తెలుగు వాకిట్లో.. పక్కింటి ‘పద్మం’

ABN , First Publish Date - 2022-01-26T03:45:25+05:30 IST

పద్మ అవార్డుల జాబితాలో మరోసారి తెలుగు సినిమాకి మొండి చేయే ఎదురైంది. టాలీవుడ్‌ ప్రముఖుల పేర్లు ఈసారి అస్సలు కనిపించలేదు. అలనాటి నటి షావుకారు జానకికి ‘పద్మ’ వరించినా, అది తమిళనాడు ప్రభుత్వ సిఫార్సుతో అందినదే. పక్క రాష్ట్రాల సిఫార్సుతో పద్మాలు దక్కించుకోవడం

తెలుగు వాకిట్లో.. పక్కింటి ‘పద్మం’

పద్మ అవార్డుల జాబితాలో మరోసారి తెలుగు సినిమాకి మొండి చేయే ఎదురైంది. టాలీవుడ్‌ ప్రముఖుల పేర్లు ఈసారి అస్సలు కనిపించలేదు. అలనాటి నటి షావుకారు జానకికి ‘పద్మ’ వరించినా, అది తమిళనాడు ప్రభుత్వ సిఫార్సుతో అందినదే. పక్క రాష్ట్రాల సిఫార్సుతో పద్మాలు దక్కించుకోవడం ఇదేం తొలిసారి కాదు. ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం పద్మ, పద్మభూషణ్‌, పద్మ విభూషణ్‌ పురస్కారాలు అందుకున్నది తమిళనాడు కోటా నుంచే. రాజమౌళికి పద్మశ్రీ తీసుకొచ్చేందుకు కర్నాటక ప్రభుత్వం కృషి చేసింది. వీళ్లంతా మన తెలుగువాళ్లు. మన ప్రభుత్వాలు గౌరవించుకోవాల్సిన కళాకారులు. వాళ్లని మన ప్రభుత్వాలు విస్మరించినా, పక్క రాష్ట్రాలు మాత్రం మర్చిపోలేదు. వాళ్ల ప్రతిభను గుర్తించి తగిన రీతిలో సత్కరించుకున్నాయి. 


మరీ ముఖ్యంగా తమిళనాట జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగువాళ్లకు తమిళనాడు కోటాలో పద్మ అవార్డులు దక్కాయి. ఆమెకు తెలుగు చిత్రసీమకు సంబంధ బాంధవ్యాలు ఉండడంతో.. తెలుగువారికి పద్మ అవార్డులు దక్కడంలో ఆమె కొంత కృషి చేశారు. మరి మనవాళ్లెందుకు ఈ విషయంలో చొరవ చూపించడం లేదన్నది పెద్ద ప్రశ్న. పద్మ అవార్డుల విషయంలో తెలుగు వాళ్లకు, ముఖ్యంగా సినిమా వాళ్లకు మొండి చేయి ఎదురవ్వడంలో ప్రభుత్వాల పాత్ర కూడా ఉంది. 


చెన్నై నుంచి చిత్రసీమ హైదరాబాద్‌కు ఎప్పుడో తరలి వచ్చేసింది. పరిశ్రమకు కావల్సిన సదుపాయాలు కలిగిస్తూ, కళాకారుల్ని ప్రోత్సహించడం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. కానీ అది జరగడం లేదు. ఏపీ ప్రభుత్వం నంది అవార్డులనే ఇవ్వడం లేదు. తెలంగాణ ప్రకటించిన ‘సింహా’ పురస్కారాలకూ మోక్షం కలగలేదు. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత.. సినిమావాళ్లు ఏ రాష్ట్రానికి చెందుతారు? ఎవరిని ఎవరు సిఫార్సు చేయాలి? అనేది పెద్ద డైలామాగా మారిపోయింది. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పద్మల గురించి పట్టించుకోవడమే మానేశాయి. పక్క రాష్ట్రాలు చొరవ తీసుకుని, కేంద్రానికి సిఫార్సు చేస్తేనే గానీ, తెలుగువాళ్లకు పద్మ రావడం కష్టమైపోతోంది. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉంది. 

Updated Date - 2022-01-26T03:45:25+05:30 IST