ఎస్వీ రంగారావు వేషం బాలయ్యకు అలా దక్కింది!

ABN , First Publish Date - 2022-04-09T23:56:00+05:30 IST

హీరో కృష్ణ నటించి, నిర్మించిన ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రంలో బాలయ్య అగ్గిరాజు పాత్ర పోషించారు. ఈ పాత్ర పరిధి తక్కువే అయినా చాలా కీలకమైంది. బాలయ్య పోషించిన అద్భుత పాత్రల్లో ఇది ఒకటి. అయితే ఈ వేషం బాలయ్యకు దక్కడానికి వెనుక పెద్ద కథ ఉంది. అదేమిటంటే.. ‘అన్నదమ్ముల కథ’ చిత్ర నిర్మాణ సన్నాహాల్లో ఉన్నప్పుడు హీరో కృష్ణ బాలయ్యకు ఫోన్‌ చేసి ‘మా సినిమాలో అగ్గిరాజు పాత్ర మీరు చేస్తే బాగుంటుంది’ అని అడిగారు.

ఎస్వీ రంగారావు వేషం బాలయ్యకు అలా దక్కింది!

హీరో కృష్ణ నటించి, నిర్మించిన ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రంలో బాలయ్య అగ్గిరాజు పాత్ర పోషించారు. ఈ పాత్ర పరిధి తక్కువే అయినా చాలా కీలకమైంది. బాలయ్య పోషించిన అద్భుత పాత్రల్లో ఇది ఒకటి. అయితే ఈ వేషం బాలయ్యకు దక్కడానికి వెనుక పెద్ద కథ ఉంది. అదేమిటంటే.. ‘అన్నదమ్ముల కథ’ చిత్ర నిర్మాణ సన్నాహాల్లో ఉన్నప్పుడు హీరో కృష్ణ.. బాలయ్యకు ఫోన్‌ చేసి ‘మా సినిమాలో అగ్గిరాజు పాత్ర మీరు చేస్తే బాగుంటుంది’ అని అడిగారు. అప్పటికే ‘అల్లూరి సీతారామరాజు’ షూటింగ్‌ మొదలైంది. చింతపల్లి అడవుల్లో నెల రోజులు మకాం వేసి, షూటింగ్‌ పూర్తి చేయడానికి కృష్ణ, ఆయన సోదరులు హనుమంతరావు, ఆదిశేషగిరిరావు పక్కా ప్రణాళిక సిద్ధం చేశారు. ఆ విషయం బాలయ్యకు తెలుసు. అందుకే ‘ప్రస్తుతం నేను నా కొత్త సినిమా కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నాను. అంతదూరం చింతపల్లి వచ్చి షూటింగ్‌ చేయడం కష్టం’ అని చెప్పేశారు. రెండుమూడు సార్లు అడిగినా అదే సమాధానం రావడంతో ఇక వత్తిడి చేయడం ఇష్టం లేక హీరో కృష్ణ సరేనన్నారు. తర్వాత ఎస్వీ రంగారావును సంప్రదించారు. ఆయన అంగీకారంతో అగ్గిరాజు పాత్ర ఆయన పోషిస్తున్నట్లు పత్రికా ప్రకటన ఇచ్చారు. 


