Keedaa Cola: యంగ్ అండ్ ట్యాలెంటెడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం (Tharun Bhascker Dhaassyam) దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్లిచూపులు’ (PelliChoopulu), ‘ఈ నగరానికి ఏమైంది’ (Ee Nagaraniki Emaindi) చిత్రాలు మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయినటువంటి తరుణ్ భాస్కర్ ఈసారి సరికొత్త క్రైమ్ కామెడీతో రాబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన వివరాలతో పాటు టైటిల్‌ను కూడా తాజాగా మేకర్స్ విడుదల చేశారు. విజి సైన్మా ప్రొడక్షన్ నంబర్ 1గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘కీడా కోలా’ (Keedaa Cola) అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేసినట్లుగా చెబుతూ.. టైటిల్ లుక్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు.
‘కీడా’ అంటే ఆరు కాళ్లు ఉన్న పురుగు, కోలా అనేది ప్రముఖ సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ పేరు. ఈ టైటిల్ లుక్ పోస్టర్‌లో సాఫ్ట్ డ్రింక్ సీసా క్యాప్‌పై టైటిల్ రాసి ఉంది. డ్రింక్‌కి బదులు రక్తం పొంగుతూ బయటికి రావడం మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. అలాగే పోస్టర్‌లో ఒక పురుగుని కూడా చూపించారు. ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ పోస్టర్లను పసుపు రంగులో డిజైన్ చేసినట్లుగానే.. అదే సెంటిమెంట్‌ను దర్శకుడు తరుణ్ భాస్కర్ కొనసాగిస్తూ ‘కీడా కోలా’ పోస్టర్‌ని కూడా అదే రంగులో డిజైన్ చేయడం విశేషం. ‘‘మునుపెన్నడూ చూడని క్రైమ్ కామెడీని ఎక్స్‌పీరియన్స్ చేయండి..’’ అని మేకర్స్ పోస్టర్‌లో వెల్లడించడంతో.. ఇది ఏ తరహా చిత్రమో కూడా మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. కాగా, 2023లో విడుదలకానున్న ఈ చిత్రానికి భరత్ కుమార్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ, శ్రీనివాస్ కౌశిక్, సాయికృష్ణ గద్వాల్, విజయ్ కుమార్ నిర్మాతలు. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు.