Tollywood: ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో ప్రొడ్యూసర్స్ గిల్డ్ కలిసిపోనుందా?

ABN , First Publish Date - 2022-09-03T19:09:33+05:30 IST

గత కొన్ని వారాలుగా నిర్మాతలు సినిమా నిర్మాణ వ్యయం ఎలా తగ్గించాలి అన్న విషయం మీద చర్చలు జరుపుతూనే వున్నారు. ఆ చర్చలు ఇంకా ఒక కొలిక్కి రాలేదని చిత్ర పరిశ్రమలో అంటున్నారు.

Tollywood: ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో ప్రొడ్యూసర్స్ గిల్డ్  కలిసిపోనుందా?

గత కొన్ని వారాలుగా నిర్మాతలు సినిమా నిర్మాణ వ్యయం ఎలా తగ్గించాలి అన్న విషయం మీద చర్చలు జరుపుతూనే వున్నారు. ఆ చర్చలు ఇంకా ఒక కొలిక్కి రాలేదని చిత్ర పరిశ్రమలో అంటున్నారు. అదలాఉంటే, ఇంకో కొత్త విషయం కూడా పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది. అదేమంటే కొంతమంది నిర్మాతలు కొన్ని సంవత్సరాల కిందట మొదలు పెట్టిన యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ (Active Telugu Film Producers Guild- ATFPG) అనే సంస్థని ఇప్పుడున్న ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (Telugu Film Producers Council - TFPC) లో విలీనం చేయబోతున్నట్టు సమాచారం. ఈ విలీన ప్రక్రియ ఈ నెల 6వ తేదీన జరగబోతోందని, ఆరోజు విలీనం గురించి నిర్మాతల మండలి మీడియా ప్రతినిధులకు తెలియజేసే అవకాశం ఉందనుకుంటున్నారు.


ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అనే సంస్థ చిత్ర పరిశ్రమ మొదటి రోజుల్లోనే పెట్టిన సంస్థ. అందులో చాలామంది నిర్మాతలు చిత్రనిర్మాణ రంగంలో క్రియాశీలంగా లేరనే ఉద్దేశంతో, సుమారు 70 మంది నిర్మాతలు కౌన్సిల్ నుంచి విడిపోయి వేరే కుంపటి పెట్టుకున్నారు. దానికి యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అనే పేరు పెట్టి ఈ కౌన్సిల్ కి పోటీగా కార్యకలాపాలు సాగించారు. అయితే, ఆ ప్రయత్నాల మీద అప్పట్లోనే చాలామంది నిర్మాతలు విమర్శలు గుప్పించారు, అలా వేరు కుంపటి పెట్టడం సరి కాదన్నారు. సినిమా పరిశ్రమకి సంబంధించి చురుకుగా వ్యవహరించాలన్న తపనతో మొదలు పెట్టబడిన గిల్డ్ కి ఆదినుండే కష్ఠాలు మొదలయ్యాయి.


అందులో వుండే నిర్మాతల్లో వాళ్లలో వాళ్ళకే సఖ్యత లేకపోవటం మూలాన అది సరిగ్గా పనిచెయ్యలేకపోయింది. యాక్టివ్ అనే పదం సంస్థ పేరులో నామమాత్రంగా ఉండిపోయిందనీ, యాక్టివ్ గా ఉండాల్సిన సమయాల్లో కూడా అందులోని నిర్మాతలు మాట్లాడకుండా మౌనం వహించటంతో గిల్డ్ మీద చాలా విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ చిత్ర పరిశ్రమలో సమస్యలు రేగిన ప్రస్తుత పరిస్థితుల్లో, గిల్డ్ లో నిర్మాతలని ఎవరూ పట్టించుకోకపోవటం, కౌన్సిల్ మొదటి నుండి వున్నా సంస్థ కాబట్టి దాని ప్రాతినిథ్యాన్నే చాలామంది నిర్మాతలు గుర్తిస్తుండటం వల్ల గిల్డ్ కి కష్ఠాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రొడ్యుసర్స్ కౌన్సిల్ లో ప్రొడ్యూసర్స్ గిల్డ్ విలీనం కాబోతోందని తెలుస్తోంది.

Updated Date - 2022-09-03T19:09:33+05:30 IST