కథానాయిక కాలు దువ్వుతోంది

ABN , First Publish Date - 2022-07-05T05:58:47+05:30 IST

నటీనటుల్లో చాలామంది రాజకీయ వివాదాలకు దూరంగా మసలేవారే. సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించేవారే ఎక్కువ. ప్రభుత్వ విధానాలమీద బహిరంగ విమర్శలు...

కథానాయిక కాలు దువ్వుతోంది

తెరపై సుతిమెత్తగా కనిపించే కథానాయిక రాజకీయ పోకడలపై కన్నెర జేస్తోంది. కలల రాకుమారిగా అభిమానుల నీరాజనం అందుకునే నాయకి ప్రభుత్వాలను ప్రశ్నిస్తోంది.  ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగకపోయినా మంచి చెడు అనిపించిన అంశాలపై కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతోంది ఈ తరం నాయిక. లలితంగా నటించి మెప్పించడమే కాదు తన జోలికి వచ్చే అధికార పక్షాలపై కాలు దువ్వుతోంది. 


నటీనటుల్లో చాలామంది రాజకీయ వివాదాలకు దూరంగా మసలేవారే. సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించేవారే ఎక్కువ. ప్రభుత్వ విధానాలమీద బహిరంగ విమర్శలు చేయడం చాలా తక్కువ. ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగాకనే అధికార పక్షాలపై తమ విమర్శలను ఎక్కుపెట్టేవారు కొందరయితే ఏ పార్టీకీ కొమ్ము కాయకపోయినా  ఇప్పుడు కొంతమంది కథానాయికలు ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారు. తమకు నచ్చని అంశాల్లో బహిరంగంగా నిలదీస్తున్నారు. ‘ఇలా చేయడం తప్పుకదా’ అంటూ ప్రశ్నిస్తున్నారు. తమకు తప్పు అనిపించిన అంశాలపై నిర్మొహమాటంగా ప్రభుత్వాలను, రాజకీయ పక్షాలను కడిగిపారేస్తున్నారు. 


కంగనా రనౌత్‌

‘ఈ రోజు నా ఇంటిని కూల్చారు. ఏదో ఒక రోజున మీ ప్రభుత్వం కూడా ఇలాగే కూలిపోతుంది’ అంటూ శివసేన అధినేత మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకి శాపనార్థాలు పెడుతున్న కంగన రనౌత్‌ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టింది.  బాలీవుడ్‌లో ఫైర్‌బ్రాండ్‌గా పేరు పొందారు కంగన. నట వారసత్వంపై నిప్పులు చెరుగుతూ ఆమె పలుమార్లు వార్తల్లో నిలిచారు. మూవీ మాఫియా కన్నా మహారాష్ట్ర పోలీసులంటేనే ఎక్కువ భయం కలుగుతోందనీ, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌కు ముంబైకు పెద్ద తేడా లేదంటూ రెండేళ్ల క్రితం ఆమె చేసిన వ్యాఖ్యలు పెను దుమారమే రేపాయి. మహావికాస్‌ అఘాడీ ప్రభుత్వంపై ఆమె పలు సందర్భాల్లో సోషల్‌ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలకు దిగారు. దాంతో శివసేనకు కంగనకు మఽధ్య వివాదం ముదిరింది. బాంద్రాలోని ఆమె ఇంటి కి అనుమతుల్లేవంటూ కూల్చేశారు. అప్పటి మహా ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా, ఎంత గా బెదిరించినా కంగన అడుగు వెనక్కు వేయలేదు. తన విమర్శల్లో పదును పెంచారు. ఇటీవలె ఉద్ధవ్‌ ఠాక్రే గద్దెదిగాక ఇది ప్రజాస్వామ్యం విజయం అంటూ ఆమె స్పందించారు.  


సాయిపల్లవి

ఈతరం హీరోయిన ్లలో లేడీ పవర్‌స్టార్‌గా పిలుపించుకున్న ఘనత సాయిపల్లవి సొంతం. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా తన నటనతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగల సత్తా ఆమెకుంది. తన ఖాతాలో ఎన్ని హిట్లు ఉన్నా, ఎంత పేరు సంపాదించినా ఒదిగిఉండడం సాయిపల్లవి స్వభావం. అయితే తేడావస్తే మాత్రం ఎక్కడా తగ్గేది లేదని ఇటీవలె ఓ సందర్భంలో నిరూపించారు సాయిపల్లవి. ఆమె రానాకు జోడీగా నటించిన ‘విరాటపర్వం’ చిత్రం ప్రచార కార్యక్రమాల్లో  చేసిన వ్యాఖ్యలు ఓ వర్గం ప్రజలకు రుచించలేదు. ‘కశ్మీర్‌ పండిట్లను చంపడం ఎంత తప్పో, గో రక్షణ పేరుతో  ప్రాణాలు తీయడం కూడా అంతే తప్పు’ అంటూ సాయిపల్లవి సమర్థించిన తీరు నచ్చని కొన్ని హిందుత్వ సంస్థలు, రాజకీయ పార్టీ నాయకులు విమర్శలకు దిగారు. ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా సాయిపల్లవి అదరలేదు, బెదర లేదు. కౌంటర్‌గా ఓ వీడియోలో ‘ఇక్కడ ఎవరికీ ఎవరి ప్రాణాలను  తీసే హక్కులేదు’ అంటూ కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. తను ముందు చెప్పిన మాట మీదనే నిలబడ్డారు. 


