‘కలికాలం’ సినిమా వెనుక ఇంత కథ ఉంది!

ABN , First Publish Date - 2022-03-15T06:11:52+05:30 IST

జయసుధ ప్రధాన పాత్రధారిణిగా ఆమె భర్త నితిన్‌కపూర్‌ నిర్మించిన చిత్రం ‘కలికాలం’. ఈ సినిమాకు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు. ఈ చిత్రనిర్మాణం వెనుక పెద్ద కథ ఉంది. ‘కాలధర్మం’ నాటకం ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకొంది. శ్రీరాజ్‌ ఆ నాటకాన్ని రాశారు. ఆ నాటకాన్ని ఓ సారి

‘కలికాలం’ సినిమా వెనుక ఇంత కథ ఉంది!

జయసుధ ప్రధాన పాత్రధారిణిగా ఆమె భర్త నితిన్‌కపూర్‌ నిర్మించిన చిత్రం ‘కలికాలం’. ఈ సినిమాకు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు. ఈ చిత్రనిర్మాణం వెనుక పెద్ద కథ ఉంది. ‘కాలధర్మం’ నాటకం ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకొంది. శ్రీరాజ్‌ ఆ నాటకాన్ని రాశారు. ఆ నాటకాన్ని ఓ సారి ప్రదర్శిస్తున్నప్పుడు దర్శకుడు ముత్యాల సుబ్బయ్య చూశారు. ఆయనకు బాగా నచ్చింది. సినిమాకు పనికి వచ్చే అంశాలు అందులో ఉండడంతో ఆ నాటకం మీదే ఆయన దృష్టి ఉండేది. అందుకే చెన్నైలోని సవేరా హోటల్‌ అధినేత ఏవీకె రెడ్డికి చెప్పి ఆ నాటకం కొనిపించారు ముత్యాల సుబ్బయ్య. 


‘కాలధర్మం’ నాటకం ఆధారంగా ఓ ప్రముఖ దర్శకునితో సినిమా తీయాలని ఏవికె రెడ్డి ఆలోచన. స్ర్కిప్ట్‌ డిస్కషన్స్‌ కోసం కొంత డబ్బు ఖర్చు పెట్టారు కానీ ఆ ప్రాజెక్ట్‌ ప్రారంభం కాలేదు. ఆ తర్వాత ముత్యాల సుబ్బయ్య ‘కాలధర్మం’ రైట్స్‌ వాళ్ల దగ్గర నుంచి కొన్నారు. రచయిత తోటపల్లి మధుతో కూర్చుని కథా చర్చలు జరిపి స్ర్కిప్ట్‌ తయారు చేశారు. ‘కాలధర్మం’ పేరుని ‘కలికాలం’గా మార్చారు. చంద్రమోహన్‌ , జయసుధ జంటగా ఈ చిత్రాన్ని తీయాలని ముత్యాల సుబ్బయ్య ఆలోచన. కథ రెడీగా ఉంది కానీ నిర్మాత లేడు. అందుకే తనకు తెలిసిన నిర్మాతలకు ఈ కథ చెప్పి, చంద్రమోహన్‌, జయసుధతో సినిమా తీద్దామని అంటే ఆ పేర్లు వినగానే వాళ్లు వెనక్కి జారుకున్నారు. ఆ జంటతో సినిమా తీస్తే ఎవరూ చూడరని వాళ్ల భయం. 


చివరకు ముత్యాల సుబ్బయ్య స్నేహితుడు శ్రీనివాసరెడ్డి చిత్రాన్ని తీయడానికి ముందుకు వచ్చారు. జయసుధ దగ్గరకు వెళ్లి కథ చెప్పారు. ఆ సమయంలో జయసుధ సినిమాలు లేక ఇంట్లోనే ఖాళీగా ఉన్నారు. సొంత సినిమాలు తీసి కూడా చాలా కాలం అయింది. ‘కలికాలం’ కథ వినగానే మళ్లీ నటించాలనీ, సొంత బేనరుపై ఆ కథతో సినిమా తీయాలని జయసుధ ఫిక్స్‌ అయ్యారు. ముత్యాల సుబ్బయ్య కూడా ఓకే అనడంతో ‘కాలధర్మం’ కథతో ‘కలికాలం’ చిత్రం పట్టాలెక్కింది.

-వినాయకరావు

Updated Date - 2022-03-15T06:11:52+05:30 IST