AP CM Jaganకు ఫిలిం ఛాంబర్ లేఖ

ABN , First Publish Date - 2022-06-18T04:03:40+05:30 IST

ఏపీలో సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో అమ్మే అంశానికి సంబంధించిన వ్యవహారం మళ్లీ మొదటకొచ్చింది. ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా టికెట్లను అమ్మాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఈ నెల 2న జీవో 69ని విడుదల చేసింది. టికెట్ల అమ్మకాలకు సంబంధించి

AP CM Jaganకు ఫిలిం ఛాంబర్ లేఖ

ఏపీలో సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో అమ్మే అంశానికి సంబంధించిన వ్యవహారం మళ్లీ మొదటకొచ్చింది. ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా టికెట్లను అమ్మాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఈ నెల 2న జీవో 69ని విడుదల చేసింది. టికెట్ల అమ్మకాలకు సంబంధించి నెల రోజుల్లో ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవాలని ఆదేశిస్తూ పంపిన ఎంఓయూ పత్రాలను చూసిన థియేటర్ యజమానులు షాక్‌కు గురవుతున్నారు. టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించడం వరకు బాగానే ఉన్నప్పటికీ... టికెట్ల విక్రయాల తర్వాత థియేటర్లకు డబ్బు ఎప్పుడు జమ చేస్తారనే విషయాన్ని ఎంఓయూలో పేర్కొనకపోవడంతో, ఎంఓయూపై సంతకం పెడితే ప్రభుత్వం చేతుల్లో చిక్కుకున్నట్టేనని వారు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు జూలై 2లోపు ఎంఓయూలపై సంతకాలు చేయకపోతే థియేటర్ల లైసెన్స్ రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా.. సంతకాలు చేయబోమని, థియేటర్లు మూసివేసేందుకైనా సిద్ధమేనని థియేటర్ యజమానులు ఘంటాపథంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎగ్జిబిటర్ల ఆందోళనను, అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ.. సీఎం జగన్‌కు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) లేఖ రాసింది.


ఈ లేఖలో.. ‘‘మీరు పంపిన ఎంఓయూ (మెమోరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్)లో పొందుపరిచిన విషయాలు వివరంగా లేనందున మరియు కాలపరిమితి తక్కువగా ఉండుట వలన ఎగ్జిబిటర్లు ఒత్తిడికి లోనై ఆందోళన చెందుతూ మా ఫిలిం ఛాంబరుకు తెలియజేశారు. ప్రస్తుతం ఉన్న సిస్టమ్‌లో ఎప్పటికప్పుడు టిక్కెట్ అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం సినీ పరిశ్రమకు అనుకూలంగా ఉంది. మీరు సూచించిన జీ.ఓ ప్రకారం టిక్కెట్ అమ్మకాల ద్వారా వచ్చే చెల్లింపులు ఎప్పటికి అందుతాయో సదరు వివరములు తెలియజేయనందున, మరియు ఎగ్జిబిటర్లు గతంలో ఆయా కంపెనీల వారితో చేసుకున్న ఒప్పందాలు, ప్రస్తుతం అమలులో ఉన్న ఒప్పందాలకు భవిష్యత్తులో చట్టపరంగా ఈ జీ.ఓ.యం.యస్. 69 వలన ఏమైనా సమస్యలు ఎదుర్కొవలసి వస్తుందనే సందిగ్ధంలో పరిశ్రమలోని అన్ని వర్గాలు భయబ్రాంతులకు లోనై పరిశ్రమ కుంటుపడే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.


అందువలన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా ఆన్‌లైన్ లింక్‌ను ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు ఇస్తే.. ఆన్‌లైన్ టిక్కెటింగ్ ద్వారా వచ్చిన ఆదాయం మరియు థియేటర్ ఆక్యూపెన్సీ ఎప్పటికప్పుడు నిర్మాతలకు, పంపిణీదారులకు వివరముగా తెలియుటకు అవకాశం ఉండటంతో పాటు మరియు ఈ ఆదాయంపై కట్టవలసిన ట్యాక్స్‌లు వగైరా ప్రభుత్వానికి ఆన్‌లైన్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుస్తుంది. ఈ విధంగా అమలు పరిచినచో ఎగ్జిబిటర్లకు మరియు పంపిణీదారులకు ఈ ఆన్‌లైన్ టిక్కెటింగ్ వ్యవస్థ మీద ఎటువంటి ఫిర్యాదులు ఉండవని భావిస్తున్నాము. ఈ ఇండస్ట్రీపై ఆధారపడి లక్షలాది కుటుంబాలు ఉన్నాయి. కావున, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ శ్రేయస్సు కోరి.. ఈ ఆన్‌లైన్ టిక్కెటింగ్ విధానమును.. పైన తెలియజేసిన విధముగా అమలు పరిచేలా తగిన ఉత్తర్వులు జారీ చేయగలని కోరుచున్నాము..’’ అని పేర్కొన్నారు.





Updated Date - 2022-06-18T04:03:40+05:30 IST