అభిమానుల గుండె చప్పుడు ఆగింది

ABN , First Publish Date - 2021-10-30T00:53:05+05:30 IST

కన్నడ కంఠీరవ రాజ్‌ కుమార్‌ వారసుడిగా అడుగుపెడితే... అంచనాలు ఎలా ఉంటాయో తెలియంది కాదు. రాజ్‌ కుమార్‌ అనే కిరీటం మోయడం.. అంత సామాన్యమైన విషయం కాదు. ఆ బరువు నెత్తిమీద వేసుకుని ప్రయాణం సాగించాడు పునీత్. మాస్టర్‌ లోహిత్‌గా ఐదేళ్ల వయసులోనే

అభిమానుల గుండె చప్పుడు ఆగింది

పునీత్ రాజ్‌కుమార్‌... అప్పు... లోహిత్.. ఎలా పిలిచినా పలికే మనసు తనది.

వయసు... 46...

ఐదేళ్ల వయసులోనే కెమెరా కళ్లకు అలవాటు పడ్డాడు.

పాతికేళ్లకు స్టారైపోయాడు. ఇరవై ఏళ్ల ప్రయాణంలో చేసింది ముఫ్ఫై సినిమాలే. అయితేనేంటి..? అందులో సగానికి పైగా సూపర్‌ హిట్లు.

కెమెరాముందుకొస్తే.... వంద కోట్ల వ్యాపారం.

బుల్లితెరపైనా.. తనొక ప్రభంజనం.

తన డైలాగులు వన్స్‌మోర్లకు ఆనవాళ్లు. తన సినిమాల

రికార్డు వసూళ్లకు సరికొత్త మైలురాళ్లు. పాట పాడితే పూనకాలు. కాలు కదిపితే థియేటర్లో జాతర మొదలు.

ఓ సూపర్‌ స్టార్‌ వారసుడిగా వచ్చి - పవర్‌ స్టార్‌గా మారి, కోట్లాదిమంది అభిమానుల్ని సంపాదించుకుని, ఇంకా ఎత్తుకి... ఇంకాస్త ఎత్తుకి ఎదుగుతాడనుకున్న దశలో...

ఆ గుండె చప్పుడు ఆగింది. కోట్లాది అభిమానుల్ని కన్నీటి సంద్రంలో ముంచుతూ.. ఆ ప్రాణం తుది వీడ్కోలు తీసుకుంది.


స్నేహం.. ప్రేమ పెళ్లి

1999లో అశ్విని రేవంత్‌ని పెళ్లి చేసుకున్నాడు పునీత్. ఇద్దరిదీ ప్రేమ వివాహమే. అంతకు ముందు ఓ స్నేహితుడి ద్వారా అశ్విని పరిచయం అయ్యింది. అది కాస్త స్నేహంగా, ఆ తరవాత ప్రేమగా మారింది. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పునీత్ నటించిన కొన్ని చిత్రాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేశారు అశ్విని. ‘‘ఓ స్నేహితురాల్ని పెళ్లి చేసుకోవడం నా జీవితంలో నేను తీసుకున్న మంచి నిర్ణయాల్లో ఒకటి. నా బెస్ట్‌ ఫ్రెండ్‌ ఎప్పటికీ తనే. తను సినిమాలు పెద్దగా చూడదు. కానీ నా కోసం అలవాటు చేసుకుంది. నా తొలి విమర్శకురాలు తనే. ఎలాంటి మొహమాటం లేకుండా నా సినిమాలపై తీర్పు ఇస్తుంది. తన అభిప్రాయాల్ని నేను గౌరవిస్తా’’ అని తమ అనుబంధం గురించి చాలా సార్లు చెప్పేవాడు పునీత్.


