ఈ సారి హిట్టు కొట్టాల్సిందే

ABN , First Publish Date - 2022-08-28T06:50:40+05:30 IST

ఒకప్పుడు వరుస విజయాలతో మాంచి దూకుడు మీద ఉన్నవారే కానీ 2022లో మాత్రం వారి జోరు తగ్గింది.

ఈ సారి హిట్టు కొట్టాల్సిందే

వీళ్లందరూ అగ్ర కథానాయికలే !

కప్పుడు వరుస విజయాలతో మాంచి దూకుడు మీద ఉన్నవారే కానీ 2022లో మాత్రం వారి జోరు తగ్గింది. సినిమాలు విడుదలవుతున్నా  సరైన హిట్‌ మాత్రం పడడం లేదు.  అలాగని ప్లాపులు వచ్చినా వారి హవా  తగ్గలేదు.  ఇప్పటికీ నిర్మాతలు ఆ హీరోయిన్ల కాల్షీట్లు దొరికితే చాలనుకునే పరిస్థితి. వీరి బాధ ఇలా ఉంటే..  గతంలో టాప్‌ హీరోయిన్‌లుగా వెలిగిన వారి పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది.  


ఫ్లాపులతో మొదలై

కొన్నాళ్లుగా  టాలీవుడ్‌లో తిరుగులేని హీరోయిన్‌గా హవా కొనసాగించారు కథానాయిక పూజాహెగ్డే. కానీ  ఈ ఏడాది ఆరంభంలోనే వరుసగా మూడు ఫ్లాపులు  ఆమెను పలకరించాయి. భారీ అంచనాల నడుమ వచ్చిన ‘రాధేశ్యామ్‌’ ఘోరంగా దెబ్బతింది. ప్రభాస్‌ కథానాయకుడు కావడంతో ఇటు తెలుగుతో పాటు అటు హిందీలోనూ పూజ కెరీర్‌కు మంచి మైలేజీ ఖాయం అనుకున్నారు.  కానీ వ్యతిరేక ఫలితం వచ్చింది. ఆ తర్వాత వచ్చిన విజయ్‌ ‘బీస్ట్‌’ తో  తమిళ పరిశ్రమలో తనకు మరిన్ని అవకాశాలు వస్తాయనుకున్నారు. . అక్కడా నిరాశే ఎదురైంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న చిరంజీవి, రామ్‌చరణ్‌ల ‘ఆచార్య’ కూడా పూజకు చేదు ఫలితాన్నే మిగిల్చింది. ‘ఎఫ్‌ 3’లో ప్రత్యేక గీతంలో తళుక్కున మెరిసినా పెద్దగా లాభం లేకపోయింది.  ఇక ఈ ఏడాది తెలుగులో ఆమె సినిమాలేవి  నిర్మాణ దశలో లేవు.  మంచి హిట్‌ పడాలంటే కనీసం ఏడాది పాటు  పూజా ఆగాల్సిందే. ప్రస్తుతం ఆమె నటిస్తోన్న హిందీ చిత్రాలు ‘సర్కస్‌’, ‘కభీ ఈద్‌ కభీ దివాళి’ డిసెంబరు చివరివారంలో   ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. కనీసం వాటిల్లో ఒకటైనా హిట్‌ అయితే కొత్త సంవత్సరానికి హ్యాపీగా ప్రారంభించవచ్చు. అందుకే పూజా టెన్షన్‌తో సక్సెస్‌ కోసం ఎదురు చూస్తున్నారు. 

 

బ్యాడ్‌లక్‌ సఖి

ఇండస్ట్రీలో ‘మహానటి’ ఇచ్చిన బూస్ట్‌తో  కెరీర్‌ను  ఎంజాయ్‌ చేస్తున్నారు కీర్తిసురేశ్‌. అయితే విజయం మాత్రం ఆమెతో దోచూబులాడుతోంది.  ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ‘గుడ్‌లక్‌ సఖి’ మూవీ కీర్తి కి హిట్‌ ఇవ్వలేకపోయింది. . మహేశ్‌బాబు  ‘సర్కారువారి పాట’తో హిట్‌ వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో ‘దసరా’ చిత్రం మాత్రమే ఉంది.  కీర్తి ఆశలన్నీ ఆ చిత్రం పైనే! 


అపజయాల పర్వం

లేడీ పవర్‌స్టార్‌ అంటూ అభిమానులు సాయిపల్లవికి బిరుదులు ఇచ్చారు. కానీ ఆ స్థాయి విజయాన్ని ఈ ఏడాది ఆమె అందుకోలేకపోయారు.  ‘లవ్‌స్టోరి’, ‘థాంక్యూ’ చిత్రాలు నటిగా మంచి పేరుతో పాటు కమర్షియల్‌గానూ విజయవంతమయ్యాయి. రానాను కూడా పక్కనపెట్టి ‘ఇది వెన్నెల కథ’ అంటూ ‘విరాటపర్వం’ చిత్రాన్ని సాయిపల్లవి పేరు మీదనే ప్రచారం చేశారు. నటిగా పేరు దక్కినా సినిమా ఫలితం నిరాశపరిచింది. ఆమె నటించిన తమిళ చిత్రం ‘గార్గి’  ని అయితే ఎవరూ పట్టించుకోలేదు. థియేటర్లలోకి ఇలా వచ్చి అలా పోయింది. ఇప్పటికైతే సాయిపల్లవి ఇంకా కొత్త సినిమాలేవీ అంగీకరించలేదు. కాబట్టి ఈ ఏడాదికి ఆమెకు ఇక అపజయాల పర్వమే అనుకోవచ్చు. 


