Swathi Muthyam film review: సరదాగా సాగిపోయే స్వాతి ముత్యం

ABN , First Publish Date - 2022-10-05T22:09:53+05:30 IST

దసరా పండగ (Dasara festival) రోజు రెండు పెద్ద సినిమాలతో (Big releases) పాటు ఒక చిన్న సినిమా 'స్వాతి ముత్యం' (small film Swathi Muthyam) కూడా విడుదల (Release) అయింది.

Swathi Muthyam film review: సరదాగా సాగిపోయే స్వాతి ముత్యం

సినిమా: స్వాతి ముత్యం 

నటీనటులు: బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ, రావు రమేష్, వి కె నరేష్, ప్రగతి, వెన్నెల కిశోరె, గోపరాజు రమణ, దివ్య శ్రీపాద మరియు తదితరులు 

సినిమాటోగ్రాఫర్: సూర్యా 

సంగీతం: మహతి సాగర్ (Mahati Saagar)

నిర్మాత: సూర్యదేవర నాగ వంశి (Suryadevara Naga Vamsi)

దర్శకత్వం: లక్ష్మణ్ కె కృష్ణ (Lakshman K Krishna)


సురేష్ కవిరాయని 


దసరా పండగ (Dasara festival) రోజు రెండు పెద్ద సినిమాలతో (Big releases) పాటు ఒక చిన్న సినిమా 'స్వాతి ముత్యం' (small film Swathi Muthyam) కూడా విడుదల (Release) అయింది. సితార ఎంటర్ టైన్ మెంట్ (Sithara Entertainment) లాంటి పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఈ చిన్న సినిమాని ప్రొడ్యూస్ చేసింది కాబట్టి, ఈ సినిమా మీద ఆసక్తి వుంది. ఈ సినిమాతో ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ (Producer Bellamkonda Suresh) రెండో తనయుడు గణేష్ (Ganesh) లీడ్ యాక్టర్ గా పరిచయం అయ్యాడు. అలాగే చిత్ర దర్శకుడు లక్ష్మణ్ (director Lakshman) కూడా ఈ సినిమాతో పరిచయం అవుతున్నాడు.  వర్ష బొల్లమ్మ (Varsha Bollamma) ఇందులో కథానాయకి. ఈ సినిమా ఎలా ఉందొ చూద్దాం. 


కథ:

బాలమురళి కృష్ణ (బెల్లంకొండ గణేష్) ఎలక్ట్రిసిటీ ఆఫీస్ లో వుద్యోగం చేస్తుంటాడు. ఇతని గురించి చెప్పాలంటే అమాయకత్వం తో కూడిన మంచితనం ఇతనిలో ఉంటుంది. ఇతని తల్లిదండ్రులు (రావు రమేష్, ప్రగతి) ఇతనికి పెళ్లి చెయ్యాలని సంబధం చూస్తారు. భాగ్యలక్ష్మి లేదా బాగీ (వర్ష బొల్లమ్మ) బాలమురళి అమాయకత్వాన్ని ఇష్టపడి పెళ్లి చేసుకుంటా అంటుంది. ముహూర్తం పెట్టేస్తారు, పెళ్లి రాత్రి అనగా, ఉదయానే ఒక అమ్మాయి (దివ్య శ్రీపాద) నెలల అబ్బాయి తో వచ్చి బాలమురళి ని కలిసి ఇతను మీకు పుట్టిన అబ్బాయే అని ఇచ్చి వెళ్ళిపోతుంది. రాత్రి పెళ్లి వరకు ఈ రహస్యం దాయాలని చూస్తాడు బాలమురళి, కానీ తెలిసిపోతుంది. ఇంకేముంది, రసాభాస అయి పెళ్లి ఆగిపోతుంది. ఇంతకీ ఆ బాబు ఎవరు, ఎవరికీ పుట్టారు, దాని వెనక వున్నా కథ ఏంటి, బాలమురళి కి పెళ్లి అయిందా లేదా అన్నదే మిగతా కథ. 



