Suriya's Jai Bhim: మరోసారి చిక్కుల్లో ‘జై భీమ్’.. నా జీవితాన్ని తీసుకుని..

ABN , First Publish Date - 2022-08-26T16:24:10+05:30 IST

తమిళంతోపాటు తెలుగులోనూ మంచి పాపులారిటీ, ఫ్యాన్ బేస్ ఉన్న కోలీవుడ్ నటుడు సూర్య(Suriya). ఆయన సినిమాలు తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి విడుదల అవుతూ..

Suriya's Jai Bhim: మరోసారి చిక్కుల్లో ‘జై భీమ్’.. నా జీవితాన్ని తీసుకుని..

తమిళంతోపాటు తెలుగులోనూ మంచి పాపులారిటీ, ఫ్యాన్ బేస్ ఉన్న కోలీవుడ్ నటుడు సూర్య(Suriya). ఆయన సినిమాలు తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి విడుదల అవుతూ మంచి కలెక్షన్లని కొల్లగొడుతుంటాయి. ఎంత స్టార్ అయినప్పటికీ నచ్చితే ఎలాంటి పాత్రనైనా చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఆ కోవలోకి చెందినదే ఆయన తాజాగా నటించిన ‘జై భీమ్(Jai Bhim)’. అన్యాయంగా కేసులో ఇరుక్కున్న పేద కుటుంబం తరుఫున పోరాడే నిజాయతీ గల లాయర్‌గా ఈ చిత్రంలో నటించారు. ఈ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై ప్రేక్షకాదరణ పొందడమే కాకుండా.. ఎంతోమంది విమర్శకులు ప్రశంసలు సైతం పొందింది.


అయితే.. ఈ మూవీ విడుదల తర్వాత నుంచి ఏదో ఒక విషయంలో వివాదంలో ఇరుక్కుంటూనే ఉంది. తాజాగా సైతం ఈ మూవీపై చెన్నైలో కాపీ రైట్ కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. మేకర్స్ తన జీవిత పోరాటాన్ని చిత్రీకరించారని, తనకు రాయల్టీ చెల్లించలేదని ఆరోపిస్తూ వి కులంజియప్పన్ అనే వ్యక్తి.. డైరెక్టర్, ప్రొడ్యూసర్‌పై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. 


నివేదిక ప్రకారం, ఈ చిత్రంలో ఒక పాత్ర ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కిందని కులంజియప్పన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. చిత్ర నిర్మాతలు కథను వినిపించారని, అయితే ఎలాంటి రాయల్టీ చెల్లించలేదని కులంజియప్పన్  ఆరోపించారు. జనవరి 2019లో దర్శకుడు టీజే జ్ఞానవేల్ (TJ Gnanavel) ఆయన్ని కలిశారని, 1993లో జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలను అడిగారని ఫిర్యాదుదారు తెలిపారు. దీనికి రాయల్టీగా రూ.50 లక్షలు, లాభాల్లో వాటా ఇస్తామని హామీ ఇచ్చారని కులంజియప్పన్ పేర్కొన్నారు. అయితే.. అందులో ఏ ఒక్కటీ ఇప్పటివరకు నెరవేర్చలేదని ఆయన తెలిపారు. కులంజియప్పన్ కూడా ఈ చిత్రం తన సమాజాన్ని చెడుగా చూపించారని ఆరోపించారు. అనంతరం.. మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాల మేరకు చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. చిత్ర దర్శకుడు టి జె జ్ఞానవేల్,  నిర్మాణ సంస్థ 2డి ఎంటర్‌టైన్‌మెంట్‌పై కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 63 (ఎ) కింద ఎఫ్‌ఐఆర్ నమోదైనట్లు తెలుస్తోంది.



‘జై భీమ్’ సినిమా వివాదాల్లోకి వెళ్లడం ఇదే మొదటిసారి కాదు. సినిమాలో తమ కమ్యూనిటీని కించపరిచారని ఆరోపిస్తూ.. దర్శకుడు టీజే జ్ఞానవేల్,  నటుడు సూర్యకు వన్నియార్ సంగం సంఘం లీగల్ నోటీసు జారీ చేసింది. దాంతో ట్విట్టర్ వేదికగా డైరెక్టర్ జ్ఞానవేల్ ఆ కమ్యూనిటీకి క్షమాపణలు కూడా తెలిపారు.

Updated Date - 2022-08-26T16:24:10+05:30 IST