ఎప్పుడు తగ్గాలో తెలుసుకున్నోళ్లే... గొప్పోళ్లు!

ABN , First Publish Date - 2022-07-03T09:35:45+05:30 IST

‘‘ఎక్కడ నెగ్గాలో కాదు... ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే గొప్పోడు’’ అని ‘అత్తారింటికి దారేది’ కోసం త్రివిక్రమ్‌ ఓ మంచి మాట రాశారు. ఔను... తగ్గడం తెలిసినోడే నెగ్గుతాడు.

ఎప్పుడు తగ్గాలో తెలుసుకున్నోళ్లే... గొప్పోళ్లు!

‘‘ఎక్కడ నెగ్గాలో కాదు... ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే గొప్పోడు’’ అని ‘అత్తారింటికి దారేది’ కోసం త్రివిక్రమ్‌ ఓ మంచి మాట రాశారు. ఔను... తగ్గడం తెలిసినోడే నెగ్గుతాడు. అన్ని చోట్లా ఈ మాట వంద శాతం కరెక్ట్‌.. ‘బరువు’ విషయంలో అయితే నూటికి రెండొందల శాతం కరెక్ట్‌. కాస్త ఎక్కువ తింటే చాలు. ‘అమ్మో.. లావైపోతాం’ అనే భయం పట్టుకొంటుంది. సినిమావాళ్లకు ఇది ఇంకాస్త ఎక్కువ. ఎందుకంటే అది అసలే గ్లామర్‌ ప్రపంచం. కాస్త బొద్దుగా కనిపిస్తే పక్కకు నెట్టేస్తారు. హీరోలైనా, హీరోయిన్లయినా బరువు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఫిట్‌నెస్‌ విషయంలో అస్సలు రాజీ పడరు. అయితతే కొన్ని కొన్నిసార్లు బరువు తగ్గడం, పెరగడం తమ చేతుల్లో లేకుండా పోతుంది. సడన్‌గా చూస్తే... బొద్దుగా మారిపోతారు. ఆ వెంటనే తగ్గే ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంటారు. ఇదంతా సాధారణంగా జరిగే విషయాలే. ఇప్పుడు టాలీవుడ్‌లో కొంతమంది ప్రముఖులు బరువు తగ్గేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.


‘బాహుబలి’లో చాలా ఫిట్‌గా కనిపించారు ప్రభాస్‌. అది రాజమౌళి సినిమా. పైగా ఓ యుద్ధ వీరుడి కథ. అందుకే ఆ పాత్రకు తగినట్టుగా తన శరీరాన్ని మార్చుకొన్నారు ప్రభాస్‌. ఆ వెంటనే వచ్చిన ‘సాహో’లోనూ ప్రభాస్‌ లుక్‌ బాగుంది. అయితే ఆ తరవాత మెల్లగా బరువు పెరగడం ప్రారంభించారు. ‘రాధేశ్యామ్‌’ సమయంలో ప్రభాస్‌ విపరీతంగా బరువు పెరిగారు. సినిమాలో సీజీ వర్కుల వల్ల.. ఆయన కాస్త స్లిమ్‌గానే కనిపించారు గానీ, బయట మాత్రం ప్రభాస్‌ లుక్‌ ఆయన ఫ్యాన్స్‌ని ఆందోళనలో పడేసింది. ‘మా హీరో లావైపోయాడు’ అనే భయం పట్టుకొంది. ఈ విషయాన్ని ప్రభాస్‌ కూడా చాలా త్వరగా కనిపెట్టేశారు. అందుకే ఇప్పుడాయన బరువు తగ్గారు. ఇది వరకటితో పోలిస్తే ప్రభాస్‌ ఇప్పుడు స్లిమ్‌గా మారారు. ‘ప్రాజెక్ట్‌ కె’లో ఆయన కొత్త లుక్‌లో కనిపించనున్నారు. త్వరలోనే మారుతి సినిమాని పట్టాలెక్కిస్తారు. ఆ సినిమా కోసం ప్రభాస్‌ మరింత బరువు తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ నటన మర్చిపోలేం. ఎమోషన్‌ సీన్లలో ఆయన కంటతడి పెట్టించారు. ‘కొమురం భీముడో..’ పాటలో అయితే మరీనూ. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్‌ లుక్‌ ఇది వరకటితో పోల్చి చూస్తే కాస్త మారింది. ‘భీమ్‌’ పాత్రకు తగినట్టుగా ఆయన బరువు పెరిగారు. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ అయిపోయింది. ఇప్పుడు కొత్త సినిమా మొదలెట్టాలి. అందుకే... ఆయన మళ్లీ బరువు తగ్గారు. త్వరలోనే కొరటాల శివ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో స్లిమ్‌ అయిన ఎన్టీఆర్‌ని చూడబోతున్నారు. శర్వా కూడా ఈమధ్య బాగా లావైపోయారు. ‘ఆడాళ్లూ మీకు జోహార్లూ’లో మరింత బొద్దుగా కనిపించారు. ‘96’ రీమేక్‌ ‘జాను’ కోసం ఆయన కాస్త ఒళ్లు పెంచారు.