కంప్లీట్‌ ఫ్యామిలీమెన్‌గా పునీత్‌ని అభివర్ణిస్తుంటారు తన సన్నిహితులు. ఎందుకంటే కుటుంబానికి తానిచ్చే ప్రాధాన్యం అలాంటిది. ఇరవై ఏళ్ల కెరీర్‌లో తను చేసినవి 30 చిత్రాలే. కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించడానికి తన సినిమాల సంఖ్యని తగ్గించుకున్నారాయన. షూటింగ్‌ లేకపోతే... గుమ్మం కదలడానికి అస్సలు ఇష్టపడేవారు కాదట. పిల్లల్ని స్కూల్లో దించడం, స్కూలు అయిపోగానే వాళ్లని ఇంటికి తీసుకురావడం పునీత్‌కి చాలా ఇష్టమైన వ్యాపకాలు.


ఎన్టీఆర్‌‌తో స్నేహం

తెలుగు చిత్రసీమతో పునీత్‌కి సన్నిహిత సంబంధాలున్నాయి. తన చిత్రాలలో కొన్ని తెలుగులో అనువాద రూపంలో విడుదలయ్యాయి. తన తొలి చిత్రం ‘అప్పు’ కి పూరి జగన్నాథ్‌ దర్శకుడు. తెలుగులో అంతగా ఆడని ‘ఆంధ్రావాలా’ని కన్నడలో రీమేక్‌ చేసి హిట్టు కొట్టాడు పునీత్. ఆ చిత్రానికి మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహించారు. ‘వీర కన్నడిగ’ పునీత్ కెరీర్‌లో మర్చిపోలేని సినిమా. దానికి మన వీర శంకర్‌ దర్శకుడు. సీసీఎల్‌ మ్యాచుల వల్ల... తను మరింత తగ్గరైపోయాడు. బెంగళూరు తరపున అప్పు చాలాసార్లు బ్యాట్‌ ఝలిపించాడు. ఎన్టీఆర్‌ అంటే.. తనకు చాలా ఇష్టం. ఇద్దరూ మంచి స్నేహితులు. పునీత్ నటించిన ఓ చిత్రం కోసం ఎన్టీఆర్‌ ఓ పాట పాడారు. అది... కన్నడలో కొంతకాలం మార్మోగిపోయింది. తెలుగులో సూపర్‌ హిట్‌ అయిన ఒక్కడు, దూకుడు చిత్రాల్ని కన్నడలో రీమేక్‌ చేశాడు పునీత్. అవి అక్కడ కూడా బాగా ఆడాయి.


పునీత్ మంచి గాయకుడు కూడా. తన సినిమాలలో పాటలు పాడడం హాబీగా మార్చుకున్నాడు. అయితే ఆ పాటల ద్వారా అందుకున్న పారితోషికాన్ని రాజ్‌ కుమార్‌ ట్రస్టుకు విరాళంగా అందించేవాడు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరించేవాడు పునీత్. కరోనా సమయంలో చిత్రసీమకు తన వంతు సాయం అందించేవాడు. ఫిట్‌‌నెస్‌ పై విపరీతమైన శ్రద్ధ. రోజూ జిమ్‌ కి వెళ్లడం ఎట్టిపరిస్థితుల్లోనూ మానేవారు కాదు.  ఆరోగ్యం సహకరించకపోయినా.. కసరత్తులు చేయాల్సిందే. చివరికి జిమ్‌లోనే.. గుండె పోటుతో కుప్పకూలిపోయారు.


‘‘మనం చాలా చాలా ప్లాన్ చేస్తాం. ఎన్నో అనుకుంటాం. ఫలానాది తినాలి.. ఫలానా చోటకు వెళ్లాలి అని రకరకాలుగా ఊహిస్తాం. కానీ అవేమీ మన చేతుల్లో ఉండవు. విధి ఎలా నిర్ణయిస్తే... నుదుటపై ఏం రాస్తే.. అలా జరగాల్సిందే’’ పునీత్ తరచూ చెప్పేమాట ఇది.


చివరికి అదే నిజమైంది.

