Ghost film review: నరుక్కోవటం తప్ప విషయం లేని 'ఘోస్ట్'

ABN , First Publish Date - 2022-10-05T23:49:58+05:30 IST

దసరా పండగకు విడుదల అయినా సినిమాల్లో కీలకమయిన సినిమా నాగార్జున (Akkineni Nagarjuna) నటించిన 'ఘోస్ట్' (Ghost) ఒకటి. ప్రవీణ్ సత్తారు (Director Praveen Sattaru) దీనికి దర్శకుడు.

Ghost film review: నరుక్కోవటం తప్ప విషయం లేని 'ఘోస్ట్'

సినిమా: ఘోస్ట్ (Ghost)

నటీనటులు: నాగార్జున, సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, రవి వర్మ, అనైక సురేంద్రన్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు 

దర్శకుడు: ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru)

సినిమాటోగ్రఫీ: ముకేశ్ (Cinematography by Mukesh)

సంగీతం:  మార్క్ కె రాబిన్ (Music by Mark K Robin)

నిర్మాత: సునీల్ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ 

సురేష్ కవిరాయని 

దసరా పండగకు విడుదల అయినా సినిమాల్లో కీలకమయిన సినిమా నాగార్జున (Akkineni Nagarjuna) నటించిన 'ఘోస్ట్' (Ghost) ఒకటి. ప్రవీణ్ సత్తారు (Director Praveen Sattaru) దీనికి దర్శకుడు. వైవిధ్యమయిన సినిమాలు చెయ్యటం లో అక్కినేని నాగార్జున ముందుంటాడు, అలంటి సినిమానే ఈ 'ఘోస్ట్' అని విడుదలకు ముందు చెప్పారు. ఈ సినిమా యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వచ్చింది, ఇందులో సోనాల్ చౌహన్ కథానాయిక. ఈ సినిమా ప్రచార చిత్రాలు విడుదల చేసినప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది, దానికి తోడు నాగార్జున ఈ సినిమా గురించి చాల గొప్పగా కూడా మాట్లాడటం తో కొంచెం అంచనాలు (Expectations) పెరిగాయి. మరి ఈ సినిమా ఎలా ఉందొ చూద్దాం. (Ghost film review)


కథ:

విక్రమ్ (నాగార్జున) ఒక ఇంటర్ పోల్ ఏజెంట్ (Interpol Agent), దుబాయ్ (Dubai) లో తన ప్రియురాలు ప్రియ (సోనాల్ చౌహాన్) తో ఉంటాడు. ఒక సంఘటనతో విక్రమ్ మానసికంగా బాధపడుతూ తన ప్రియురాలికి దూరం అయిపోతాడు. ఇంతలో అను (గుల్ పనాజీ) నుండి ఒక ఫోన్ వస్తుంది విక్రమ్ కి. తను తన కూతురు అతిధి (అనైక సురేంద్రన్) ఆపదలో ఉన్నామని, కాపాడాలని విక్రమ్ ని అడుగుతుంది. విక్రమ్ వెంటనే ఊటీ బయలుదేరుతాడు. ఇంతకీ ఆ అను ఎవరు, ఆమెకి విక్రమ్ కి ఏమిటి అనుబంధం? విక్రమ్ కి ఎటువంటి అనుభవాలు ఎదురయ్యాయి? అను ని ఎవరు చంపాలని అనుకుంటున్నారు, చివరికి విక్రమ్ వాళ్ళని ఎలా కాపాడేడు అన్నదే మిగతా కథ. 


విశ్లేషణ:

ప్రవీణ్ సత్తారు ఇంతకు ముందు మంచి సినిమాలు చేసాడు. 'గరుడ వేగ' లాంటి ఒక యాక్షన్ చిత్రాన్ని తెలుగు వాడు ఎంత బాగా తీయగలడో చేసి చూపించాడు. అటువంటి ప్రవీణ్ ఈ 'ఘోస్ట్' సినిమా దర్శకత్వం వహించటం, దానికి తోడు నాగార్జున లాంటి పెద్ద స్టార్ నటించడం, సినిమా మీద అంచనాలు బాగా పెరిగాయి. ధనవంతుల కుటుంబాలు, వాళ్ళ కంపెనీల మీద మాఫియా సామ్రాజ్యం ప్రవేశించి వాళ్ళని, కంపెనీలని ఎలా వశపరచు కోవచ్చు అన్న బ్యాక్ డ్రాప్ కథతో తీసాడు అని అనిపిస్తోంది. అయితే ప్రవీణ్, అతని టీం మొత్తం యాక్షన్ సన్నివేశాలను ఎలా కొరియోగ్రాఫ్ చెయ్యాలి, ఎలా చూపించాలి అన్న కోణం మీదే బాగా దృష్టి పెట్టారు అని అనిపిస్తోంది. ఆలా చెయ్యటం లో కథ మొత్తం పక్కకి పోయి, ఇందులో భావేద్వేగం అస్సలు లేకుండా పోయింది. ఒక్క యాక్షన్ సన్నివేశాలు బాగా చూపిస్తే, సినిమా ఆడుతుంది అనుకుంటే, అది పెద్ద పొరపాటు. యాక్షన్ తో పాటు, కథ ఉండాలి, అందులో భావోద్వేగాలు, లేదా కొంచెం సరదా సన్నివేశాలు అయినా ఉండాలి. ఇవేవీ లేకుండా నాకో స్టార్ దొరికాడు, అతనితో ఒక యాక్షన్ సినిమా చేసేస్తాను అని ఒక్క యాక్షన్ మీదే దృష్టి పెడితే, ఇదిగో ఇలా ఈ 'ఘోస్ట్' లా ఉంటుంది. కథానాయకుడు అయిన నాగార్జున నరుక్కుంటూ పోవటమే తప్ప, ఎక్కడ కూడా కథ కమామీషు కనపడదు. దానికి తోడు ఆ నరుక్కోవటం కూడా అదేదో కొత్తగా ఉంటుందని చెప్పి, మరీ హింసాత్మకంగా చూపిస్తే ఎలా? నాగార్జున అంటే యంగ్ యాక్టర్ అనుకున్నాడేమో దర్శకుడు, అందుకనే ఇలాంటి యాక్షన్ సినిమా తీసి ఏ ప్రేక్షకులని థియేటర్స్ రాబట్టాలని తీసాడో అర్థం కాదు. కుటుంబం తో చూడటానికి అవదు, పెద్ద వాళ్ళు రారు, చిన్న వాళ్ళకి నచ్చదు, మరి ఎవరిని ఉద్దేశించి ఒక స్టార్ ని పెట్టి ఇలాంటి సినిమా తీసాడో ప్రవీణ్ కె తెలియాలి. పండగ అంటే సరదాగా వుండే సినేమా, కథ బలంగా వుండి చిన్న చిన్న పోరాట సన్నివేశాలు వున్న సినిమా, లేదా కుటుంబ నేపథ్యం వుండే సినిమా విడుదల చేస్తారు. కానీ ఈ 'ఘోస్ట్' మాత్రం ఒక వేస్ట్ లా చేసాడు దర్శకుడు. 


