‘ఆచార్య’కి పోటీగా ‘ఎఫ్3’.. అందుకేనా?

ABN , First Publish Date - 2022-02-13T03:35:54+05:30 IST

తాజాగా కరోనా పరిస్థితుల్లో మార్పు రావడంతో.. తెలుగు చిత్ర పరిశ్రమ నిర్మాతలు వరసగా తమ చిత్రాల విడుదల తేదీలను ప్రకటించారు. అందులో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25న విడుదల చేయబోతున్నట్లుగా

‘ఆచార్య’కి పోటీగా ‘ఎఫ్3’.. అందుకేనా?

తాజాగా కరోనా పరిస్థితుల్లో మార్పు రావడంతో.. తెలుగు చిత్ర పరిశ్రమ నిర్మాతలు వరసగా తమ చిత్రాల విడుదల తేదీలను ప్రకటించారు. అందులో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25న విడుదల చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన రావడంతో.. అంతకుముందు ఏప్రిల్ 1న విడుదల అని ప్రకటించిన ‘ఆచార్య’ చిత్రాన్ని ఏప్రిల్ 29కి వాయిదా వేశారు. అయితే పెద్ద సినిమాలు విడుదల అవుతున్నప్పుడు కనీసం రెండు వారాల పాటు అయినా గ్యాప్ ఉండాలని, సినిమాల విడుదల సమయంలో నిర్మాతలు చర్చలు జరిపి కొన్ని సినిమాలను వాయిదా వేయిస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతి బరిలో ఉన్న ‘భీమ్లా నాయక్’ చిత్ర విడుదల విషయంలో ఏం జరిగిందో తెలియంది కాదు. ‘భీమ్లా నాయక్’కు తమ ‘ఎఫ్ 3’ చిత్ర విడుదల తేదీ ఇస్తున్నామని చెబుతూ.. ఆ తర్వాత దిల్ రాజు మీడియా సమావేశంలో కూడా చెప్పుకొచ్చారు. మరి ‘ఆచార్య’ విడుదల తేదీ ఏప్రిల్ 29 అని ప్రకటించిన కాసేపటికే.. ‘ఎఫ్ 3’ చిత్రాన్ని ఏప్రిల్ 28న విడుదల చేయబోతున్నట్లుగా దిల్ రాజు ప్రకటన చేశారు. దీనిపై.. ‘మరి గ్యాప్ రూల్ ఇక్కడ ఏమైంది?’ అన్నట్లుగా మెగాభిమానులు కొందరు సోషల్ మీడియా వేదికగా నిర్మాత దిల్ రాజుకు ప్రశ్నలు సంధిస్తున్నారు. 


అయితే, ‘ఆచార్య’ సినిమాకి కావాలనే పోటీగా ‘ఎఫ్ 3’ని దిల్ రాజు బరిలోకి దించుతున్నట్లుగా టాలీవుడ్‌లో టాక్ నడుస్తుంది. దీనికి కారణం చిరంజీవి, రామ్ చరణ్ కాదని, ‘ఆచార్య’ చిత్రాన్ని నైజాంలో పంపిణీ చేస్తున్న వరంగల్ శ్రీను అనేలా రూమర్లు వినిపిస్తున్నాయి. ‘ఆచార్య’ చిత్ర నైజాం హక్కులను దిల్ రాజుకి పోటీగా వెళ్లి వరంగల్ శ్రీను దక్కించుకోవడంతో.. దిల్ రాజు ఇలా ప్లాన్ చేశాడని అనుకుంటున్నారు. ఎందుకంటే.. రామ్ చరణ్‌తో శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో సినిమా చేస్తున్న దిల్ రాజు.. ఇప్పుడు చరణ్ నటించి, నిర్మించిన ‘ఆచార్య’ చిత్రానికి పోటీగా వస్తారని ఎవరూ ఊహించరు. కానీ, ‘ఆచార్య’కు ఒక రోజు ముందు ‘ఎఫ్ 3’ని దిల్ రాజు విడుదల చేస్తుండటంతో.. ఇదంతా వరంగల్ శ్రీను ఎఫెక్టే అని అంతా అనుకుంటుండటం గమనార్హం. మరి ఈ రూమర్లపై దిల్ రాజు ఎలా స్పందిస్తారనేది తెలియాల్సి ఉంది.

Updated Date - 2022-02-13T03:35:54+05:30 IST