అలా చేసిన.. ఏ సినిమాని ప్రేక్షకులు వదులుకోరు: SS Rajamouli

ABN , First Publish Date - 2022-06-30T02:47:16+05:30 IST

యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘హ్యాపీ బర్త్‌డే’ (Happy Birthday). ఈ సినిమాకి సంబంధించి కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అందుకు కారణం ఈ సినిమాలో..

అలా చేసిన.. ఏ సినిమాని ప్రేక్షకులు వదులుకోరు: SS Rajamouli

యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘హ్యాపీ బర్త్‌డే’ (Happy Birthday). ఈ సినిమాకి సంబంధించి కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అందుకు కారణం ఈ సినిమాలో కనిపిస్తున్న సరికొత్త పాత్రలే కాకుండా.. విభిన్నంగా చేస్తున్న ప్రమోషన్ కూడా సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. ఈ చిత్రాన్ని ‘మత్తువదలరా ఫేమ్’ దర్శకుడు రితేష్ రానా (Ritesh Rana) తెరకెక్కిస్తున్నారు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జూలై 8న ఈ చిత్రం విడుదల కాబోతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి (SS Rajamouli) విడుదల చేశారు. 


ట్రైలర్ విడుదల అనంతరం రాజమౌళి మాట్లాడుతూ.. ‘‘మైత్రీ మూవీ మేకర్స్ అంటే మంచి ప్రాజెక్ట్స్ వెతికి పట్టుకుంటూ.. బంగారం తవ్వుకునే సంస్థ. ‘హ్యాపీ బర్త్‌డే’ చిత్రం కూడా ఆ సంస్థకు మరో పెద్ద విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను. ట్రైలర్ బ్లాక్‌బస్టర్‌గా ఉంది. చెర్రీకి సినిమా ప్రొడక్షన్ మీద చాలా అవగాహన ఉంది. ఆయన ఏ సంస్థకైనా అస్సెట్ లాంటి వారు. ఈ సినిమా చెర్రీకి మంచి సక్సెస్ ఇవ్వాలి. దర్శకుడు రితేష్ కు తన సినిమాల మీద నమ్మకం ఎక్కువ. ట్రైలర్‌లో పాన్ తెలుగు సినిమా అని చూడగానే అతనిలో నవ్వొచ్చింది. లావణ్య క్యారెక్టర్ బాగుంది. హీరోయన్స్‌కు కథను ముందుండి నడిపే ఇలాంటి పాత్రలు దొరకడం అరుదు. ఆమె బాగా నటించిందని అర్థమవుతుంది. ఇప్పుడున్న కమెడియన్స్‌లో నాకు వెన్నెల కిషోర్, సత్య అంటే ఇష్టం. వాళ్లు టీజర్, ట్రైలర్‌లో ఆకట్టుకునేలా ఉన్నారు. కామెడీ, థ్రిల్లర్ కలిపి చేయడం కష్టం. ఒకటి ఎక్కువైతే ఇంకొటి తగ్గిపోతుంది. రితేష్ వాటిని బాగా కంబైన్ చేసి ఉంటాడని తెలుస్తోంది. ఈ మధ్య ప్రేక్షకులు థియేటర్స్‌కు రావడం లేదు అంటున్నారు కానీ నా అభిప్రాయం ప్రకారం.. మనసు పెట్టి కష్టపడి చేసిన ఏ సినిమానూ ప్రేక్షకులు వదులుకోరు. అలా కష్టపడాలని సూచిస్తున్నా. ఈ చిత్రంలో ఆ ప్రయత్నం జరిగిందని ఆశిస్తున్నాను..’’ అని అన్నారు.



Updated Date - 2022-06-30T02:47:16+05:30 IST