అప్పటి నుంచీ.. కాస్త కాస్త బొద్దుగా మారిపోయారు. ‘రణరంగం’లో వయసుకు మించిన పాత్ర పోషించడం వల్ల.. ఆయన లావుగానే కనిపించాల్సివచ్చింది. ఇప్పుడు ఏకంగా 16 కిలోల బరువు తగ్గారని తెలుస్తోంది. మంచు మనోజ్‌ కూడా అంతే. ఆయన కొన్నాళ్లుగా సినిమాలే చేయడం లేదు. దాంతో ఫిట్‌నెస్‌ పై దృష్టి పెట్టే అవసరం, అవకాశం లేకుండా పోయాయి. త్వరలోనే ఆయన సినిమా ఒకటి పట్టాలెక్కబోతోందని తెలుస్తోంది. ఆ సినిమా కోసం ఆయన కసరత్తులు ప్రారంభించారని సమాచారం. కనీసం 15 కిలోల బరువు తగ్గబోతున్నారని, అందుకోసం మనోజ్‌ అహర్నిశలూ కష్టపడుతున్నారని తెలుస్తోంది. 


బరువు పెరిగిపోతున్నామన్న భయం హీరోలకంటే హీరోయిన్లకే ఎక్కువగా ఉంటుంది. అందుకే డైట్‌ విషయంలో వాళ్లు చాలా జాగ్రత్తగా ఉంటారు. అయితే కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలించవు. అనుష్క విషయంలో ఇదే జరిగింది. ‘సైజ్‌ జీరో’ కోసం అనుష్క తొలిసారి బరువు పెరిగారు. పాత్ర డిమాండ్‌ చేసింది కాబట్టి తప్పలేదు. అయితే ఆ తరవాత పెరిగిన బరువుని కంట్రోల్‌ చేసుకోలేకపోవడం వల్ల పరిస్థితి అదుపు తప్పింది. కృత్రిమంగా బరువు తగ్గేందుకు అనుష్క ప్రయత్నించారని, అయితే ఆ ప్రయత్నం విఫలమైందని, అందుకే ఇప్పుడు అనుష్క సహజమైన పద్దతిలో బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో అనుష్క ఓ సినిమా చేయాలి. ఆ సినిమా షూటింగ్‌ ఆగిపోయింది. దానికి కారణం.. అనుష్కనే. ‘పూర్తిగా బరువు తగ్గిన తరవాతే.. నేను సెట్‌కి వస్తా..’ అని అనుష్క చెప్పారని, అందుకే షూటింగ్‌ వాయిదా వేశారని.. చిత్రసీమ వర్గాలు చెబుతున్నాయి. నిత్యమీనన్‌, అవికాగోర్‌.. వీళ్లంతా సడన్‌గా బరువు పెరిగిపోయారు. కానీ ఆ తరవాత ప్రమాదం గ్రహించి మళ్లీ స్లిమ్‌ అయ్యారు. ‘‘సినిమా టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. ఇది వరకు... కాస్త బరువు పెరిగినా భయం వేసేది. ఇప్పుడు అలా కాదు. ఎంత లావుగా ఉన్నా, సీజీల్లో సెట్‌ చేసుకోవచ్చు. కానీ ప్రతీసారీ అది సాధ్యం కాదు. ఎంత సీజీలో సెట్‌ చేసినా, కృత్రిమంగానే ఉంటుంది. అందుకే సహజంగా స్లిమ్‌ అయితే.. సీజీ ఫీట్లు తప్పుతాయి. ఖర్చు కూడా కలిసొస్తుంది. హీరో అయినా, హీరోయిన్‌ అయినా ఫిట్‌గా ఉండడం అవసరం. అది వాళ్ల కెరీర్‌కు ఎంతో ముఖ్యం’’ అని ఓ దర్శకుడు ‘దృశ్యం’తో చెప్పుకొచ్చారు. 

Updated Date - 2022-07-03T09:35:45+05:30 IST