Sreenath Bhasi: యాంకర్‌తో అసభ్య ప్రవర్తన.. నటుడి అరెస్ట్

ABN , First Publish Date - 2022-09-27T18:29:33+05:30 IST

మాలీవుడ్‌లో మంచి పాపులారిటీ ఉన్న నటుల్లో శ్రీనాథ్ భాసి (Sreenath Bhasi) ఒకరు. ఈయన నటించిన తాజా చిత్రం ‘చట్టంబి’...

Sreenath Bhasi: యాంకర్‌తో అసభ్య ప్రవర్తన.. నటుడి అరెస్ట్

మాలీవుడ్‌లో మంచి పాపులారిటీ ఉన్న నటుల్లో శ్రీనాథ్ భాసి (Sreenath Bhasi) ఒకరు. ఈయన నటించిన తాజా చిత్రం ‘చట్టంబి’. త్వరలో విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్‌ని చిత్రబృందం జోరుగా నిర్వహిస్తోంది. ఈ తరుణంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో యూట్యూబ్ ఛానెల్‌కు చెందిన మహిళా యాంకర్, కెమెరా సిబ్బందిని దుర్భాషలాడారనే అభియోగంపై ఈ నటుడు శ్రీనాథ్ భాసి సోమవారం (సెప్టెంబర్ 26) కొచ్చిలో అరెస్టు చేశారు. ఈ ఇంటర్వ్యూ సమయంలో కెమెరాలు స్విచ్ ఆఫ్ చేయమని చెప్పిన భాసి తనపై, కెమెరా సిబ్బందిపై అసభ్యకరంగా ప్రవర్తించాడని యాంకర్ (Anchor) ఫిర్యాదు మేరకు శుక్రవారమే (సెప్టెంబర్ 23న) కేసు నమోదైంది. అనంతరం పోలీసుల సమాచారం మేరకు.. తన లాయర్‌తో కలిసి స్టేషన్‌కు చేరుకున్న శ్రీనాథ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. 


విచారణ అనంతరం అతడిపై మరిన్ని కేసులు పెట్టాలా వద్దా అనే విషయంపై పోలీసులు నిర్ణయం తీసుకోనున్నారు. ఇంటర్వ్యూ జరిగిన హోటల్‌లోని సీసీటీవీ విజువల్స్, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఓ ఇంటర్వ్యూలో నటుడు రేడియో జాకీని దుర్భాషలాడిన మరో క్లిప్ ఇటీవల వైరల్‌ అయ్యింది. నటుడిపై ఐపీసీ సెక్షన్లు 354 A (లైంగిక వేధింపులు), 294 B (అసభ్యకరమైన పదాలు, ఏదైనా బహిరంగ ప్రదేశంలో లేదా సమీపంలో మాట్లాడటం), 509 (మహిళను కించపరిచే ఉద్దేశ్యంతో పదం, సంజ్ఞ లేదా చర్య) కింద అభియోగాలు మోపారు. అయితే విడుదలైన కొద్దిసేపటికే ఈ నటుడు  పోలీస్ స్టేషన్ నుంచి బెయిల్‌పై విడుదలయ్యాడు. కాగా.. ‘భీష్మపర్వం’, ‘కప్పేలా(Kappela)’, ‘ట్రాన్స్(Trance)’ వంటి చిత్రాలతో శ్రీనాథ్‌కి మంచి గుర్తింపు లభించింది.

Updated Date - 2022-09-27T18:29:33+05:30 IST