పెద్ద సినిమాల పరుగు మళ్లీ మొదలైంది

ABN , First Publish Date - 2022-02-13T05:30:00+05:30 IST

ఈనెల 10న జగన్‌తో టాలీవుడ్‌ ప్రముఖులు భేటీ వేశారు. చిరంజీవి,

పెద్ద సినిమాల పరుగు మళ్లీ మొదలైంది

  • ‘మీ సినిమా  రిలీజ్‌ ఎప్పుడు..’
  • ‘ఏమోనండీ..’
  • ‘అదేంటి..’
  • ‘ఏపీలో పరిస్థితులు బాగోలేవు కదా.. టికెట్‌ రేటపై ఓ స్పష్టత వచ్చాకే.. రిలీజ్‌ డేట్‌లపై క్లారిటీ వస్తుంది..’
  • - ఇదీ నిన్నా మొన్నటి వరకూ నిర్మాతల మాట. ఎవరిని కదిలించినా ఇదే అభిప్రాయం వినిపించేది. ఏపీలో టికెట్‌ రేట్లని తగ్గిస్తూ, ప్రభుత్వం జారీ చేసిన జీవోతో నిర్మాతల కష్టాలు మొదలయ్యాయి. పెద్ద సినిమాలు విడుదలకు జంకాయి. చిన్న సినిమాలూ ధైర్యం చేయలేకపోయాయి. ‘ఈ రేట్లతో మేం థియేటరని నడపలేం’ అంటూ యజమానులు స్వచ్ఛందంగా కొన్నిచోట్ల  థియేటర్లకు తాళాలు వేశారు. వేసవిలో పెద్ద సినిమాలు విడుదల కావాల్సిన తరుణంలో.. ఏపీ ప్రభుత్వం కళ్లు తెరిచింది. చిత్రసీమపై కాస్త సానుకూలంగా స్పందించింది. తొలుత చిరంజీవి ఒంటరిగా వెళ్లి ములాఖాత్‌ అయి వచ్చారు. ఆ తరవాత సినీ ప్రముఖుల్ని వెంటేసుకుని వెళ్లారు. రెండు సమావేశాల ప్రధానోద్దేశ్యం ఒక్కటే.. టికెట్‌ రేట్లను పెంచుకుని రావడం. దాదాపుగా అది ఓ కొలిక్కి వచ్చినట్టైంది. త్వరలోనే ఈ మొత్తం ఎపిసోడ్‌కు ‘శుభం’ కార్డు పడుతుందని చిత్రసీమ ఆశగా ఎదురు చూస్తోంది. అయితే తేలాల్సిన ప్రశ్నలు ఇంకా ఉన్నాయి. కొన్ని గందరగోళాలకు తెర పడాల్సివుంది. కొన్ని సమస్యలు ఇంకా వేధిస్తూనే ఉన్నాయి.



ఈనెల 10న జగన్‌తో టాలీవుడ్‌ ప్రముఖులు భేటీ వేశారు. చిరంజీవి, మహేష్‌బాబు, ప్రభాస్‌, రాజమౌళి, కొరటాల శివ, ఆర్‌.నారాయణమూర్తి, అలీ, పోసాని తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీ చిత్రసీమలో హాట్‌ టాపిక్‌గా మారింది. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలకు ఓ శాశ్వతమైన పరిష్కారం లభించబోతోందన్న ఆశాభావం వ్యక్తమైంది. ‘ఎండ్‌కార్డ్‌ కాదు.. శుభం కార్డు పడబోతోంది’ అంటూ స్వయంగా చిరంజీవి వ్యాఖ్యానించడం చూస్తుంటే, ప్రభుత్వం నుంచి టాలీవుడ్‌కు సానుకూల సంకేతాలే అందినట్టు స్పష్టం అవుతోంది. జగన్‌ సినీ ప్రముఖులకు ఎలాంటి భరోసా ఇచ్చారు? జీవోలో ఏయే విషయాలున్నాయి? అనే విషయంలో ఇప్పటికైతే ఎలాంటి స్పష్టత లేదు.


కాకపోతే.. ఆమధ్య తగ్గించిన టికెట్‌ రేట్లలో భారీ మార్పు చోటు చేసుకోబోతోందని మాత్రం అర్థమైంది. అటు ప్రభుత్వానికీ, ఇటు సినీ పెద్దలకూ అంగీకార యోగ్యమైన ఽకొత్త ధరల్ని చూడబోతున్నామని స్పష్టమైంది. సామాన్యుడికి సినిమా దూరం కాకుండా, అలాగని పెద్ద సినిమాలకు నష్టం రాకుండా ఉభయతారకంగా టికెట్‌ రేట్లు ఉండొచ్చని చెబుతున్నారు. ఏ,బీ,సీ సెంటర్లని బట్టి టికెట్‌ రేట్లు ఉండబోతున్నాయి. సీ సెంటర్లలో ప్రారంభ ఽటికెట్‌ ధర రూ.40 ఉండొచ్చని, మల్టీప్లెకులో టికెట్‌ ధర గరిష్టంగా రూ.150 వరకూ ఉండొచ్చని ఓ అంచనా. 


పెద్ద సినిమాల ఉత్సాహం 

ఈ వేసవిలో పెద్ద సినిమాలు వరుస కట్టబోతున్నాయి. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’, ‘రాధే శ్యామ్‌’, ‘ఆచార్య’, ‘సర్కారు వారి పాట’, ‘భీమ్లా నాయక్‌’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఎప్పుడో రావాల్సిన చిత్రాలివి. ఏపీలో పరిస్థితులు, టికెట్‌ రేట్లు, కరోనా.. ఇలా రకరకాల కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చాయి. ఇప్పుడు రిలీజ్‌ డేట్లు ఫిక్స్‌ చే సారు. కానీ మనసులో ఏదో భయం. ఏపీలో టికెట్‌ రేట్లని సవరిస్తూ, కొత్త జీవో రాకపోతే, ఈ సినిమాలన్నీ భారీగా నష్టపోతాయి. అందుకే జగన్‌తో మీటింగ్‌పై పెద్ద నిర్మాతలంతా దృష్టి పెట్టారు. ఈ మీటింగ్‌ తరవాతే.. తమ రిలీజ్‌ డేట్ల పై ఓ నిర్ణయానికి వద్దామనుకున్నారు. జగన్‌తో భేటీ కాస్త సంతృప్తికరంగా ముగియడంతో.. ఇప్పుడు బడా నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు.


పాత రేట్లతో సవరించిన రేట్లు పోలిస్తే, ఏపీలో దాదాపు 30 శాతం తేడా రావొచ్చన్నది ఓ అంచనా. ఈనెల చివరి నాటికి కొత్త జీవో వచ్చేస్తే.. మార్చిలో విడుదలయ్యే చిత్రాలకు అడ్వాంటేజ్‌ అవుతుంది. అందుకే పెద్ద సినిమాలన్నీ మార్చి తరవాతే రాబోతున్నాయి. అయితే రేట్ల విషయంలో ఇంకా గందరగోళం ఉంది. జీవో వస్తే గానీ, ఏం జరగబోతోంది? ఈ జీవో వల్ల పెద్ద సినిమాలకు ఒరిగేదేమిటి? అనే దాంట్లో స్పష్టత ఉండదు.


5వ ఆట లెక్కేంటి?

5వ ఆటకు అనుమతులు కావాలంటూ నిర్మాతలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఇప్పుడు అందుకు  గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. 5వ ఆటకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ ఎగస్ర్టా షో.. కచ్చితంగా లాభం చేకూర్చేదే. పెద్ద సినిమాలు విడుదల అవుతున్న తరుణంలో 5వ ఆటతో వసూళ్లని పెంచుకునే అవకాశం ఉంది. ఇది వరకు పెద్ద సినిమా వస్తుంటే, ఫ్యాన్‌ షోలు, బెనిఫిట్‌ షోలూ పడేవి. అయితే కొంతకాలంగా వీటికి అనుమతులు ఇవ్వడం లేదు. అదనపు ఆటలతో వచ్చిన ఆదాయం నిర్మాతల జేబుల్లోకి వెళ్తోంది తప్ప, దాని ద్వారా ఎలాంటి పన్నులూ ప్రభుత్వానికి అందడం లేదన్నది ఓ ఆరోపణ. అందుకే బెనిఫిట్‌ షోలను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పుడు 5వ ఆటగా.. వాటిని అధికారికం చేసినట్టైంది.


