మెప్పుకోసం ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడవద్దు: వైసీపీ ఎమ్మెల్యేకు తమ్మారెడ్డి కౌంటర్

ABN , First Publish Date - 2022-01-12T23:55:50+05:30 IST

‘‘సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలనుకుంటున్నాం. అంతేకానీ మీలా రెచ్చ‌గొట్ట‌ేధోర‌ణి మాది కాదు. కొంత‌మంది ఎవ‌రో మెప్పుకోసం ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతున్నారు. ఇది చాలా త‌ప్పు..’’ అని.. ఇటీవల టాలీవుడ్ నిర్మాతలపై

మెప్పుకోసం ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడవద్దు: వైసీపీ ఎమ్మెల్యేకు తమ్మారెడ్డి కౌంటర్

‘‘సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలనుకుంటున్నాం. అంతేకానీ మీలా రెచ్చ‌గొట్ట‌ేధోర‌ణి మాది కాదు. కొంత‌మంది ఎవ‌రో మెప్పుకోసం ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతున్నారు. ఇది చాలా త‌ప్పు..’’ అని.. ఇటీవల టాలీవుడ్ నిర్మాతలపై వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. కొద్ది రోజులుగా థియేట‌ర్లు, సినిమా టికెట్లు, పెద్ద సినిమాలు ఆగిపోవ‌డం వంటివాటిపై రకరకాలుగా వార్తలు వినిపిస్తోన్న నేపథ్యంలో.. వాటిపై వివరణ ఇచ్చేందుకు బుధవారం త‌మ్మారెడ్డి భరద్వాజ హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబ‌ర్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. 


ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘థియేట‌ర్ల‌లో టికెట్ రేట్లు పెంచే అవకాశం తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నప్పుడు, టికెట్ రేట్లు తగ్గించే అవకాశం ఏపీ ప్రభుత్వానికి ఉంటుంది. ప‌రిశ్ర‌మ‌లో ఏ స‌మ‌స్య ఉన్నా ముందు మీడియా స‌మ‌న్వ‌యం పాటించాలి. సంబంధంలేని వ్యక్తుల‌తో చర్చలు జ‌ర‌ప‌డం వ‌ల్ల స‌మ‌స్య ప‌రిష్కారం కాక‌పోగా మ‌రింత జ‌ఠిలం అవుతుంది. అదేవిధంగా సినిమా స‌మ‌స్య‌ల గురించి ప్ర‌భుత్వానికి తెలియ‌జేసే హ‌క్కు ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్‌కే ఉంది. కోర్టు ద్వారా ఎంపిక చేసిన ఛాంబ‌ర్‌లోని కొంద‌రు స‌భ్యులు ఏపీ ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. కొద్ది రోజులలో స‌మ‌స్య‌కు ప‌రిష్కారం దొరుకుతుందని అనుకుంటున్నాను. చాలామంది ‘ఫెడ‌రేష‌న్ ఉందిక‌దా.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఉంది క‌దా.. వారేమీ మాట్లాడ‌రా?’ అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. అవి ఇండిపెండెంట్ బాడీలు మాత్ర‌మే. ఇండ‌స్ట్రీకి పెద్ద దిక్కు ఛాంబ‌ర్ మాత్ర‌మే. అందులోని పెద్దలు మాత్రమే ఈ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించగ‌ల‌రు.


ఆంధ్ర‌లో రూ. 10, రూ. 5 రూపాయ‌లు టికెట్ పెడితే అది త‌ప్ప‌ని చెప్పాం. 40 రూపాయ‌లు చేయాల‌ని మెమోరాండం ఇచ్చాం. మొన్న మీటింగ్‌లో కూడా చ‌ర్చించాం. త్వ‌ర‌లో మ‌రో మీటింగ్ జ‌రుగుతుంది.. స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంద‌నే న‌మ్మ‌క‌ముంది. ఇక పెద్ద సినిమాలు వాయిదా ప‌డ‌టానికి కారణం కరోనానే. అవి పాన్ ఇండియా సినిమాలు కాబ‌ట్టి పెట్టిన కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డి రావాలంటే సాధ్య‌ప‌డదు కాబ‌ట్టి వాయిదా వేసుకున్నారు. కరోనా కారణంగా ఢిల్లీ, మ‌హారాష్ట్ర, త‌మిళ‌నాడు, క‌ర్నాట‌క వంటి చోట్ల 50శాతం ఆక్యుపెన్సీ ఉంది. అదే కారణం తప్ప.. ఏపీ టికెట్ల రేట్ల‌కు, పెద్ద సినిమాల వాయిదాకు ఎటువంటి సంబంధంలేదు.


అలాగే ఇటీవ‌ల ఓ రాజ‌కీయ‌ నాయ‌కుడు సినిమా వారిని నిందించ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించింది. ‘ఇండస్ట్రీ వారికి సిగ్గులేదు, దమ్ము లేదు, సినిమా వారికి బలిసింది..’ అని ఆయన అనడం చాలా బాధేసింది. ఆయనకి నేను చెప్పేది ఏమిటంటే.. ఇక్క‌డ ఎవ‌రికీ బ‌లుపులేదు. ఇక్క‌డ అందరూ ధైర్యవంతులే. సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలనుకుంటున్నాం.. అంతేకానీ మీలా రెచ్చ‌గొట్ట‌ేధోర‌ణి మాది కాదు. కొంత‌మంది ఎవ‌రి మెప్పుకోసమో.. ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతున్నారు. ఇది చాలా త‌ప్పు. మ‌రో వ్య‌క్తి ప్రొడక్ట్‌కు ధర నిర్ణయించుకునే అవకాశం నిర్మాతలకూ ఉంటుంది అన్నారు. అది క‌రక్టే. అదేవిధంగా ప్ర‌భుత్వానికి కొన్ని రూల్స్ ఉంటాయి. వాటి ప్ర‌కార‌మే టికెట్ రేటు కూడా పెంచుకునే అవ‌కాశం ఉంటుంది. ఇలా భిన్న‌మైన వాతావ‌ర‌ణం ఉన్న‌ప్పుడు చ‌ర్చ‌ల‌తో స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంది త‌ప్ప అవాకులు చెవాకులు పేలితే స‌మ‌స్య మ‌రింత జ‌ఠిల‌మ‌వుతోంది. దీనికి మీడియా కూడా స‌మ‌న్వ‌యం పాటించాల‌ని ఈ సందర్భంగా కోరుతున్నాను..’’ అని అన్నారు.

Updated Date - 2022-01-12T23:55:50+05:30 IST