సినిమా రివ్యూ : ‘స్టాండప్ రాహుల్’

ABN , First Publish Date - 2022-03-18T20:31:17+05:30 IST

ఒకప్పుడు మినిమమ్ గ్యారెంటీ హీరో అనిపించుకున్న రాజ్ తరుణ్ కు, కొంతకాలంగా సక్సెస్ అందని ద్రాక్షే అవుతోంది. చివరిగా అతడు సక్సెస్ అందుకున్న చిత్రం ‘ఈడో రకం ఆడోరకం’. ఆ తర్వాత మళ్ళీ అతడికి విజయం అనేదే దక్కలేదు. ఈ క్రమంలో అతడు పలు ప్రయోగాలు చేశాడు. కానీ హిట్ మాత్రం పడడంలేదు. ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్ సరికొత్త మేకోవర్ తో ‘స్టాండప్ రాహుల్’ గా ఈ రోజే (శుక్రవారం) థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మరి ఈ సినిమా అయినా రాజ్ తరుణ్ ను గట్టెక్కిస్తుందా? ప్రేక్షకులకు చిత్రం ఏ మేరకు మెప్పిస్తుంది? అనే విషయాలు రివ్యూలో చూద్దాం.

సినిమా రివ్యూ : ‘స్టాండప్ రాహుల్’

చిత్రం : స్టాండప్ రాహుల్

విడుదల తేదీ : మార్చ్ 18, 2022

నటీనటులు : రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ, మురళీ శర్మ, ఇంద్రజ, వెన్నెల కిషోర్, సునయన, మధురిమ, దేవీ ప్రసాద్, రాజ్‌కుమార్ కశిరెడ్డి,  తేజోయ్ భట్టార్, అనీష్ అల్లారెడ్డి, వెంకటేశ్ మహా తదితరులు.

సినిమాటోగ్రఫీ : శ్రీరాజ్ రవీంద్రన్

సంగీతం : స్వీకర్ అగస్తి 

నిర్మాతలు : నందకుమార్, భరత్ 

దర్శకత్వం : శాంటో 

ఒకప్పుడు మినిమమ్ గ్యారెంటీ హీరో అనిపించుకున్న రాజ్ తరుణ్ కు, కొంతకాలంగా సక్సెస్ అందని ద్రాక్షే అవుతోంది. చివరిగా అతడు సక్సెస్ అందుకున్న చిత్రం ‘ఈడో రకం ఆడోరకం’.  ఆ తర్వాత మళ్ళీ అతడికి విజయం అనేదే దక్కలేదు. ఈ క్రమంలో అతడు పలు ప్రయోగాలు చేశాడు. కానీ హిట్ మాత్రం పడడంలేదు. ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్ సరికొత్త మేకోవర్ తో ‘స్టాండప్ రాహుల్’ గా ఈ రోజే (శుక్రవారం) థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మరి ఈ సినిమా అయినా రాజ్ తరుణ్ ను గట్టెక్కిస్తుందా? ప్రేక్షకులకు చిత్రం ఏ మేరకు మెప్పిస్తుంది? అనే విషయాలు రివ్యూలో చూద్దాం.


కథ

రాహుల్ (రాజ్ తరుణ్ ) ను నానమ్మ, మేనత్త ఎందుకూ పనికిరానివాడిగా ట్రీట్ చేస్తుంటారు. తల్లి (ఇంద్రజ) ఎయిర్ హోస్టెస్ గా ఉద్యోగం చేస్తూ.. కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ కొడుకు మంచి ఉద్యోగంతో లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకుంటుంది. భర్త (మురళీ శర్మ) సినిమా నేషనల్ అవార్డ్ వచ్చే సినిమా తీసిన దర్శకుడు.  సొంతంగా డబ్బులు పెట్టి చేతులు కాల్చుకోవడంతో .. భార్యతో గొడవలు వచ్చి... ఆమె నుంచి వేరుగా ఉంటాడు. తన కొడుకు తన భర్తలా కాకూడదని భావించిన రాహుల్ తల్లి.. అతడితో ప్రామిస్ చేయించుకొని ఉద్యోగానికి హైదరాబాద్ పంపుతుంది. తల్లి మాటను కాదనలేక స్టాండప్ కమెడియన్ గా స్థిరపడాలనుకొనే అతడు విఆర్ డెవలపింగ్ సాఫ్ట్ వేర్ కంపెనీలో జాయిన్ అవుతాడు. అక్కడ చిన్నప్పటి క్లాస్ మేట్ శ్రీయా పరిచయం అవుతుంది. పాతగొడవల్ని మరిచిపోయి ఫ్రెండ్స్ అవుతారు. తల్లిదండ్రుల ప్రభావం వల్ల రాహుల్ కు పెళ్ళి మీద నమ్మకం ఉండదు. అతడి ప్రేమను గెలుచుకోవడం కోసం ఇష్టం లేకపోయినా అతడితో లివిన్ రిలేషన్ షిప్ కు సిద్ధమవుతుంది శ్రీయా. అయితే వారి సహజీవనం ప్రేమకు దారితీసిందా? రాహుల్ తనమీద పడ్డ ముద్రను చెరిపేసుకోగలిగాడా? అతడి ప్రేమను గెలిపించడానికి తల్లి దండ్రులు ఏం చేశారు? అన్నదే మిగతా కథ.