అయితే ఇందులో ఓ మతలబు ఉంది. 5వ ఆటని చిన్న సినిమాకి కేటాయించాలన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. చిన్న నిర్మాతలూ కోరుతున్నది అదే. 5వ ఆటగా చిన్న సినిమాని ప్రదర్శిస్తే, కొన్నయినా థియేటర్లు, షోలూ దక్కుతాయన్నది వాళ్ల ఆశ. మరోవైపు పెద్ద సినిమాలు.. 5వ ఆటతోనూ లాభాలు ఆర్జించాలని చూస్తున్నారు. ఇందులో ఓ తెలియని లాజిక్‌ ఉంది. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లాంటి పెద్ద సినిమాలు వస్తే.. థియేటర్లోని 5 షోలూ.. అవే ప్రదర్శిస్తారు. ఆ సమయంలో చిన్న సినిమాలు విడుదలకు ధైర్యం చేస్తాయా? చేసినా, థియేటర్లలో చిన్న సినిమా ఆడుతుందా? అనేది పెద్ద ప్రశ్న. 5వ ఆట కచ్చితంగా చిన్న సినిమాకే అన్నప్పుడే లాభం చేకూరుతుంది. లేదంటే.. 5వ ఆటతోనూ పెద్ద సినిమాలకే వెసులుబాటు. అదనపు ఆట రూపంలో రేట్లని పెంచడానికి వీల్లేదన్నది ప్రభుత్వ నిబంధన. ఆ షోకు సాధారణ టికెట్‌ రేట్లే వర్తిస్తాయి. 


నందులు మాటేమిటి?

గత కొన్నేళ్లుగా ఏపీ ప్రభుత్వం నంది అవార్డుల్ని పట్టించుకోవడం లేదు. నాలుగైదేళ్లుగా అవార్డులు పెండింగ్‌లోనే ఉన్నాయి. దీనిపై చిత్రసీమలో అసంతృప్తి వ్యక్తం అవుతూనే ఉంది. ప్రభ్వుత్వం కూడా అవార్డుల గురించి పెద్దగా పట్టించుకోలేదు. కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పినా, ఏర్పాటు చేసినా.. ఎటువంటి అలికిడీ లేదు. అయితే అవార్డుల గురించి కూడా ప్రభుత్వం ఇప్పుడు సానుకూలంగా ఉందని ప్రచారం జరిగింది. పెండింగ్‌లో ఉన్న, నంది అవార్డుల్ని, ఒకేసారి ప్రకటించి, ఒకే వేదికపై ఈ అవార్డుల్ని ప్రదానం చేయాలన్న నిర్ణయానికి వచ్చారని  చెప్పుకున్నారు. యేడాదికొక కమిటీ ఏర్పాటు చేసి, తద్వారా అవార్డు ప్రక్రియని మొదలెట్టాలని చూస్తున్నారు.




జగన్‌తో జరిగిన మీటింగ్‌లో ఈ విషయం కూడా ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. ఈ యేడాదే నందుల పాత బాకీ క్లియర్‌ చేస్తామని జగన్‌ హామీ ఇచ్చార్ట. కానీ సమావేశం ముగిశాక.. ఏ ఒక్కరూ నందుల గురించి ప్రస్తావించలేదు. దాంతో.. అసలు నందుల గురించి చర్చ జరిగిందా? లేదా? అనే మరో అనుమానం వ్యక్తం అవుతోంది. జగన్‌ తో భేటీకి వెళ్లిన హీరోలూ, నిర్మాతలు నందుల గురించి ప్రస్తావించకపోతే, ప్రభుత్వం కూడా మిన్నకుండిపోతుంది. దాంతో.. నందుల ఇష్యూ మరోసారి పెండింగ్‌లో పడినట్టే.


మరో మీటింగ్‌ ఉంటుందా?

జగన్‌తో ములాఖత్‌ పూర్తయింది. ఇక జీవో రావడమే తరువాయి అన్నది ఇండస్ర్టీ వర్గాల మాట. అయితే.. మరోసారి ఇలాంటి భేటీ జరుగుతుందని, ఆ తరవాతే... నిర్ణయాలూ, జీవోలూ ఉంటాయని తెలుస్తోంది. ఈమీటింగ్‌లో.. తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ నుంచి ప్రతినిధులు ఎవరూ హాజరు కాలేదు. ఈసారి వాళ్లతో జగన్‌ ప్రత్యేకంగా సమావేశం అవుతారని తెలుస్తోంది. ఫిల్మ్‌ ఛాంబర్‌ వాయిస్‌ విన్న తరవాతే.. జీవోపై ఇంకాస్త కసరత్తు చేసి, ఆ తరవాత.. అధికారికంగా రేట్లు ప్రకటిస్తారని సమాచారం అందుతోంది. ఇదంతా రెండు మూడు వారాల లోపే ముగుస్తుందని, మార్చి తొలి వారం నాటికి టాలీవుడ్‌కు పూర్తి క్లియరెన్స్‌ దొరుకుతుందని సినీ, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. 


Updated Date - 2022-02-13T05:30:00+05:30 IST