కృతిశెట్టి కథే వేరు. తొలి చిత్రం ‘ఉప్పెన’ పరిశ్రమలో ఆమె దూసుకుపోవడానికి దోహదపడింది. ఈ ఏడాది నాగచైతన్య ‘బంగార్రాజు’తో బోణీ బాగుందనిపించారు కృతి. అయితే రామ్‌ ‘ది వారియర్‌’, నితిన్‌ ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రాలు ఆ ఆనందాన్ని కాస్తా ఆవిరి చేశాయి. వరుసగా రెండు అపజయాలు పలకరించడంతో కొంచెం డల్‌ అయ్యారు కృతి. అయితే సెప్టెంబర్‌ 16న వచ్చే. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రం తనకు హిట్‌ అందిస్తుందనే ఆశతో ఆమె ఉన్నారు. 


ఆ ముచ్చట తీరేనా?

‘ఆర్‌ఎక్స్‌ 100’తో  పాయల్‌ రాజ్‌పుత్‌ గ్లామర్‌ హీరోయిన్‌గా సెటిల్‌ అవుతారని అంతా అనుకున్నారు. కానీ ఆ చిత్రం తర్వాత ఆమెకు ఒక్కటంటే ఒక్క హిట్‌ పడలేదు. అయినా నిరాశ పడకుండా తన ప్రయత్నం కొనసాగిస్తున్నారు. తెలుగుతో పాటు  తమిళ, పంజాబీ చిత్రాలు చేస్తున్నారు. . ఈ ఏడాది ఆది సాయికుమార్‌ ‘తీస్‌మార్‌ఖాన్‌’ రూపంలో మరో అపజయం తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఆమె విష్ణు మంచు సరసన ‘జిన్నా’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంతో అయినా పాయల్‌ అదృష్టరేఖ  మారుతుందేమో చూడాలి. 


రష్మికకు చిన్న బ్రేక్‌

ఇప్పుడు జోరుమీదున్న  హీరోయిన్‌ రష్మిక మందన్న మాత్రమే.  ‘పుష్ప 2’తో పాటు తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం ‘వారసుడు’, హిందీలో ‘గుడ్‌బై’, ‘మిషన్‌ మజ్ను’, ‘యానిమల్‌’ చిత్రాలన్నీ కథానాయికగా ఆమె స్థాయిని మరింత పెంచేవే. కథానాయికగా ఈ ఏడాది తెలుగులో సాలిడ్‌ హిట్‌ కొట్టలేదనే లోటు మాత్రం రష్మికకు అలానే ఉంది. గతేడాది ‘పుష్ప’ విజయంతో మాంచి ఊపులో ఉన్నారామె. ఈ ఏడాది ఆరంభంలోనే ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ఆమె విజయయాత్రకు బ్రేక్‌లు వేసింది. ‘సీతారామం’లో ప్రాధాన్యం ఉన్న పాత్ర పోషించినా సక్సెస్‌ క్రెడిట్‌ మృణాళిని ఖాతాలో పడింది. ఇక ఈ ఏడాది మరో రిలీజ్‌ లేకపోవడంతో వచ్చే ఏడాది ‘పుష్ప 2’తో భారీ సక్సెస్‌ కోసం వేచిచూడాల్సిందే. 


కలల హిట్‌ కనిక రించలేదు

తమన్నా, మెహ్రీన్‌లు ఈ ఏడాది ‘ఎఫ్‌ 3’తో ఫరవాలేదనిపించారు. ‘హీరో’ సినిమా కథానాయికగా నిధి అగర్వాల్‌కి అంతగా అచ్చిరాలేదు. ‘టెంత్‌క్లాస్‌ డైరీస్‌’, ‘థాంక్యూ’ అవికాగోర్‌ కెరీర్‌కు ఏమాత్రం ఊపును ఇవ్వలేకపోయాయి. ‘గాడ్సే’ ఐశ్వర్య లక్ష్మికి హీరోయిన్‌గా శుభారంభాన్ని ఇవ్వలేకపోయింది. లావణ్య త్రిపాఠికి ‘హ్యాపీ బర్త్‌డే’ చిత్రం నిరాశ మిగిల్చింది.  ‘పక్కా కమర్షియల్‌’, ‘థాంక్యూ’ రెండూ కూడా రాశీఖన్నాకు సక్సెస్‌ను అందించలేకపోయాయి. ‘1945’తో రెజీనాకు మరో ఫ్లాప్‌ జతయ్యింది. సమంత ఈ ఏడాది ఇప్పటిదాకా స్ట్రెయిట్‌ చిత్ర ంతో ప్రేక్షకులను పలకరించలేదు. కానీ ఆమె నటించిన డబ్బింగ్‌ చిత్రం ‘కాత్తువాక్కుల రెండు కాదల్‌’ను తెలుగు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. త్వరలోనే ‘యశోద’, ‘శాకుంతలం’ చిత్రాలతో ఆమె ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. శివాని రాజశేఖర్‌కు ‘శేఖర్‌’ చిత్రం చేదు జ్ఞాపకాన్నే మిగిల్చింది.

Updated Date - 2022-08-28T06:50:40+05:30 IST