శాండల్‌వుడ్ స్టార్ హీరో కిచ్చా సుదీప్ (Kiccha Sudeep )కు తన అభిమాన క్రికెటర్ నుంచి సర్‌ప్రైజింగ్ గిఫ్ట్ అందింది. దాంతో ఆయన పట్టరాని ఆనందంతో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కిచ్చా సుదీప్ నటించిన తాజా చిత్రం 'విక్రాంత్ రోణ' (Vikrant Rona). ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తు బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు అనూప్ భండారి (Anup Bhandari) దర్శకత్వం వహించారు.
ఈ సినిమాను జీ స్టూడియోస్, కిచ్చా క్రియేషన్స్ సమర్పణలో షాలిని ఆర్ట్స్ పతాకంపై నిర్మాతలు షాలిని, జాక్ మంజునాథ్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రం జూలై 28వ తేదీన విడుదల చేయనున్నారు. సందీప్ కిషన్ (Sandeep Kishan)తో పాటు నీతా అశోక్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ (Jacqueline Fernandez), నిరూప్ బండారి కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని భారీ అంచనాలను పెంచేసింది. అయితే, భారత మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్ (Kapil Dev)కి కిచ్చా సుదీప్ వీరాభిమాని. ఈ నేపథ్యంలో ఈ స్టార్ యాక్టర్‌కి తాజాగా కపిల్ దేవ్ 1983 వరల్డ్ కప్‌లో ఉపయోగించిన క్లాసిక్ బ్యాట్‌ను బహుమతిగా అందజేశారు.
ఈ విషయాన్ని సుదీప్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా.. 'వాహ్…వాట్ ఎ సండే.. థాంక్ యూ కపిల్ దేవ్ సర్'.. అని ఆశ్చర్యానికి లోనయ్యారు. 'ఇది ఊహించలేదు. ఇది క్లాసిక్ పీస్'.. అంటూ ఫోటోలను షేర్ చేశారు. అంతేకాదు, 'ఆనందంతో మబ్బుల్లో తేలిపోతున్నట్టుగా భావిస్తున్నాను, థాంక్యూ, థాంక్యూ'.. అంటూ ఎంతో ఎగ్జైట్ అవుతూ తన సంతోషం వ్యక్తం చేశారు సుదీప్. ఇక కపిల్ దేవ్ ఇచ్చిన ఈ బ్యాట్‌పై 1983 వరల్డ్ కప్‌లో ఆడిన అందరి ఆటగాళ్ల సంతకాలు ఉండటం విశేషం. కాగా, '83' కన్నడ వెర్షన్ సినిమాను సుదీప్ కర్ణాటకలో విడుదల చేసిన సంగతి తెలిసిందే.