Suriya: విజయవంతంగా పాతికేళ్ల కెరీర్.. అందమైన ప్రయాణమంటూ..

ABN , First Publish Date - 2022-09-06T18:43:10+05:30 IST

కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ మంచి పాపులారిటీ ఉన్న నటుడు సూర్య (Suriya). ఈయన అసలు పేరు శరవణన్ శివకుమార్.

Suriya: విజయవంతంగా పాతికేళ్ల కెరీర్.. అందమైన ప్రయాణమంటూ..

కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ మంచి పాపులారిటీ ఉన్న నటుడు సూర్య (Suriya). ఈయన అసలు పేరు శరవణన్ శివకుమార్. 1997లో ‘నెరుక్కు నెర్’ సినిమాతో కోలీవుడ్‌(Kollywood)లో అడుగుపెట్టాడు. ఇప్పటివరకూ దాదాపు 50 వరకూ చిత్రాల్లో నటించి స్టార్‌గా ఎదిగాడు. అంతేకాకుండా.. భారతీయ చలనచిత్ర రంగంలో అత్యుత్తమ నటులలో ఒకరిగా ప్రశంసలు పొందాడు. అయితే.. ఈ ఏడాదితో సూర్య సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి 25 సంవత్సరాలు పూర్తైయ్యాయి. దీంతో.. ఆయన జీవితానికి స్మరించుకుంటూ సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని తెలిపాడు.


సూర్య చేసిన ట్వీట్‌లో.. ‘మీ ఆశీర్వాదంతో అందమైన 25 సంవత్సరాలు పూర్తైయ్యాయి. కల, నమ్మకంతోనే ఇది సాధ్యమైంది. మీ సూర్య’ అని రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంతోమంది సూర్య అభిమానులు ఆయనకి కంగ్రాట్స్ చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. సూర్య ఈ ట్వీట్ చేసిన కొన్ని గంటల్లో వేల లైకులను సొంతం చేసుకుంది.


నిజానికి.. తండ్రి శివకుమార్ పరిశ్రమకి చెందిన వ్యక్తే అయినప్పటికీ.. తమిళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టడానికి చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. ఈ 25 సంవత్సరాల్లో ఆయన 50 చిత్రాల్లో నటించారు. ప్రతి సినిమాకు నటుడిగా తన ప్రతిభని, నైపుణ్యాన్ని పెంచుకుంటూ స్టార్‌గా ఎదిగాడు. లవర్ బాయ్, ఆర్మీ ఆఫీసర్ లేదా మాస్ హీరో.. పాత్ర ఏదైనప్పటికీ సూర్య జీవించేస్తాడనే పేరు సంపాదించుకున్నాడు. దానికి ఆయన సినిమాలే నిదర్శనం.


కాగా.. రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు, నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్, మూడు తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులతోపాటు మరెన్నో ఇతర అవార్డులను సూర్య అందుకున్నాడు. ఆయన ‘సూరారై పోట్రు’ (ఆకాశమే నీ హద్దురా), ‘జై భీమ్’ ఆస్కార్స్‌ని నామినేషన్స్ వరకూ వెళ్లాయి కానీ.. సెలెక్టు కాలేదు. ఆస్కార్ కమిటీ ఆహ్వానం పొందిన మొట్ట మొదటి దక్షిణ భారత సినీ నడుడు సూర్యనే కావడం విశేషం. కాగా.. సూర్య ప్రస్తుతం దర్శకుడు బాలతో ఓ సినిమాతోపాటు పలు చిత్రాల్లో నటిస్తూ కెరీర్‌లో బిజీగా ఉన్నాడు.



Updated Date - 2022-09-06T18:43:10+05:30 IST