ఆ పాత్రలు చేయమని నన్నెవరూ అడగలేదు

ABN , First Publish Date - 2022-08-21T06:57:19+05:30 IST

అందానికి అభినయం తోడైతే... అదే అనుపమా పరమేశ్వరన్‌. హీరోను ఆరాధించే హీరోయిన్‌ పాత్రలకు దూరంగా... కథే కథానాయకుడై నడిపించే చిత్రాలకు చుక్కానిగా...

ఆ పాత్రలు చేయమని నన్నెవరూ అడగలేదు

అందానికి అభినయం తోడైతే... 

అదే నుపమా పరమేశ్వరన్‌. 

హీరోను ఆరాధించే హీరోయిన్‌ పాత్రలకు దూరంగా...

కథే కథానాయకుడై నడిపించే చిత్రాలకు చుక్కానిగా... 

సాగుతోంది ఆమె ప్రయాణం. 

‘కార్తికేయ-2’ విజయాన్ని ఆస్వాదిస్తున్న 

అనుపమ ‘నవ్య’ ముంగిట తన అంతరంగాన్ని ఆవిష్కరించారు.


సండే సెలబ్రిటీ

మలయాళ ప్రేక్షకుడు జీవితంలోని వాస్తవికతను ఇష్టపడతాడు. తెలుగు ప్రేక్షకులు యదార్థతను ఇష్టపడుతూనే అద్భుత కల్పన కోరుకొంటారు. ఆ రెండింటి కలయిక తెలుగు చిత్ర పరిశ్రమ.  


‘కార్తికేయ-2’ విజయాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు? 

ఈ సక్సెస్‌ను బాగా ఎంజాయ్‌ చేస్తున్నాను. ఇప్పుడు షూటింగ్స్‌ కూడా లేకపోవడంతో సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను.  


కొవిడ్‌ పరిణామాలు ఒక వ్యక్తిగా మీపై ఎలాంటి ప్రభావం చూపాయి? 

కొవిడ్‌తో మంచి కూడా జరిగింది. సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉండి, ఆరోగ్యంపై శ్రద్ధ తగ్గింది. మొదటి లాక్‌డౌన్‌లో నా గురించి నేను పట్టించుకొనే అవకాశం లభించింది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాను. వ్యక్తిగానూ నాలో చాలా సానుకూల మార్పులు వచ్చాయి. సినిమాలకు సంబంధించి ఎలాంటి కంటెంట్‌ వస్తోంది, ప్రేక్షకులు ఎలాంటి వాటిని ఇష్టపడుతున్నారనేది అర్థమైంది. చాలామంది రచయితలు మంచి కథలతో నన్ను సంప్రతించారు. 


మీ మాతృ పరిశ్రమ కంటెంట్‌ విషయంలో బలంగా ఉంది. ఒక మలయాళ నటిగా దీన్ని ఎలా విశ్లేషిస్తారు? 

మొదటి నుంచి మలయాళ చిత్ర పరిశ్రమ కొన్ని పరిమితులకు లోబడి పనిచేస్తోంది. భారీతనానికి పోకుండా, పరిమిత బడ్జెట్‌లోనే సినిమాలు నిర్మించింది. చిన్న సంఘటనల స్ఫూర్తితో రూపొందిన అద్భుతమైన కథలు ఎన్నో  మలయాళంలో చిత్రాలుగా వచ్చాయి. ఉదాహరణకు ‘మహేషింటె ప్రతీకారమ్‌’ చూడండి... ఇద్దరి మధ్య జరిగిన చిన్న గొడవ, ప్రతీకారం ఆ కథకు మూలం. తెలుగు పరిశ్రమ ఆ దశను దాటింది. ఇక్కడ సినిమాలో వైవిధ్యం, బడ్జెట్లు ఎక్కువ. భారీ స్థాయిలో తీస్తారు. అయితే ఇప్పుడు ఓటీటీ వచ్చాక సినిమాలను రీమేక్‌ చేయవలసిన అవసరం లేకుండా ప్రేక్షకులు అన్ని భాషల సినిమాల డబ్బింగ్‌ వెర్షన్లు చూస్తున్నారు. 


‘గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌’ లాంటి చిత్రాన్ని తెలుగు పరిశ్రమ నుంచి ఆశించలేం కదా? 

నిజమే... మలయాళ ప్రేక్షకుడు జీవితంలోని వాస్తవికతను ఇష్టపడతాడు. తెలుగు ప్రేక్షకులు యదార్థతను ఇష్టపడుతూనే అద్భుత కల్పన కోరుకొంటారు. ఆ రెండింటి కలయిక తెలుగు చిత్ర పరిశ్రమ. ‘కేరాఫ్‌ కంచరపాలెం’ నాకు బాగా నచ్చిన చిత్రం. అలాగే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లాంటి భారీ చిత్రాలూ ఇక్కడ నుంచి వచ్చాయి. 


