Ameesha Patel: అమీషా పటేల్‌పై 2.5 కోట్ల చీటింగ్ కేసు.. నటి సుప్రీంకోర్టుకి వెళితే..

ABN , First Publish Date - 2022-08-31T18:19:20+05:30 IST

పవన్ కల్యాణ్, మహేశ్ బాబు వంటి టాలీవుడ్ స్టార్ల పక్కన చేసిన ‘బద్రి’, ‘నాని’ వంటి సినిమాలతో తెలుగుతోపాటు ఇతర దక్షిణాది భాషల్లో గుర్తింపు పొందిన నటి అమీషా పటేల్ (Ameesha Patel)...

Ameesha Patel: అమీషా పటేల్‌పై 2.5 కోట్ల చీటింగ్ కేసు.. నటి సుప్రీంకోర్టుకి వెళితే..

పవన్ కల్యాణ్, మహేశ్ బాబు వంటి టాలీవుడ్ స్టార్ల పక్కన చేసిన ‘బద్రి’, ‘నాని’ వంటి సినిమాలతో తెలుగుతోపాటు ఇతర దక్షిణాది భాషల్లో గుర్తింపు పొందిన నటి అమీషా పటేల్ (Ameesha Patel). అదే సమయంలో వరుసగా హిందీ సినిమాలు చేసి అక్కడ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తాజాగా ఈ బ్యూటీపై జార్ఖండ్‌లో ఓ చీటింగ్ కేసు (Cheating Case) నమోదైంది. 


అజయ్ కుమార్ సింగ్ అనే నిర్మాత అమీషాపై ఈ కేసును ఫైల్ చేశాడు. ‘దేశీ మ్యాజిక్’ అనే సినిమా చేయడానికి ఆమీషా బ్యాంకు ఖాతాకి రూ.2.5 కోట్లు ట్రాన్స్‌ఫర్ చేశానని.. అయినా ఆమె సినిమాలో నిర్మాణంలో భాగం కాలేదు.. అలాగే డబ్బును తిరిగి ఇవ్వలేదని ఆ ఫిర్యాదులో నిర్మాత పేర్కొన్నాడు. ఈ కేసును విచారించిన జార్ఖండ్ ట్రయల్ కోర్టు అమీషాపై మోసం, నమ్మక ద్రోహం సెక్షన్ల కింద సమన్లు ​​జారీ చేసింది.


అనంతరం ఈ సమన్లను సవాలు చేస్తూ అమీషా సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్ వేసింది. దీంతో కేసును విచారించిన కోర్టు విచారణపై స్టే ఇచ్చింది. అంతేకాకుండా.. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో ఉన్న ధర్మాసనం జార్ఖండ్ ప్రభుత్వానికి సైతం నోటీసులు పంపింది. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టంలోని సెక్షన్ 138 (చెక్ బౌన్స్) కింద శిక్షార్హమైన నేరాలకు సంబంధించిన ప్రొసీడింగ్‌లను చట్టానికి అనుగుణంగానే కొనసాగించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. భారత శిక్షాస్మృతి 1860లోని శిక్షార్హమైన నేరం u/s 406 (క్రిమినల్ ఉల్లంఘన), 420 (మోసం)లో మాత్రమే నోటీసులు జారీ చేయమని తెలిపింది. ఐపీసీ 406, 420 సెక్షన్‌ల కింద కొనసాగుతున్న విచారణ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. నిజానికి.. అమీషా మొదట ట్రయల్ కోర్టులో జరుగుతున్న విచారణను రద్దు చేయాలని పిటిషన్ వేయగా 2022 మే 5న విచారించిన జార్ఖండ్ హైకోర్టు తిరస్కరించింది. అనంతరం అమీషా పటేల్ సుప్రీంకోర్టుకి వెళ్లింది.

Updated Date - 2022-08-31T18:19:20+05:30 IST