రెండు భాగాలుగా సత్యసాయి కథ

ABN , First Publish Date - 2022-10-08T05:30:00+05:30 IST

పుట్టపర్తి సత్యసాయిబాబా గొప్పతనం గురించి, ఆయన లీలల గురించి ఇప్పటి వారికే కాకుండా రాబోయే తరానికి కూడా తెలియజెప్పాలనే లక్ష్యంతో..

రెండు భాగాలుగా సత్యసాయి కథ

పుట్టపర్తి సత్యసాయిబాబా గొప్పతనం గురించి, ఆయన లీలల గురించి ఇప్పటి వారికే కాకుండా రాబోయే తరానికి కూడా తెలియజెప్పాలనే లక్ష్యంతో సాయివేదిక్‌ ఫిల్మ్స్‌ సంస్థ ‘శ్రీసత్యసాయి అవతారం’ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. సత్యసాయి కథను  రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సాయిప్రకాశ్‌. ఇది ఆయనకు నూరవ చిత్రం కావడం విశేషం. సత్యసాయి భక్తుడు డాక్టర్‌ దామోదర్‌ ఈ చిత్రానికి నిర్మాత. ఇటీవల ఈ చిత్రం షూటింగ్‌ మొదలైంది. ఈ సందర్భంగా దర్శకుడు సాయిప్రకాశ్‌ మాట్లాడుతూ ‘ బాబాగారికి 180 దేశాలలో భక్తులు ఉన్నారు. ఆయనతో సన్నిహితంగా గడిపే అదృష్టం నాకు దక్కింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం నాకు రావడం బాబా దయే. నవంబర్‌ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన దాదాపు నాలుగు వందల మంది నటీనటులు ఇందులో నటిస్తారు’ అని తెలిపారు. సహ నిర్మాత గోపీనాథరెడ్డి మాట్లాడుతూ ‘నిర్మాత దామోదర్‌ గారు అత్యవసర పని మీద దుబాయ్‌లో ఉండడం వల్ల ఈ కార్యక్రమానికి రాలేక పోయారు. సత్యసాయి జీవిత కథను సినిమా గా తీసే అవకాశం మాకే దక్కడం బాబాగారి అనుగ్రహం’ అన్నారు. పృథ్వి, అర్చన, అశోక్‌కుమార్‌, సుమన్‌, సాయికుమార్‌, బాబూమోహన్‌, శివపార్వతి, కోట శంకరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Updated Date - 2022-10-08T05:30:00+05:30 IST