విశ్లేషణ:

దర్శకుడు లక్ష్మణ్ యంగ్ కుర్రాడు ఈ 'స్వాతి ముత్యం' తో పరిచయం అయ్యాడు. మొదటి సినిమాకి మంచి సేఫ్ (Safe Subject) కథని ఎంచుకున్నాడు. ఇది చిన్న సినిమా కాబట్టి ఇందులో ప్రతి ఒక్క పాత్రకి ప్రాముఖ్యత ఇచ్చి, మంచి నటనని రాబట్టుకున్నాడు దర్శకుడు. అదీ కాకుండా ఈ సినిమా చూస్తున్నంత సేపూ మన వూర్లో ఎలా వుంటాయో పాత్రలు అలానే ఇందులో అందరూ కనిపిస్తారు. ఒక చిన్న పాయింట్ ఎంచుకొని, దాని చుట్టూ కథ అల్లిన దర్శకుడు, అది చెప్పే విధానం కూడా బాగుంది. ఆ పాయింట్ కూడా చాల సెన్సిటివ్ అయినా, దర్శకుడు చాల సరదాగా చెప్పే విధానం వలన చూస్తున్న ప్రేక్షకులకు అది ఎబ్బెట్టుగా అనిపించకుండా, బాగా ఎంజాయ్ చేస్తారు. చాలామంది ఈ సినిమాని 'విక్కీ డోనార్' తో పోలుస్తున్నారు కానీ, దానికి దీనికి సంబంధం లేదు. కానీ ఆ సినిమా లో వున్న చిన్న పాయింట్ 'వీర్య దానం' ని తీసుకొని దర్శకుడు లక్ష్మణ్ కథ బాగానే అల్లాడు. అయితే సినిమా చూస్తున్నప్పుడు దర్శకుడు ఆ పాయింట్ ని చూపించే విధానం అది పెద్దవాళ్ళకి ఎలా చెప్పాలా అని కుర్రాళ్ళు ఆలోచించే విధానం నవ్వు తెప్పిస్తుంది. ఆ గోదావరి జిల్లా యాస, ఒక్కో పాత్ర మాట్లాడే విధానం, ఆ మాటకారితనం, ఆ పొడుపులు, విడుపులు వూర్లో ఎలా మాట్లాడుకుంటారూ అలానే పెట్టాడు దర్శకుడు. అలాగే అన్నదమ్ముల మధ్య అలకలు, మళ్ళీ వెంటనే కలిసిపోయే మనస్తత్వం బాగున్నాయి. మొత్తంమీద దర్శకుడు లక్ష్మణ్ 'స్వాతి ముత్యం' సినిమాని సరదాగా సాగిపోయేలా చూపించాడు. మొదటి సినిమా అయినా మంచి పరిణితి వున్నట్టుగా తీయగలిగే దర్శకుడు అనిపించుకున్నాడు. మన చుట్టూ జరుగుతున్న సంఘటనలని, మానుషులని మనం పరిశీలనగా చూస్తే మనకు చాల కథలు పుట్టుకొస్తాయి. అదే లక్ష్మణ్ చేసిన పని, అందులోంచి వచ్చిందే ఈ 'స్వాతిముత్యం'. ఆలా కాకుండా, మన తెలుగు కథలను వదిలేసి, ఎందుకో అన్ని వందల కోట్ల రూపాయలు పెట్టి, ఏవేవో సినిమాలు తీస్తారు. 



ఇంకా నటీనటుల విషయానికి వస్తే బెల్లంకొండ గణేష్ కరెక్టుగా ఆ అమాయక పాత్రకు బాగా సూట్ అయ్యాడు. మొదటి సినిమా అయినా బాగానే చేసాడు కానీ ఇంకా చాలా నేర్చుకోవాలి. కొంచెం సాధన చేస్తే, అనుభవంతో ముందు ముందు మంచి నటుడు అవుతాడు అనడం లో సందేహం లేదు. అన్న శ్రీనివాస్ ఎలాగూ కమర్షియల్, మాస్ సినిమాలు చేస్తున్నాడు కాబట్టి, గణేష్ కొంచెం ఇలా ఫామిలీ సబ్జక్ట్స్ ఎంచుకుంటే బాగుంటుంది. వర్ష బొల్లమ్మ మళ్ళీ మరోసారి తాను మంచి నటి అని నిరూపించుకుంది. మిడిల్ క్లాస్ మెలోడీస్ తరువాత ఆమెకి ఇందులో మంచి ప్రతిభ కనపరిచే పాత్ర దొరికింది, ఆమె అందుకు తగ్గట్టుగా చాలా బాగా చేసింది. 