పునీత్ నుంచి ఇంకెన్నో అద్భుతమైన విజయాల్ని చూడాలనుకున్నారు అభిమానులు. ఎన్నో శిఖరాల్ని అధిరోహించాలని ఆశించారు. కానీ విధి ఆలోచన మరోలా ఉంది. అందుకే సగం జీవితం కూడా అనుభవించకుండానే లాక్కెళ్లిపోయింది.

ఆగింది ఒక్క గుండె మాత్రమే. కానీ వేల హృదయాలు ముక్కలయ్యాయి.

ఓ సూపర్‌ స్టార్‌ కథ.. విశ్రాంతి దగ్గరే ముగిసింది.


కన్నడ కంఠీరవ రాజ్‌ కుమార్‌ వారసుడిగా అడుగుపెడితే... అంచనాలు ఎలా ఉంటాయో తెలియంది కాదు. రాజ్‌ కుమార్‌ అనే కిరీటం మోయడం.. అంత సామాన్యమైన విషయం కాదు. ఆ బరువు నెత్తిమీద వేసుకుని ప్రయాణం సాగించాడు పునీత్. మాస్టర్‌ లోహిత్‌గా ఐదేళ్ల వయసులోనే నటించడం మొదలెట్టేశాడు. పట్టుమని పదేళ్లొచ్చేసరికి ఉత్తమబాల నటుడిగా ఏకంగా జాతీయ అవార్డునే పట్టేశాడు. కన్నడలో మాస్‌, కమర్షియల్‌ కథలకే పెద్ద పీట. పునీత్ కూడా వాటినే నమ్ముకున్నాడు. ఫక్తు వ్యాపార చిత్రాలతో కన్నడలో తిరుగులేని మార్కెట్‌ సొంతం చేసుకున్నాడు. కన్నడ చాలా చిన్న చిత్రసీమ. అక్కడ భారీ వసూళ్లు, బడ్జెట్లూ ఉండవు. ఓ సినిమా రూ.20 కోట్లు వసూలు చేయడం అప్పట్లో గొప్ప. కానీ పునీత్ రాజ్‌ కుమార్‌ అడుగుపెట్టాక అక్కడి లెక్కలు మారిపోయాయి. బాక్సాఫీసు కొత్త అంకెల్ని కళ్లారా చూడగలిగింది. ‘అప్పు’, ‘అరసు’, ‘మిలన’, ‘జాకీ’, ‘రాజకుమార.’, ‘వీర కన్నడీగ’, ‘రణ విక్రమ’ ఇవన్నీ సూపర్‌ హిట్లే. కన్నడలో అత్యధిక పారితోషికం అందుకునే కథానాయకుడిగా, ‘పవర్‌ స్టార్‌’గా మారిపోయాడు అప్పు. తన క్రేజ్‌ బుల్లితెరపైనా అద్భుతాలు చేసింది. ‘కౌన బనేగా కరోడ్‌పతీ’ కన్నడ వెర్షన్‌కు తనే వ్యాఖ్యాత. దాంతో పాటు కొన్ని రియాలిటీ షోలనూ ముందుండి నడిపించాడు. నిర్మాతగా తన అభిరుచి చాటుకునే సినిమాల్ని తెరకెక్కించాడు. కన్నడ చిత్రసీమలోనే అతి పెద్ద స్డూడియోని నిర్మించాలన్నది తన కల. అంతలోనే... ఆయువు తీరిపోయింది. తను వచ్చిన పనులన్నీ అయిపోయినట్టు... అర్థాంతరంగా జీవిత రంగస్థలం నుంచి నిష్క్రమించాడు.