చింతపల్లి అడవుల్లో ‘అల్లూరి సీతారామరాజు’ షెడ్యూల్‌ మొదలైంది. ఎస్వీ రంగారావు బెంగళూరులో ‘యశోదాకృష్ణ’ షూటింగ్‌లో ఉండడంతో అగ్గిరాజుకు సంబంధించిన సన్నివేశాలను పక్కన పెట్టి మిగిలిన సన్నివేశాలు తీస్తున్నారు. రంగారావు బెంగళూరు నుంచి తిరిగి రాగానే అగ్గిరాజుకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించాలని దర్శకుడు వి.రామచంద్రరావు ప్లానింగ్‌. అయితే రంగారావు ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉండడంతో ‘యశోదాకృష్ణ’ షూటింగ్‌ లేటవుతోంది. ఇటువంటి నేపథ్యంలో ఓ రోజు హీరో కృష్ణ ఫోన్‌ చేయడంతో బాలయ్య పద్మాలయా ఆఫీసుకు వెళ్లారు. అక్కడినుంచి ఆయన్ని వాహినీ స్టూడియోకు తీసుకెళ్లారు కృష్ణ. ఏమిటీ విషయం అని అడిగితే ‘ఈ రోజు మీరు ఎంటర్‌ కాకపోతే షూటింగే లేదు. రంగారావుగారు బెంగళూరులోనే ఉండిపోయారు. ఇప్పట్లో వచ్చే పరిస్థితులు కనబడడం లేదు. దీని వల్ల సినిమా లేట్‌ అవుతోంది. అగ్గిరాజు పాత్ర మీరు చేయాల్సిందే’ అన్నారు కృష్ణ. ఆయన అంతగా చెప్పడంతో కాదనలేకపోయారు బాలయ్య. 

బాలయ్య అగ్గిరాజు పాత్ర చేస్తున్నారని కృష్ణ సెట్‌కు వచ్చి చెప్పగానే యూనిట్‌ సభ్యుల్లో కలకలం మొదలైంది. దర్శకుడు రామచంద్రరావు, రచయిత మహారథి తదితరులు కృష్ణ తీసుకున్న నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకించారు. ‘రంగారావు వేయాల్సిన వేషాన్ని బాలయ్యతో వేయిస్తావా’ అని గొడవ పెట్టారు. ‘నేను మొదట బాలయ్యనే అనుకున్నా. ఆయన కాదంటేనే రంగారావుని అనుకున్నాను..’ అని కృష్ణ ఎంత చెప్పినా వాళ్లు వినిపించుకోలేదు. అగ్గిరాజు పాత్రకు బాలయ్యను తీసుకోవద్దని ఓ కాగితం మీద రాసి, యూనిట్‌ సభ్యులందరూ సంతకాలు చేసి హీరో కృష్ణ చేతికి ఇచ్చారు. ఆయన దాన్ని చదివి,  ఆ పేపర్‌ను చించి ముక్కలు చేసి, ‘నా డెసిషన్‌ కరెక్ట్‌. ఇందులో మార్పు లేదు’ అని చెప్పారు. కృష్ణ ఒక నిర్ణయం తీసుకుంటే దానికి తిరుగు ఉండదు. అయినా విజయాధినేతల్లో ఒకరైన చక్రపాణి చెబితే మాత్రం ఆయన మాట కృష్ణ కాదనరని, కొందరు వెళ్లి చక్రపాణికి ఈ విషయం చెప్పారు. ఆయన సెట్‌కు వస్తానని చెప్పారు. మేకప్‌ వేసుకుని అగ్గిరాజు గెటప్‌లో బాలయ్య సెట్‌లోకి అడుగుపెట్టే లోపల జరిగిన కథ ఇది. చక్రపాణి షూటింగ్‌ స్పాట్‌ వచ్చేసరికి బాలయ్య మీద షాట్‌ చిత్రీకరిస్తున్నారు. అది చూసి చక్రపాణి ఆగిపోయి, ‘బాలయ్య షాట్‌లో ఉన్నాడు కదా.. ఓ పని చేద్దాం. అతని మీద తీసిన సన్నివేశాలను రాత్రి ప్రాసెస్‌ చేసి నాకు చూపించండి. అప్పుడు డిసైడ్‌ చేద్దాం’ అన్నారు. చక్రపాణి ఆ మర్నాడు రషెస్‌ చూసి ‘బాలయ్య బాగున్నాడు కదా’ అనడంతో ఇక ఎవరూ మాట్లాడలేకపోయారు. 

– వినాయకరావు 


Updated Date - 2022-04-09T23:56:00+05:30 IST