ఇంకా ఈ సినిమాకి ఆయువుపట్టు లాంటి పాత్రలో రావు రమేష్ (Rao Ramesh highlight) నటించాడు. రావు రమేష్ మనకున్న అతి కొంత  మంది మంచి నటుల్లో ఒకరు. అతన్ని దర్శకుడు ఎలా చేయించుకుంటే అతని అందుకు తగ్గట్టుగా మలుచుకుంటాడు. ఈ చిన్న సినిమాని రావు రమేష్ తన నటనా ప్రతిభతో ఎక్కడికో తీసుకెళ్లాడు. ఆ యాస, ఆ మాట్లాడే విధానం, ఆ హావభావాలు అయన నటిస్తున్నట్టు ఉండదు, మన కుటుంబలో ఒకడు ఎలా ప్రవర్తిస్తాడో అలానే అనిపిస్తాడు అతని నటన చూస్తే. కొన్ని పాత్రలు రావు రమేష్ మాత్రమే చెయ్య గలదు అని ఉంటాయి, అందులో ఈ బూరాడ వెంకట రావు (Boorada Venkatra Rao) పాత్ర ఒకటి. మన తెలుగు దర్శకులు అతన్ని సరిగ్గా ఉపయోగించుకోవటం లేదు అనిపిస్తోంది. ఇంకా నరేష్ VK Naresh), గోపరాజు రమణలు (Goparaju Ramana) కూడా చాల బాగా చేసారు. ముఖ్యంగా గోపరాజు రమణ తన మాటలతో నవ్వులు పండించాడు. క్లైమాక్స్ లో ఇంకా బాగా చేసాడు రమణ. వెన్నెల కిశోర్ (Vennela Kishore) డాక్టర్ గా కనిపిస్తాడు, అలాగే ఎంటర్ టైన్ మెంట్ కూడా ఇస్తాడు.  దివ్య శ్రీపాద (Sripada Divya) కూడా చక్కగా నటించింది. ప్రగతి, సురేఖ వాణి లు బాగా సపోర్ట్ చేసారు. క్లైమాక్స్ కొంచెం వెరైటీ గా సరదాగా తీసాడు. 


మహతి సాగర్ (Mahati Saagar) సంగీతం బాగుంది. సరదాగా సాగిపోయే సినిమాకి తగ్గట్టుగా హాయిగా వుంది అతని సంగీతం. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సాంకేతికంగా సినిమా క్వాలిటీ గా తీశారు. మాటలు ఈ సినిమా కి ఇంకో హైలైట్ అనే చెప్పాలి. అంత బాగున్నాయి, నాకయితే బాగా నచ్చేసాయి, గోదావరి జిల్లా వ్యంగం తో కూడిన పంచ్ లు బాగా రాసాడు రాఘవ. 

చివరగా, 'స్వాతి ముత్యం' చెప్పాలంటే దసరా పండగకి సరిగ్గా సరిపోయే సినిమా. ఇంటిల్లిపాదీ సరదాగా హాయిగా ఈ సినిమాని చూసుకోవచ్చు. అయితే ఇలాంటి సినిమాలు మొదటి రోజు అంత పెద్ద కలక్షన్స్ లేకపోయినా, స్లో గా అందుకోడానికి ఆస్కారం వుంది. కొట్లాటలు, తన్నుకోడాలు, తిమ్మిరెక్కే డాన్సులు, తలలు తెగిపోవడాలు, ఒక్కడే 20 మందిని కొట్టే సన్నివేశాలు, ఇవేమి వుండవు ఇందులో. హాయిగా నవ్వుకోవాలని అనిపిస్తే ఈ సినిమా చూడండి. 

Updated Date - 2022-10-05T22:09:53+05:30 IST