Srinivasa Reddy : డబుల్ జాక్‌పాట్ కొట్టేశాడు !

ABN , First Publish Date - 2022-08-14T20:08:58+05:30 IST

ఎంత పెద్ద సీనియర్ నటుడు అయినా.. కెరీర్ కష్టా్ల్లో ఉన్నప్పుడు ఒక బ్లాక్ బస్టర్ హిట్టొచ్చి.. మళ్లీ అతడి ఇన్నింగ్స్ పుంజుకొనేలా చేస్తుంది. కొందరికి ఎన్ని హిట్స్ ఉన్నా సరైన స్థాయిలో అవకాశాలు దక్కవు. ఇండస్ట్రీలో ఇలాంటి విచిత్ర పరిస్థితులు తప్పవు.

Srinivasa Reddy : డబుల్ జాక్‌పాట్ కొట్టేశాడు !

ఎంత పెద్ద సీనియర్ నటుడు అయినా.. కెరీర్ కష్టాల్లో ఉన్నప్పుడు ఒక బ్లాక్ బస్టర్ హిట్టొచ్చి.. మళ్లీ అతడి ఇన్నింగ్స్ పుంజుకొనేలా చేస్తుంది. కొందరికి ఎన్ని హిట్స్ ఉన్నా సరైన స్థాయిలో అవకాశాలు దక్కవు. ఇండస్ట్రీలో ఇలాంటి విచిత్ర పరిస్థితులు తప్పవు. గతంలో కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత హీరోగా పలు చిత్రాల్లో నటించిన  కమెడియన్ శ్రీనివాసరెడ్డి (Srinivasa Reddy).. కొంతకాలంగా సరైన బ్రేక్ కోసం చూస్తున్నాడు. ఇదివరకటి స్థాయిలో అవకాశాలు, గుర్తింపు తగ్గిన అతడి దశ.. ఇప్పుడు రెండే రెండు చిత్రాలతో అనూహ్యంగా తిరిగిపోయింది. ఒకే నెల్లో రెండు చిత్రాలతో డబుల్ జాక్‌పాట్ కొట్టేశాడు. 


గతవారం విడుదలైన కళ్యాణ్ రామ్ (Kalyanram) ‘బింబిసార’ (Bimbisara) చిత్రంలో జపనీస్ స్టైల్లోని మీసాలతో అతడు చేసిన బుబేదా పాత్ర అద్భుతంగా పేలింది. సినిమా మొత్తం కనిపించకపోయినా, చక్రవర్తి ఫ్లాష్ బ్యాక్‌తో పాటు, క్లైమాక్స్‌లో అతడికిచ్చిన స్ర్కీన్ స్పేస్ అద్భుతంగా వర్కవుట్ అయింది. అతడి కామెడీ టైమింగ్‌కు మంచి మార్కులు పడ్డాయి. అందుకే ‘బింబిసార’ చిత్రం ప్రమోషన్స్‌లో కళ్యాణ్ రామ్‌తో పాటు శ్రీనివాసరెడ్డి కూడా యాక్టివ్‌గా పాల్గొన్నాడు. 


ఇక నిన్ననే (ఆగస్ట్ 13) విడుదలైన ‘కార్తికేయ 2’ (Karthikeya 2) లో నిఖిల్ మామయ్యగా, శ్రీకృష్ణ భక్తుడిగా శ్రీనివాసరెడ్డి కామెడీ అద్భుతంగా పేలింది. సినిమా ప్రారంభమైన అరగంట తర్వాత ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. నిఖిల్‌తో పాటు సినిమా మొత్తం కనిపిస్తాడు. తన కామెడీ టైమింగ్‌తో సినిమాను నిలబెట్టేశాడు. 2001లో ఎప్పుడో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీనివాసరెడ్డి.. స్పీడ్ ఈ మధ్య కాస్త తగ్గింది. ‘భళాతందనాన, టెంత్ క్లాస్ డైరీస్’ చిత్రాలు నిరాశపరచగా, ‘ఎఫ్ 3’ (F3) సినిమా విజయం సాధించింది. ఇప్పుడు ‘బింబిసార, కార్తికేయ’ చిత్రాలతో తిరిగి రేసులోకొచ్చాడు. ఈ రెండు సినిమాల వరుస సక్సెస్ లు శ్రీనివాసరెడ్డికి ఏ స్థాయిలో అవకాశాలు తెచ్చిపెడతాయో చూడాలి. 

Updated Date - 2022-08-14T20:08:58+05:30 IST