స్టార్‌డమ్‌ నిర్వచనం మారిపోయింది

ABN , First Publish Date - 2022-07-17T07:28:56+05:30 IST

ఓ పాత్ర ఇస్తే.. ఆ పాత్ర ఎత్తూ, బరువూ, లోతూ కొలిచే నటుడు ప్రకాశ్‌ రాజ్‌.

స్టార్‌డమ్‌ నిర్వచనం మారిపోయింది

రాజకీయాలు నేరుగా నన్ను, నా ప్రజలను, దేశాన్ని ప్రభావితం చేస్తాయి. అధికారంలో బీజేపీ ఉండొచ్చు, మోదీ ఉండొచ్చు, ఆరెస్సెస్‌ సిద్ధాంతం రాజ్యమేలవచ్చు. కానీ వ్యక్తిగతంగా వారిపై నాకెందుకు కక్ష ఉంటుంది. నాకు కూతురుని ఇచ్చిన మామకాదు కదా!


పాత్ర ఇస్తే.. ఆ పాత్ర ఎత్తూ, బరువూ, లోతూ కొలిచే  నటుడు ప్రకాశ్‌ రాజ్‌. 360 డిగ్రీల్లో ఎక్కడో ఓ చోట.. తనదైన ముద్ర వేయగలడు. నిర్జీవమైన సన్నివేశానికి సైతం తన నటనతో ఆక్సిజన్‌ అందివ్వగలడు. ప్రకాష్‌ రాజ్‌ నటుడు మాత్రమే కాదు. జీవితాన్ని అన్ని కోణాల్లోనూ చదివేసిన ఓ తత్వవేత్త. మనిషి గురించీ, మతం గురించీ, ఆఖరికి మొక్క గురించీ.. ఏమైనా అడగచ్చు. మారుతున్న కాలాన్నీ, దూసుకొస్తున్న సాంకేతికతనూ అంచనా వేయగలడు. వ్యవస్థలో లోపాన్ని ప్రశ్నించగలడు. ఒక్కోసారి తానే సమాధానమై నిలబడగలడు. ఇన్నేళ్ల తరవాత కూడా ఇప్పటికీ ఏదో చేయాలని, ఇంకేదో సాధించాలకునే నిత్య విద్యార్థి ప్రకాశ్‌ రాజ్‌తో ‘నవ్య’ సంభాషణీయం.


సినిమాతో మీ ప్రయాణం ఎలా సాగుతోంది?

సినిమాతో నాది మూడన్నర దశాబ్దాల అనుబంధం. ఇన్నేళ్ల తర్వాత కూడా ఇంకా నటుడిగా నాకు దక్కుతున్న ఆదరణకు ఆనందంగా ఉంది. ఎప్పటికప్పుడు కాలానుగుణంగా నన్ను నేను మార్చుకుంటూ వస్తున్నాను కాబట్టే ఇది సాధ్యమైంది. నటనకు ఆస్కారమున్న పాత్రలు నన్ను వెతుక్కుంటూ రావడం నా అదృష్టం.  


నటుడిగా ఇన్నేళ్ల కెరీర్‌ ఎలా సాధ్యమైంది?

  నిజంగా ఇన్నేళ్ల కెరీర్‌ తర్వాత పాతబడి, ప్రేక్షకులకు బోర్‌ కొట్టాలి కానీ మారిన పరిస్థితులకు అనుగుణంగా నాలోని నటుణ్ణి ఎప్పటికప్పుడు సానబెట్టుకుంటూ సరికొత్తగా సృజించుకుంటూ  నిలబడగలిగాను. ఇప్పుడు కొనసాగుతున్న దశ నటుడిగా నాకు నూతన అధ్యాయం.


మారుతున్న ట్రెండ్‌ని, అభిరుచుల్ని ఎలా పసిగట్టగలుగుతున్నారు?

నేను 70వ దశకంలో పుట్టాను. ఇంటర్‌ వరకూ టీవీ చూడలేదు. 94లో కంప్యూటర్‌ చూశాం. అప్పటికే మధ్యవయస్కులమయ్యాం. ఆ తర్వాత సెల్‌ఫోన్‌. కాలేజీలో సినిమాల గురించి ఏమీ నేర్పలేదు. వెళ్తూ వెళ్తూ నేర్చుకున్నదే. మనుగడ కోసం పోరాటంలో నేర్చుకోవడం, దాన్నిపక్కనపెట్టి కొత్తది నేర్చుకోవడం అనేది ఒక నిరంతర అభ్యాసమైంది. నటుడిగా పరిశ్రమకి నీ అవసరం ఉండేలా చూసుకోవాలి. దానికోసం ఎప్పటికప్పుడు నిన్ను నివ్వు సరికొత్తగా మలచుకోవాలి. నటుడిగా నీకు ఎంత టాలెంట్‌ అయినా ఉండొచ్చు, అందంగా, ఆరోగ్యంగా ఉండొచ్చు, కానీ వర్తమానానికి నీ అవసరం ఉందా అనేది పరిశ్రమ చూస్తుంది. ‘నీ అవసరం లేదు ఇంటికెళ్లిపో’ అంటే మనం చేసేదేమీ లేదు. ఎంత పేరు సంపాదించుకున్నా ఇప్పటి పరిస్థితులకు తగ్గట్లుగా ఉండకపోతే మనుగడ లేదు. 


పరిశ్రమలో మీ స్థానం పదిలమవడానికి కారణం ఏమిటనుకుంటున్నారు?

నూటికి నూరుశాతం నాటకరంగమే. చిన్న వయసులోనే నాటకాలు వేయడం నాకు లాభించింది. నాటకం అంటే వేషాలు, ముఖానికి రంగులు పులుముకోవడం మాత్రమే కాదు. నాటకం అంటే అదొక ప్రపంచ గవాక్షం. కొత్త సాహిత్యం, గొప్ప రచయితలను పరిచయం చేస్తుంది. ప్రపంచ పౌరుడుగా ఎదగగలుగుతాం. నటుడు అనేవాడు గ్రహించగలిగేవాడు. దాన్ని జీర్ణం చేసుకోగలిగేవాడు. దాన్ని తన నటనకు అన్వయించుకోగలిగేవాడు. అది నేను చేయగలిగాను కాబట్టే నటుడిగా ఇంకా రేసులో ఉన్నాను. నాకు ఐదు జాతీయ అవార్డ్‌లు రావడం వల్ల నేను ఈ రోజు గొప్పవాణ్ణి కాలేదు. ఆ సంవత్సరంలో వచ్చిన సినిమాల్లో నువ్వు ఉత్తమ నటుడివి మాత్రమే అని అర్థం. అదేమీ భారతరత్న కాదు కదా! ఆ అవగాహన నాకు ఉంది. 

 

అలసిపోయిన ఫీలింగ్‌, ఇకచాల్లే అనిపించలేదా? 

నీకు ఎంత సంపాదించాలో తెలియాలి. అది ఎప్పుడు ఆపాలో తెలియాలి. ఒకరోజు నా సీనియర్‌ ఒకరు ‘నువ్వు భలే బతుకుతున్నావు ప్రకాష్‌, నేను కూడా ఫాం హౌస్‌ ఒకటి కొంటాను’ అన్నాడు. ‘మీరు కొనే వయసు అయిపోయింది కొన్నాళ్లు ఆగండి’ అన్నాను. ‘అదేంటి’ అన్నాడు. ‘నేను 20 ఏళ్ల క్రితం నాటిన చెట్లు కింద కూర్చున్నాను. మీరు ఇప్పుడు నాటితే అవి పెరిగేనాటికి కూర్చోవడానికి  మీరుండరు’ అన్నాను. 60 ఏళ్లు వచ్చాక బట్టతల ఉంటే దాంతోనే తిరుగు. విగ్గులు ఎందుకు. ‘ప్రకా్‌షరాజ్‌ యు ఆర్‌ లుక్‌ వెరీ యంగ్‌’ అంటుంటారు. నా లుక్‌ యంగ్‌గా ఉంది కానీ నేను యంగ్‌ కాదు కదా? అబద్ధం అనేది చాలా అందమైన విషయం. అది అవతలివాడికి చెప్పాలి తప్ప నీకు నువ్వు చెప్పుకోకూడదు కదా. ఇదే జీవిత తత్వసారం. ఇది లేకపోతే తొందరగా అలసిపోతావు. 