ఇవన్నీ ఇలా ఉంటే, 'కె జి ఎఫ్', 'విక్రమ్' సినిమాల తరువాత మనవాళ్ళకి కూడా కొంచెం అంటినట్టు వుంది. ఒక పెద్ద మెషిన్ గన్ (మనిషి మోయలేనంత గన్) పట్టుకొని వందమంది రౌడీల మీదకి పిచ్చిగా కాల్పులు జరపటం. ఆ చెప్పిన రెండు సినిమాలకి అవి బాగా సరిపోతాయి, జనాలు హర్షించారు. మరి ప్రవీణ్ ఐడియా నో, లేదా నాగార్జున ఐడియా నో, ఇందులో కూడా ఆ జాడ్యం పట్టుకుంది కాబోలు, చివర్లో నాగార్జున ఒక పెద్ద గన్ తీసి దీపావళి సామాను కాల్చినట్టు ఆ గన్ తో కాల్చి పడేస్తాడు. ఇది మరీ కొంచెం చిన్నపిల్లలా ఆటలా అసహజంగా అనిపించింది, కానీ సహజంగా లేదు. అన్నా చెల్లెలు, ప్రియుడు ప్రియురాలు, లేదా ఇంకో చోట ఆ భావోద్వేగ సన్నివేశాలు పెడితే బాగుంటుంది, కానీ దర్శకుడి దృష్టి ఒక్క యాక్షన్ మీద ఉంటే ఇవన్నీ ఎలా వస్తాయి. అక్కడక్కడా తప్పితే ప్రేక్షకులు ఈ సినిమాలో సన్నివేశాలకు అస్సలు కనెక్ట్ కారు. 

ఇంకా నటీనటుల విషయానికి వస్తే, నాగార్జున చూడటానికి బాగున్నాడు. ఇంతకు ముందు ఎన్ ఐ ఎ ఏజెంట్ గా చేసాడు, మళ్ళీ అలంటి పాత్రే ఇది కూడా, ఈసారి ఇంటర్ పోల్ ఏజెంట్ గా కనపడతాడు. పెద్దగా తేడా ఏమి లేదు. సోనాల్ చౌహన్ యాక్షన్ కూడా చెయ్యగలను అని చూపించింది. శ్రీకాంత్ అయ్యంగార్, రవి వర్మ లాంటి వాళ్ళు తప్పితే మిగతా అందరూ వేరే బాషా నటులే. వాళ్ళు మాటలకి, నటనకి పొంతనే లేదు. ఎదో నటించాలి కాబట్టి కెమెరా ముందు నిలుచున్నట్టు నిలుచున్నారు, అంతే. గుల్ పనాజీ, అనైక సురేంద్రన్ వాళ్ళ పాత్రలకు తగినట్టుగా చేసారు. సంగీత నేపథ్యం, సినిమాటోగ్రఫీ ఒకే. మాటలు ఏవి అంత పదునుగా లేవు, గుర్తు పెట్టుకోవాల్సినవి కూడా కావు. ఇంకా కొన్ని యాక్షన్ సన్నివేశాలు బాగా కోరియోగ్రఫీ చేసారు కానీ కొన్ని మరీ సాగదీశారు, చిరాకు పుట్టించారు కూడా. 

చివరాగా 'ఘోస్ట్' సినిమా, కథ ఏమి లేకుండా పూర్తిగా యాక్షన్ మీదే ఆధారపడి ఈ సినిమా తీయటం, దర్శకుడు ప్రవీణ్ వైఫల్యంగానే పరిగణించాలి. పండగ కి వచ్చిన ఈ ఘోస్ట్ ఒక వేస్ట్.

Updated Date - 2022-10-05T23:49:58+05:30 IST