బాల్యం... మధురం

సూపర్‌ స్టార్‌ ఇంట్లో పుట్టిన గారాల బిడ్డ... పునీత్. చివరి సంతానం కావడంతో మురిపాలు ఎక్కువే. రాజ్‌ కుమార్‌ షూటింగ్‌ కి వెళ్తుంటే... అప్పటి లోహిత్ తయారైపోయేవాడు. ప్రతీ రోజూ.. సెట్లో లోహిత్ ఉండాల్సిందే. అప్పుడే మేకప్‌, కెమెరా, యాక్షన్ అనే పదాలు పరిచయం అయ్యాయి. దాంతో చదువు అటకెక్కింది. ప్రైవేటుగా చదవడం తప్ప, స్కూలుకి వెళ్లడం గగనం అయిపోయింది. లోహిత్‌కి స్నేహితులు ఎక్కువ. అయితే వాళ్లకెవరికీ సినీ నేపథ్యాలు లేవు. వాళ్ల మధ్య.. లోహిత్ ఓ మినీ సూపర్‌ స్టార్‌. అయితే ఆ హోదా, డాంబికం ఎప్పుడూ ప్రదర్శించేవాడు కాదు. వాళ్లతో రోడ్డు మీదే గోళీలు ఆడేవాడు. క్రికెట్‌ నుంచి ఫుట్‌ బాల్‌ వరకూ ఏ ఆటనీ వదిలిపెట్టేవాడు కాదు. ఉంటే నాన్నతో పాటు సెట్లో. లేదంటే.. స్నేహితులతో పాటు మైదానంలో. తన బాల్యం ఇలానే గడిచింది. అయితే క్రమశిక్షణ తప్పినప్పుడల్లా.. నాన్న చేతి దెబ్బలు పడేవి. ఓసారి బూతులు మాట్లాడాడని కోటు తగిలించే హ్యాంగర్‌‌తో తీవ్రంగా కొట్టారట రాజ్‌ కుమార్‌. తండ్రి చేతిలో దెబ్బలు తినడం అదే చివరి సారి.


పునీత్‌కి పాలంటే చాలా ఇష్టం. గ్లాసుడు పాలిస్తానంటే... ఏ పనైనా చేసేసేవాడట. ఆ బలహీనతని అడ్డుపెట్టుకుని ఇంట్లో పనులన్నీ పునీత్‌కే అప్పగించేవారట. క్రమంగా... పునీత్ భోజన ప్రియుడు అయిపోయాడు. హీరో అయ్యేంత వరకూ... తిండిపై అదుపు లేకుండా పోయిందట. ఆ తరవాత.. మెల్లగా తన ఆహార అలవాట్లని మార్చుకున్నాడు.


‘‘నాన్న నుంచి రెండు విషయాలు నేర్చుకున్నా. అందులో ఒకటి పెద్దల్ని గౌరవించాలి. రెండోది ఆహారాన్ని వృధా చేయకూడదు. ఇప్పటికీ ఈ రెండు విషయాల్ని నేను పాటిస్తుంటా’’ అని చెప్పేవారు పునీత్. 


పండగలంటే పునీత్‌కి చాలా ఇష్టం. ముఖ్యంగా దీపావళి తన ఫేవరెట్‌. ‘‘మాది చాలా పెద్ద కుటుంబం. ఎప్పుడూ కలిసే భోజనం చేసేవాళ్లం. పండగలొస్తే... మా ఇల్లు కళకళలాడిపోయేది. చుట్టాలంతా ఇంట్లోనే ఉండేవారు. అందరూ పక్క పక్కన కూర్చుని భోజనం చేస్తుంటే భలే సంతోషంగా అనిపించేది. ఆ రుచి మరెప్పుడూ వచ్చేది కాదు. అందుకే... నేను ఇంట్లో ఉంటే, నలుగురితో కలిసి భోజనం చేయడానికే ఇష్టపడతా. ఇంట్లో ఎప్పుడూ మరో నలుగురికి సరిపడా భోజనం సిద్ధంగా ఉండేది. నేనేమో డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కూర్చుని స్నేహితుల కోసం ఇష్టంగా ఎదురు చూసేవాడ్ని. ఇంటికి ఎవరొచ్చినా భోజనం పెట్టకుండా పంపకూడదు అని నాన్న చెప్పేవారు. అది ఎప్పటికీ పాటిస్తూనే ఉంటా’’ అంటూ ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు పునీత్.

Updated Date - 2021-10-30T00:53:05+05:30 IST