తాప్సీ

టాలీవుడ్‌లో కథానాయికగా పరిచయమై బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలుగుతున్నారు తాప్సీ పన్ను. మహిళల హక్కులు, సామాజిక సమస్యలపై తన గళం వినిపించడం ఆమెకి మొదట్నుంచి అలవాటు. పలు సందర్భాల్లో  కేంద్ర ప్రభుత్వంపై పదునైన విమర్శలు ఎక్కుపెట్టారు. సోషల్‌ మీడియాపై ప్రభుత్వ నియంత్రణ, నూతన వ్యవసాయ చట్టాలు, జాతీయ పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా తాప్సీ తన అభిప్రాయాలను బలంగా వినిపించారు. దాంతో ఆదాయపు పన్ను శాఖ ఆమె ఇంట్లో సోదాలు చేసింది. అయితే ఒట్టి చేతులతోనే వెనుదిరగాల్సి వచ్చింది. సందర్భం వచ్చిన ప్రతిసారి తాప్సీ ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నారు. 


దేనికైనా సిద్ధం

బాలీవుడ్‌ కథానాయికల్లో దీపిక ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభుత్వాలపై నేరుగా విమర్శలు చేయకపోయినా ఓ సందర్భంలో ఆమె ఇబ్బందులు పడ్డారు. ఢిల్లీ జేఎన్‌యూలో దాడి ఘటనలో గాయపడిన వామపక్ష విద్యార్థులను పరామర్శించేందుకు దీపిక జేఎన్‌యూకు వెళ్లారు. ఆ సమయంలో బీజేపీ కార్యకర్తలు సోషల్‌ మీడియా వేదికగా దీపికపై విరుచుకుపడ్డారు. ఆమె సినిమాలు చూడొద్దంటూ పిలుపునిచ్చారు. తన కెరీర్‌కు సంబంధించిన అంశం అయినా దీపిక వెనక్కు తగ్గలేదు. గాయపడిన విద్యార్థులను పరామర్శించడం తప్పయితే దానికి ఎలాంటి మూల్యం చెల్లించడానికైనా సిద్ధమేనని ఆమె వ్యాఖ్యానించారు. 


స్వరాభాస్కర్‌

ఎక్కడ అన్యాయం జరిగినా నిలదీసే స్వభావం స్వరాభాస్కర్‌ది. దేశంలో హిందుత్వ రాజకీయాలు లక్ష్యంగా ఆమె సోషల్‌ మీడియాలో స్పందిస్తుంటారు.  ఏకంగా ప్రధాని మోదీని టార్గెట్‌ చేస్తూ పలు ఆరోపణలు చేశారు. అయితే ఈసారి ఏకంగా హిందుత్వ సిద్ధాంత కర్త వీర్‌ సావర్కర్‌ను ఆమె లక్ష్యంగా చేసుకున్నారు. ఆయన బ్రిటిష్‌ వాళ్లను క్షమాభిక్ష కోరి జైలు నుంచి విడుదలయ్యారు కాబట్టి పేరులో వీర్‌ అనే పదం ఉంచుకునే అర్హత లేదని ఆమె చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం లేపాయి. ఓ వర్గం నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. చంపుతాం అంటూ బెదిరింపు లేఖలు వచ్చాయి. అయినా స్వరాభాస్కర్‌ తన మాట వెనక్కి తీసుకోలేదు. గతంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో పాల్గొని బెదిరింపులకు గురయ్యారు. కథానాయికలు దేనిపైన స్పందించినా, స్పందించకున్నా వార్తే. నాజూకు అందాల నాయిక రాజకీయాల గురించి మాట్లాడితే రచ్చే. అందగత్తెలు అధికార పక్షాలపై విమర్శలతో విరుచుకుపడడం ప్రేక్షకుల్లో ఒకింత ఆసక్తితో పాటు సినిమాలకు ప్రచారమూ కల్పిస్తోంది. 

Updated Date - 2022-07-05T05:58:47+05:30 IST