విశ్లేషణ 

ఈ తరం ప్రేక్షకుల్ని ఆకట్టుకొనే ప్రయత్నంలో లివిన్ రిలేషన్ షిప్స్ చుట్టూ కథలు అల్లుతూ సినిమాలు తీస్తున్నారు కొత్త దర్శకులు. అయితే అలాంటి కాన్సెప్ట్స్ తో కథలల్లే ప్రయత్నంలో చాలా సినిమాలు మిస్ ఫైర్ అవుతున్నాయి. ‘స్టాండప్ రాహుల్’ చిత్రం కూడా ఆ కోవకు చెందిందే. స్టాండప్ కామెడీ చుట్టూ ఇలాంటి కథను ఇరికించే ప్రయత్నం చేయడం వల్ల కథాకథనాలు బోరింగ్ గా అనిపిస్తాయి. కథానాయికతో సహా చిత్రం నిండా పలువురు మంచి పెర్ఫార్మర్స్ ఉన్నారు. అలాంటి వారిని పెట్టుకొని కూడా వారిని సరిగా ఉపయోగించుకో లేకపోవడం దర్శకుడి ఫాల్డ్ గానే పరిగణించాలి. స్టాండప్ కామెడీ కాన్సెప్ట్ కాబట్టి.. సినిమాను ఔట్ అండ్ ఔట్ కామెడీ కథాంశంగా తీర్చిదిద్దుతారనుకుంటే అది కూడా జరగలేదు. విడిపోయిన తల్లి దండ్రుల వల్ల పెళ్ళి మీద నమ్మకం లేని రాహుల్ పాత్ర .. చివరి వరకూ కన్ఫ్యూజన్ లో ఉంటుంది. ఒక సారి హీరోయిన్ కు దూరంగా ఉంటాడు. మరోసారి హీరోయిన్ అంటే చెప్పలేని ప్రేమను కురిపిస్తాడు. ఇలాంటి కన్ఫ్యూజన్ ప్రేక్షకులకు కూడా కలుగుతుంది. దర్శకుడు కూడా కన్ఫ్యూజన్ తో ఈ కథను డీల్ చేశాడేమో అనిపిస్తుంది. సినిమాకున్న ప్రధాన లోపం అదే. సినిమాలో కొస్తంత రిలీఫ్ కలిగించేవి ‘స్టాండప్ కామెడీ’ షోస్ లో రాహుల్ పార్టిసిపేట్ చేసే సన్నివేశాలే. బాసెస్ మీద, ఇంటివోనర్స్ మీద, పెళ్ళి మీద వచ్చే స్టాండప్ కామెడీ సన్నివేశాలు వినోదాన్ని పంచుతాయి. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ రొటీన్ అనిపిస్తాయి.


రాహుల్ గా రాజ్ తరుణ్ మంచి ఈజీనెస్ కనబరిచాడు. చెలాకీ యువకుడిగా, కన్ఫ్యూజన్ మాస్టర్‌గా  మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. హీరోయిన్ వర్ష బొల్లమ్మ శ్రీయా పాత్రలో ఒదిగిపోయింది. ఎమోషన్స్ ను బాగా పలికించింది. రాహుల్ తల్లిగా ఇంద్రజ నటన చాలా హుందాగా సాగుతుంది. కొడుకు పట్ల బాధను, ప్రేమను వ్యక్తం చేసే సన్నివేశాల్లో ఆమె మార్కు కనిపిస్తుంది. ఇక తండ్రిగా మురళీ శర్మ పాత్ర చివరి వరకూ ఫెయిల్యూర్ భర్తగానే కనిపిస్తుంది. ఆ పాత్రలో ఆయన చేయడానికి ఏమీ లేకుండా పోయింది. అలాగే బాస్ గా వెన్నెల కిషోర్ కామెడీ అంతగా ఆకట్టుకోదు. స్టాండప్ కామెడీ క్లబ్ ఓనర్ గా యువ దర్శకుడు వెంకటేశ్ మహా కనిపిస్తాడు. మేనత్త పాత్రలో సునయన .. ఫ్రస్ర్టేటెడ్ విమన్ తరహాలోనే నటించింది. శ్రియా తండ్రిగా దేవీ ప్రసాద్ తనపాత్రకు న్యాయం చేశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. కెమేరా పనితనం మెప్పిస్తుంది. నందకుమార్ రాసిన డైలాగ్స్ పర్వాలేదనిపిస్తాయి. మొత్తం మీద ‘స్టాండప్ రాహుల్’ చిత్రం కాలక్షేపానికైతే ఒకసారి చూడొచ్చు.

ట్యాగ్ లైన్ : టైంపాస్ లవ్ స్టోరీ

Updated Date - 2022-03-18T20:31:17+05:30 IST