మన చుట్టూ మారుతున్న ప్రపంచాన్ని సినిమాలో ఎలా ప్రతిబింబించాలి?

అది చేయలేకనే కదా పెద్ద స్టార్లు నటించిన సినిమాలు పోతున్నాయి. వాళ్లు వాస్తవానికి దూరంగా బతుకుతున్నారు. విజయ్‌ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌, సాయిపల్లవి, సూర్య, యష్‌ని తీసుకోండి. ఇప్పుడు 30 ఏళ్ల అనుభవం ఉన్న న టులు వారితో పోటీ పడాల్సి వస్తోంది. వాళ్ల ఇంటెలిజెన్స్‌, కామన్‌సెన్స్‌ వల్ల ఇంతమంది దర్శకులు, రచయితలు ఇన్ని సినిమాలు తీయగలుగుతున్నారు. స్టార్‌డమ్‌ నిర్వచనం మారిపోయింది. విభిన్న పాత్రలతో మెప్పించేవాడే యాక్టర్‌ ఇప్పుడు. ‘అన్నా నువే దేవుడు’ అనే టైమ్‌ అయిపోయింది. ప్రజల్లో అవగాహన స్థాయి చాలా పెరిగింది.


సినిమా భాష అనేది మారిందా?

నా దృష్టిలో సినిమా అనేది సరికొత్త ప్రపంచ భాష. ఇతర భాషల్లానే ఇదొక జీవనది. మొదట్లో పెద్ద స్టూడియోలు, పంపిణీ వ్యవస్థలు వచ్చాయి. టెలివిజన్‌ వచ్చినప్పుడు సినిమా చచ్చిపోతుందన్నారు. ప్రేక్షకులు థియేటర్లకు రారుకాబట్టి ఏడాది దాకా టీవీలో విడుదల చేయకూడదన్నారు. కానీ ఆపలేకపోయాం. ఇప్పుడు ఓటీటీ వచ్చింది. థియేటర్‌ లేకపోయినా ఓటీటీలో రిలీజ్‌ చేస్తున్నారు. డైలాగ్‌లు లేకుండా సినిమాలు ఉండవన్నారు. సైలెంట్‌ సినిమాలు వచ్చాయి. మ్యూజిక్‌ లేకుండా సినిమాలు వచ్చేశాయి. పర్‌ఫెక్ట్‌ లైటింగ్‌ లేకుండా క్యాండిడ్‌ సినిమా వచ్చేసింది. అదొక భాష. అది ఎప్పుడు ఏ రూపం తీసుకుంటుందో మనకేం తెలుసు. పాత వ్యవస్థలను కాపాడడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. కానీ మార్పుకు ప్రత్యామ్నాయం లేదు. దాన్ని స్వాగతించడం, దానికి తగ్గట్లు మారడం ఒక జీవన విధానం.


దర్శకత్వం వహించినా కొనసాగించకపోవడానికి కారణం?

