సొంత కథతో ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫలక్‌నుమా దాస్‌’. సోలో హీరోగా ఆయనకు ఇది తొలి హిట్‌. ఈ సినిమాకు కథ కూడా ఆయనే రాసుకున్నారు. ప్రస్తుతం స్వీయ దర్శకత్వంలో ‘దాస్‌ కా ధమ్కీ’ చిత్రం చేస్తున్నారు. ఇది పూర్తయ్యాక సొంత కథతో ఓ సినిమా చేయనున్నారట విష్వక్‌. 


కథలతో హీరోల కుస్తీ ఎందుకంటే...

ఒక సూపర్‌ హిట్‌ కథను అందించడం చాలాసార్లు చేయి తిరిగిన రచయితలకే తలకు మించిన పని అవుతోంది. సూపర్‌ హిట్‌ సినిమాలకు కథలు అందించిన అగ్రస్థాయి రచయితలే వరుస వైఫల్యాలతో తెరమరుగు అవుతున్నారు. అలాంటిది ఏదో తమ పాత్ర వరకూ చేసుకొని వెళ్లక కొందరు ఈ తరం హీరోలు ఇలా కథలతో కుస్తీ పట్టడానికి చాలా కారణాలున్నాయి. 


సినిమాకు కథే హీరో. ప్రాణం కూడా.  కథాబలంతో సూపర్‌హిట్‌ కొట్టిన చిన్న హీరోల సినిమాలు పరిశ్రమలో ప్రతి ఏటా చెప్పుకోదగిన స్థాయిలోనే వస్తున్నాయి అలాగే భారీ బడ్జెట్‌తో అగ్రతారలు, స్టార్‌ డైరెక్టర్ల కాంబినేషన్‌లో మంచి హైప్‌తో వచ్చి బాక్సాఫీసు దగ్గర బోల్తాపడిన చిత్రాలనూ చూస్తున్నాం. దర్శకుడుకి ఎంత  విజన్‌ ఉన్నా, నిర్మాత ఎంత ఖర్చుపెట్టినా, నటీనటులు తమ పాత్రలలో ఒదిగిపోయి నటించినా కథ బాగోలేకపోతే సినిమా తేలిపోతుంది. రూ. కోట్ల కష్టం, శ్రమ బూడిద లో పోసిన పన్నీరే. అందుకే కొత్త హీరోల చూపు సొంత కథలపై పడుతోంది. ఒక మంచి కథ చేతిలో ఉంటే హీరోగా అవకాశాలు పొందొచ్చు, ఒక మంచి హిట్‌ పడితే హీరోగా నిలదొక్కుకోవచ్చు అని ఆలోచిస్తున్నారు. 


విజయాల శాతం ఎక్కువే

ఈతరం హీరోలకు కాలేజీ రోజుల నుంచే నటన, దర్శకత్వం, రచనవైపు ఆసక్తి ఉండడమూ దీనికి కారణంగా చెప్పవచ్చు. కథలు, కవితలతో మొదలై సినిమా కథలు రాసేలా వారిని పురికొల్పుతోంది. ముఖ్యంగా ఏ అండా లేకుండా పరిశ్రమకు వచ్చిన నటులు సొంత కథలనే నమ్ముకుంటున్నారు. తమకు నచ్చినట్టు కథలో మార్పులు చేర్పులు చేసుకునే వెసులుబాటు కొత్త హీరోలకు చాలా తక్కువ. అందుకే నిర్మాతలను ఒప్పించి సొంత కథలతోనూ సినిమాలు చేస్తున్నారు.


దర్శకులతో కలసి కథలకు మెరుగులు దిద్దుతున్నారు. అయితే హీరోలు రాసిన కథలూ నూటికి నూరుశాతం హిట్‌ అవుతాయనే గ్యారంటీ లేదు. కానీ హీరోలు రాసుకున్న కథలో విజయాల శాతం ఎక్కువే అని చెప్పుకోవాలి. అందుకే కొందరు హీరోలు కథ, కథనంలో తమ మార్క్‌ చూపే సాహసం చేస్తున్నారు. 

Updated Date - 2022-03-27T05:30:00+05:30 IST