ఆ దేశంలోకి... ‘The Kashmir Files’ కు నో ఎంట్రీ...

ABN , First Publish Date - 2022-05-10T04:58:36+05:30 IST

న్యూస్ ఏషియా ఛానల్ కథనం ప్రకారం, ‘‘ముస్లిమ్స్ ను రెచ్చగొట్టే విధమైన, ఏక పక్షమైన చిత్రీకరణ ఉన్న కారణంగా, కాశ్మీర్ లో హిందువుల్ని పీడిస్తున్నట్టుగా చూపించిన కారణంగా ... (ద కాశ్మీర్ ఫైల్స్) సినిమాకి క్లాసిఫికేషన్ ఇవ్వటం కుదరదు...’’ అంటున్నారు అధికారులు.

ఆ దేశంలోకి... ‘The Kashmir Files’ కు నో ఎంట్రీ...

‘The Kashmir Files’ సినిమాకి సింగపూర్ లోనికి ఎంట్రీ లభించే సూచనలు కనిపించటం లేదు. అక్కడి స్థానిక సెన్సార్ సర్టిఫికేషన్ గైడ్ లైన్స్ అంగీకరించకపోవటమే కారణంగా తెలుస్తోంది.


సింగపూర్ లోని ఇన్ఫోకామ్ మీడియా డెవలప్మెంట్ అథారిటీ (IMDA) ఓ ప్రకటనలో ‘ద కాశ్మీర్ ఫైల్స్’ సినిమా గురించి ప్రస్తావించింది. కాశ్మీర్ లో అక్కడి పండిట్లపై జరిగిన 1990ల నాటి హింసను తెరకెక్కించిన హిందీ సినిమా తమ గైడ్ లైన్స్ కు లోబడి లేదని అధికారులు పేర్కొన్నారు. ‘The Kashmir Files’ సినిమాను తమ దేశంలో విడుదల చేయటం కుదరదని సింగపూర్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, హోం మంత్రిత్వ శాఖ కూడా చెబుతుండటం గమనార్హం.  

 

న్యూస్ ఏషియా ఛానల్ కథనం ప్రకారం, ‘‘ముస్లిమ్స్ ను రెచ్చగొట్టే విధమైన, ఏక పక్షమైన చిత్రీకరణ ఉన్న కారణంగా, కాశ్మీర్ లో హిందువుల్ని పీడిస్తున్నట్టుగా చూపించిన కారణంగా ... (ద కాశ్మీర్ ఫైల్స్) సినిమాకి క్లాసిఫికేషన్ ఇవ్వటం కుదరదు...’’ అంటున్నారు సింగపూర్ అధికారులు. 


‘ద కాశ్మీర్ ఫైల్స్’ సినిమా ప్రదర్శనకి అనుమతిస్తే తమ దేశంలోని భిన్న జాతులు, భిన్న మతాలతో కూడిన జన సమాజానికి భంగం కలుగుతుందని సింగపూర్ అధికారులు భావిస్తున్నారు. వివిధ వర్గాల మధ్య పగ, ప్రతీకారాలకి సైతం తావిచ్చినట్టువుతుందని వారు చెబుతున్నారు. తమ దేశంలోని ఏ జాతి, మత సమూహాన్ని కించపరిచే విధంగా ఉన్న సినిమాని కూడా తాము అనుమతించబోమని సెన్సార్ అధికారులు ప్రకటించారు. 


కాశ్మీర్ లోయలోని హిందువులపై 90వ దశకంలో జరిగిన హింసాత్మక దాడుల నేపథ్యంలో రూపొందింది ‘The Kashmir Files’. మార్చ్ లో విడుదలైన సినిమా ఇంకా ఇండియాలో అక్కడక్కడా పెద్ద తెరపై కొనసాగుతోంది. అనూహ్య బాక్సాఫీస్ విజయంతో భారీ సంచలనంగా మారిన వివేక్ అగ్నిహోత్రి సినిమా అంతే వివాదాస్పదం కూడా అయింది. రాజకీయ దుమారం సైతం రేపిన అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి స్టారర్ పలు ఇతర దేశాల్లో ఇప్పటికే విడుదలైపోయింది. తాజాగా సింగపూర్ సెన్సార్ సర్టిఫికేషన్ కుదరదనటంతో ‘ద కాశ్మీర్ ఫైల్స్’ మరోమారు వార్తల్లో నిలిచింది. 

Updated Date - 2022-05-10T04:58:36+05:30 IST