వృత్తిపరంగా, గుర్తింపుపరంగా, రిలెవెన్స్‌ పరంగా నేను ముందు నటుణ్ణి. నటుడిగా ఇంకొకరి పెయింటింగ్‌లో నేను కలర్‌ని. కొన్ని పెయింటింగ్‌లు మనమే గీయాలనిపిస్తుంది. ఇప్పుడు ‘మనలో ఒకడు’ అనే సినిమా డైరెక్ట్‌ చేయబోతున్నాను. నాకు చెప్పాలనిపించింది కాబట్టి నేను ఏ సినిమా డైరెక్ట్‌చేసినా నేనే నా స్వార్జితంతో నిర్మిస్తాను. 


రాజకీయంగా మీరు క్రియాశీలంగా ఉన్నారు కదా?

రాజకీయాలు నేరుగా నన్ను, నా ప్రజలను, దేశాన్ని ప్రభావితం చేస్తాయి. అధికారంలో బీజేపీ ఉండొచ్చు, మోదీ ఉండొచ్చు, ఆరెస్సెస్‌ సిద్ధాంతం రాజ్యమేలవచ్చు. కానీ వ్యక్తిగతంగా వారిపై నాకెందుకు కక్ష ఉంటుంది. నాకు కూతురుని ఇచ్చిన మామకాదు కదా! నేను ఏడాదికి కోటి రూపాయల పైన పన్ను కడుతున్నాను. రోడ్లు బాగుండాలి, దేశం బాగుండాలి కాబట్టి సమాజంకోసం మీరు డబ్బులు ఇవ్వండి అని పౌరులను అడుక్కుంటున్నారు. నన్ను అడుక్కునేవాడు నాకు దేవుడు ఎలా అవుతాడు. నా డబ్బుతో దేశాన్ని సరిగ్గా నడపకపోతే నేను అడగాలా వద్దా.       మోదీని అడిగితే హిందూ విరోధి అంటారు. నేను రైటిస్ట్‌ కాదు, లెఫ్టిస్ట్‌ కాదు, సెంట్రిస్టు కాదు. నేనొక మనిషిని. 

కేసీఆర్‌ గారంటే ఇష్టం అంటే ఆయన పార్టీ అంటారు. ఎంత తీసుకున్నావు అంటారు. కాంగ్రెస్‌ వాళ్లు తిడతారు. కాంగ్రె్‌సని పొగిడితే టీఆర్‌ఎస్‌ వాళ్లు తిడతారు. బీజేపీని ప్రశ్నిస్తే కాంగ్రెస్‌ వాళ్లు హ్యాపీ. కాంగ్రెస్‌ వాళ్లను ప్రశ్నిస్తే బీజేపీ వాళ్లు హ్యాపీ. ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ చూడడానికి అని వచ్చి నేను ఫుట్‌బాల్‌ అయిపోయాను.  


దానివల్ల చాలా ఇబ్బందులు ఎదరయినట్లున్నాయి?

నేను ఏదైనా తప్పు చేసి ఇబ్బందులు పడితే పోన్లే నేనే పాపం చేశాను అనుకుంటాను. నిజాయితీగా బతుకుతున్నప్పుడు ఇబ్బందిపెడితే పోరాటం చేసితీరాల్సిందే. ఐటీ దాడులు చేసి ఏం పట్టుకున్నారు? బినామీ ఆస్తులు ఏవైనా దొరికాయా? హనీ ట్రాప్‌లు వేస్తారా? అలాంటి అలవాట్లు నాకు లేవు కాబట్టి దొరకను. ఇంకేం చేయాలి. వంద కేసుల్లో నన్ను లోపల వేసే అవకాశం మీకు ఉంది. అయినా వేయలేకపోతున్నారంటే నేను నిజాయితీగా బతుకుతున్నాననే కదా అర్థం. సోషల్‌ మీడియాలో... నీ అంతు చూస్తాం, నువ్వు పోతావురా, అంటారు. వాడికా ఆనందం ఏంటో నాకు అర్థం కాదు. ‘నీ సినిమాలు చూడం’ అన్నారు. అయినా నా సినిమాలు ఆడుతూనే ఉన్నాయి. మోదీ మీద సినిమా తీస్తే ఇండియా మొత్తం మీద రూ. 30 కోట్ల వసూళ్లు రాలేదు. దీపికా పడుకోన్‌ సినిమా నిషేధించారు. రూ. 500 కోట్లు వసూలు చేసింది. 

 సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌


ఇంత తెలిసిన మీరు ఎన్నికల్లో ఎందుకు పోటీ చేశారు?

 గెలిచామా, ఓడామా అనికాదు, బతికామా లేదా? ఒక ఎంపీ నియోజకవర్గంలో సమస్యలు ఏమిటో తెలుసుకుందామని నేను మూలాల్లోకి వెళ్లాను. అసలు ఏమి జరుగుతుందో తెలుసుకోకుండా బయట నుంచి మాట్లాడడం సరికాదు కదా? పోటీ చేశాను. నేర్చుకున్నాను. 


ప్రకాష్‌ రాజ్‌ని చరిత్ర ఎలా చూడాలని మీరు అనుకుంటున్నారు?

 చరిత్ర నన్ను విస్మరించలేదు. నన్నొక వైరస్‌ అనొచ్చు, లేదా అందమైన జంతువు అనొచ్చు కానీ నన్ను తృణీకరించలేరు. 50 ఏళ్ల పాటు ఒక కళాకారుడిగా పలు భాషల్లో ఐదారొందల సినిమాల్లో కనీసం పదైనా కలకాలం గుర్తుండే పాత్రలు ఉంటాయి. వాడు ప్రకృతిలో గడపొచ్చు, అడవుల్లో బతకొచ్చు. వాడు నాటిన మెక్కలు చెట్లవ్వచ్చు, వాడు సృష్టించిన పాత్రలు ఉండొచ్చు.. వైరుధ్యం అంతా అందులోనే ఉంది. ఎందుకంటే అతను ఈ రోజుకి రిలెవెన్స్‌. ఆ కాలపు గొంతుక, వ్యక్తి అనే విషయం చరిత్రలో ఉంటుంది. అంతకన్నా ఏం కావాలి. వందకోట్ల మంది మధ్యలో ఒకడున్నాడు. 


ఇప్పటిదాకా మీరు చేసిన పాత్రల్లో కష్టంగా అనిపించింది?

‘సరిలేరు నీకెవ్వరు’ లాంటి కమర్షియల్‌ సినిమాల్లో అబద్దాలు చెప్పే సన్నివేశాల్లో నటించడం నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది. ఒక మూసతరహాలో సాగే చిత్రాలు చేయడం అంటే నాకు అనాసక్తి. అలాంటి వాటిల్లో చేసినప్పుడు సంతృప్తిగా అనిపించదు. కానీ ఏదో చేస్తాం. అక్కడ మన ఆలోచలకు అవకాశం ఉండదు. పాత్రలో లీనమవ్వం. కానీ ‘మేజర్‌’, ‘కాంజీవరం’, ‘యధువర్‌’, ‘బొమ్మరిల్లు’, ‘ఆకాశమంత’ లాంటి సినిమాల్లో ఒక లైఫ్‌ ఉంటుంది. నటన అనేది వృత్తి కూడా. అందులో బతకడానికి డబ్బులు కూడా వస్తాయి. పెద్ద పేరు, పాపులారిటీ, డబ్బు వస్తుందని నేను నటనను కెరీర్‌గా తీసుకోలేదు. కమర్షియల్‌ సినిమాకు ఎక్కువ తీసుకుంటూ నచ్చిన సినిమాలకు తక్కువ తీసుకుంటూ సమతూకం పాటించాలి. మహే్‌షతో ‘సరిలేరు నీకెవ్వరు’ చేశాక ఆయన ప్రొడక్షన్‌లోనే ‘మేజర్‌’ చేశాను. ఆ బ్యాలెన్స్‌ పాటించాను.

Updated Date - 2022-07-17T07:28:56+05:30 IST