Movie Tickets.. ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో మాకు సంబంధం లేదు: మంత్రి తలసాని

ABN , First Publish Date - 2021-12-03T22:39:18+05:30 IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తరహాలో సినిమా టికెట్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి ఎటువంటి ఆలోచన లేదని అన్నారు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరలు ఇలానే ఉండాలంటూ.. ఇటీవల ప్రభుత్వం కొత్త జీవోని

Movie Tickets.. ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో మాకు సంబంధం లేదు: మంత్రి తలసాని

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తరహాలో సినిమా టికెట్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి ఎటువంటి ఆలోచన లేదని అన్నారు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరలు ఇలానే ఉండాలంటూ.. ఇటీవల ప్రభుత్వం కొత్త జీవోని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏరియాల వైజ్‌గా టికెట్ల ధరలను ప్రభుత్వం విడుదల చేసింది. సినిమా టికెట్ల ధరలపై ఏపీ ప్రభుత్వ తీరుతో.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మౌనం నెలకొంది. ఒకరిద్దరు మినహా ఎవరూ ప్రభుత్వానికి విజ్ఞప్తి కూడా చేయలేని పరిస్థితి నెలకొంది. అయితే ఏపీ ప్రభుత్వ నిర్ణయానికి, తెలంగాణకు ఎటువంటి సంబంధం ఉండదని మంత్రి తలసాని తేల్చి చెప్పారు. తాజాగా ఆయనని సినిమా ఇండస్ట్రీ తరపున దిల్ రాజు, దానయ్య, రాజమౌళి, త్రివిక్రమ్ వంటి వారు కలిసి.. సమస్యలను తెలియజేశారు.


సినీ ప్రముఖులు చెప్పిన సమస్యలు విన్న అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ.. ‘‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తరహాలో సినిమా టికెట్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి ఆలోచన లేదు. సుమారు రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా సినిమా పరిశ్రమ ఎన్నో ఇబ్బందులు పడింది.. పడుతుంది. పెద్ద సినిమాలు చాలా వరకు రిలీజ్ కావాల్సి ఉంది. ‘అఖండ’ చిత్రం విడుదలైంది. ఇంకా ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ఫ’, ‘భీమ్లా నాయక్’ వంటి చిత్రాలు ఎన్నో విడుదలకు సిద్దమవుతున్నాయి. కాబట్టి చిత్ర పరిశ్రమకు చెందిన డైరెక్టర్స్, నిర్మాతలతో సమావేశం నిర్వహించడం జరిగింది. కరోనాకి సంబంధించిన కొత్త వేరియంట్‌తో పాటు ఇండస్ట్రీలో ఉన్న ఇతర సమస్యలపై వారు ఒక మెమోరెండం ఇచ్చారు. సినిమా పరిశ్రమకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటిని ప్రభుత్వం పరిష్కరిస్తుంది. సంక్రాంతి వరకు వరుసగా పెద్ద సినిమాలు వస్తున్నాయి కాబట్టి థియేటర్స్ విషయంలో ఎలాంటి అనుమానాలు లేవని చెప్పాను. ప్రజలకు కూడా మేము చెప్పేది ఒక్కటే. ఎలాంటి భయం వద్దు.. అన్ని జాగ్రత్తలతో ప్రజలంతా సినిమా థియేటర్లలోనే సినిమా చూడాలి. కొన్ని లక్షల మంది కార్మికులు సినిమాను నమ్ముకొని ఉన్నారు. టికెట్ రేట్లపై కొన్ని సమస్యలు ఉన్నాయి. సీఎం కేసీఆర్‌గారితో చర్చించి.. సినిమా ఇండస్ట్రీ సమస్యల పరిష్కారంపై ఓ నిర్ణయం తీసుకుంటాము..’’ అని తెలిపారు.

Updated Date - 2021-12-03T22:39:18+05:30 IST