ఓటీటీ లాంటి కొత్త వేదిక రాక నటీనటులపై ఎలాంటి ప్రభావం చూపింది?

ఓటీటీ... అవకాశాలకూ, కొత్త కంటెంట్‌కు ద్వారాలు తె రిచింది. మహిళా ప్రాధాన్య చిత్రాలకు థియేటర్‌ మార్కెట్‌ తక్కువ. అందుకే నిర్మాతలు పెద్దగా ఆసక్తి చూపరు. ఓటీటీలో అలాంటి సినిమాలకు మంచి గిరాకీ ఉంది. అక్కడ కథే ప్రధానం. ఇంట్లో కూర్చొని కుటుంబంతో కలిసి చూడడానికి ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. గ్రాండియర్‌ సినిమాలను ప్రేక్షకులు థియేటర్లలోనే చూస్తారు. వైవిధ్యభరితమైన సినిమాలు చేయాలనుకునే నటీనటులకు ఓటీటీ అవకాశాలు ఇస్తోంది. 


మీ చిన్ననాటి సంగతులు చెప్పండి? 

కేరళలోని త్రిసూర్‌ మా స్వస్థలం. మాది మధ్యతరగతి కుటుంబం. తోటి పిల్లలతో బాల్యం సరదాగా గడిచింది. నన్ను అమాయకురాలు అనేవారు కానీ... నాలో కొంచెం చిలిపిదనం కూడా ఉండేది. 



సినిమా జీవితంలో ఒత్తిళ్లను ఎలా అధిగమిస్తున్నారు? 

కెరీర్‌ ఆరంభంలోనే మంచి సినిమాలు పడడంతో ప్రేక్షకులు నన్ను గుర్తించారు. పెద్దగా శ్రమించాల్సిన అవసరం రాలేదు. ఎంతో ప్రతిభ ఉండి కూడా కొంతమందికి అవకాశాలు రాలేదు. ‘ప్రేమమ్‌’, ‘శతమానం భవతి’ లాంటి మంచి సినిమాలు దక్కడం నా అదృష్టం. నా కష్టం, ప్రేక్షకుల అభిమానం నన్ను ఈ స్థాయిలో నిలిపాయి. 


గ్లామర్‌ పరిధిని దాటి సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యం పెరుగుతూ వస్తోందంటారా? 

ఇప్పటిదాకా మంచి కథలు, బలమైన పాత్రలు ఉన్న స్ర్కిప్టులే నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. గ్లామర్‌ ఒలికించడానికి ఒక హీరోయిన్‌గా ఉండాలని గానీ, హీరోను ఆరాధించే హీరోయిన్‌ పాత్రల కోసంగానీ... ఇప్పటిదాకా నన్ను ఎవరూ అలాంటి రోల్స్‌ కోసం సంప్రతించలేదు. అసలు గ్లామర్‌ అంటే ఏమిటి? నేను ఇప్పుడు గ్లామర్‌గా లేనా? కొంతమంది ఆలోచనా తీరు అది. ఇప్పుడు మహిళల పాత్ర చిత్రణలోనూ రచయితలు సృజనాత్మకంగా ఉంటున్నారు. 


ఒత్తిడిని ఎలా అధిగమిస్తారు? 

ఒత్తిడికి లోనైనప్పుడు నా కుటుంబంతో గడుపుతాను. జయాపజయాలు రెంటిలోనూ నా కుటుంబం వెన్నంటి నిలిచింది. నిరాశలో ఉన్నప్పుడు ఇంట్లో వాళ్లు నా శక్తిని గుర్తు చేసి ప్రోత్సహిస్తారు. 



దేవుడిని విశ్వసిస్తారా?  

నేను ఆధ్యాత్మికవాదిని కాదు. కానీ నా అంతరంగాన్ని అనుసరిస్తాను. మొండిగా ఉండను. ఎవరేం చెప్పినా వింటాను. ప్రతి ఒక్కరి నమ్మకాలనూ గౌరవిస్తాను. నాకు నచ్చినదాన్ని, నమ్మినదాన్ని అనుసరిస్తాను. 


పని- జీవితం... రెండింటినీ ఎలా సమన్వయం చేసుకొంటారు?  

నాకు పనితప్ప మరో ధ్యాస ఉండదు. పనిని ఆస్వాదిస్తాను. కొవిడ్‌లో ఖాళీగా ఉన్నప్పుడు పని గొప్పదనం మరింత అర్థమైంది. 


చిత్రపరిశ్రమలో స్నేహితులు ఉన్నారా? 

కొద్దిమంది ఉన్నారు... కానీ పేర్లు చెప్పలేను.  




సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌

Updated Date - 2022-08-21T06:57:19+05:30 IST