Jayanthi Death Anniversary: మేం చేయలేమన్న హీరోయిన్లు.. స్విమ్‌సూట్‌లో నటించి చూపించిన జయంతి..!

ABN , First Publish Date - 2022-07-26T15:09:57+05:30 IST

‘మిస్ లీలావతి’అనే సినిమా కన్నడ చిత్రరంగంలో ఒక సంచలనానికి కారణమయ్యింది. అది హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం. అందులో నాయిక- కట్టుబాట్లని వ్యతిరేకించే, తిరుగుబాటు మనస్థత్వం ఉన్న స్త్రీ. ‘మిస్ లీలావతి’ లో కథాపరంగా నాయిక చాలా ఆధునికంగా కనిపించాలి.

Jayanthi Death Anniversary: మేం చేయలేమన్న హీరోయిన్లు.. స్విమ్‌సూట్‌లో నటించి చూపించిన జయంతి..!

ఆంగికాభినయవాచకాలలో వైవిధ్య వైజయంతి

నేడు తొలి వర్థంతి


"మల్లె పందిరి నీడలోన జాబిల్లి..

మంచమేసి ఉంచినాను జాబిల్లి

మా అన్నకు.. మా చంద్రికి..

ఇది తొలి రేయి.. నాకిది వరమోయి.." అని 'మాయదారి మల్లిగాడు' సినిమాలో ఓ పాట ఉంది. ఆ సినిమా హీరో కృష్ణ, హీరోయిన్ మంజుల. కృష్ణ అందులో టైటిల్ పాత్ర ధరిస్తే, చంద్రి- అనే కథానాయిక పాత్ర ధరించిన మంజులకి అది తొలిచిత్రం. మల్లి- చంద్రి శోభనానికి ఏర్పాట్లు చేస్తుంది పంకజం పాత్ర వేసిన జయంతి.


జయంతికి మల్లి సొంత అన్నయ్య కాదు, అతనికి ఆశ్రయం ఇస్తుంది, మల్లి- చంద్రి సంబంధం మీద అపవాదు పడితే, ఆ జంట పెళ్ళి చేసుకోవడానికి సాయపడుతుంది, ఆ జంట శోభనానికి ఏర్పాట్లు చేస్తుంది. "పెళ్ళి సంబరమెన్నడెరుగని ఇల్లు నాదీ..ఈ.. పసుపుతాడే నోచుకోని బ్రతుకు నాదీ..." అని దిగులుపడే పాత్ర ఆమెది. "ఈ పెళ్ళి చూసి నేను కూడా ముత్తైదువైనాను/ ఈ పుణ్ణెమే పై జన్మలో నను ఇల్లాలిని చేయాలి..." అని కోరుకుంటుంది.


1973లో విడిదలైన ఈ సినిమా ప్రివ్యూ ప్రదర్శన బొంబాయిలోని ఒక స్టూడియోలో జరిగిందట. విదేశాల నుంచి వచ్చిన స్నేహితుల బృందానికి ప్రత్యేకమైన షో వేసి చూపించారట దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు.


"మా అన్నకు.. మా చంద్రికి.. ఇది తొలి రేయి.. నాకిది వరమోయి.." అని తన్మయంగా పాత్రలో లీనమై నటించిన జయంతిని ప్రత్యేకంగా అభినందించారట ఆ విదేశీయులు. కానీ, ఆమె పాత్ర స్వరూప స్వభావాలు, ఆ పాత్ర త్యాగనిరతి, ఔన్నత్యం వారికి అర్థమయ్యేలా చేయడానికి ఆదుర్తి సుబ్బారావు గారి తల ప్రాణం తోకకొచ్చిందట.


దానికి కారణమేమిటి? జయంతి నటించి, జీవించిన పంకజం వంటి పాత్ర చుట్టూ సినిమాలో చూపెట్టిన పరిస్థితులే ఉంటే, ఆ పాత్ర ఒక సైకోపాత్ గానో, హిస్టీరియా పేషెంట్ లానో అవుతుందే తప్ప పంకజం లాగా త్యాగమయి, అనురాగమయీ అయ్యేది కాదన్నది ఆ విదేశీయుల భావన. వారిలో అటువంటి నిశ్చితాభిప్రాయాలు ఏర్పడటానికి కారణం - స్త్రీల లైంగికభావనలు, శారీరకమైన భౌతికావసరాలకి సంబంధించి సిగ్మండ్ ఫ్రాయిడ్, కార్ల్ యూంగ్ వంటి విదేశీ మనోవిశ్లేషకులు చేసిన సిద్ధాంతాలు, రాసిన పరిశోధనలే.


తనకి లేదు అనే నిరాశ, తన పక్కనే ఎవరికో దక్కుతుందనే దుగ్ధ-  స్త్రీని అశాంతిమయం చేసి, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసి, ఆమెని రోగగ్రస్తం చేస్తుందని విదేశీ విశ్లేషకులు అభిప్రాయపడ్తారు. లిబిడో అని ఫ్రాయిడ్ పేరుపెడితే, యూంగ్ వంటి మరో మనోవైజ్ఞానిక విశ్లేషకులు మరో సిద్ధాంతం ప్రతిపాదించారు. అందుకే ఆ విశ్లేషకులతో ప్రభావితులైన విదేశీ అతిథులకి 'మాయదారి మల్లిగాడు' సినిమాలో జయంతి పోషించిన పంకజం పాత్ర అంతుచిక్కలేదు.


పంకజం పాత్రకి ప్రాణం పోసిన జయంతి

అయితే, అదంతా పంకజం అనే పాత్ర గొప్పతనం, దాన్ని సృష్టించిన రచయిత ప్రతిభ, అభివృద్ది చేసిన దర్శకుడి దార్శనికత. ఇందులో నటించిన వారి గొప్పతనం ఏముంది? అదే ఇక్కడ కీలకం. ఆ పాత్ర జయంతి తప్ప మరొకరు ధరించినట్టయితే, ఆ ప్రత్యేకత అంతగా ప్రశస్తి వచ్చేది కాదు. సినీరంగంలో స్వయంగా పాడడం వలన గుర్తుండిపోయిన తారలు, అలనాటి కన్నాంబ, ఎస్ వరలక్షి, జి వరలక్షి నుంచి ఎందరో. కానీ మాటల వలన గుర్తుండిపోయిన తారలు కొందరే.. మగవారిలో జగ్గయ్య, ఆడవారిలో జానకి, జయంతి. పంకజం పాత్ర జీవితంలో ఉన్న చీకటివెలుగులు, సుఖదుఃఖ్ఖాలు, సంతోషవిషాదాలు, ఎత్తుపల్లాలు, ఒడిదుడుకులు అన్నింటినీ తన వాచక వైవిధ్యంతో స్ఫురింపచేశారు జయంతి.


స్విమ్ సూట్ లో ‘మిస్ లీలావతి’

‘మిస్ లీలావతి’అనే సినిమా కన్నడ చిత్రరంగంలో ఒక సంచలనానికి కారణమయ్యింది. అది హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం. అందులో నాయిక- కట్టుబాట్లని వ్యతిరేకించే, తిరుగుబాటు మనస్థత్వం ఉన్న స్త్రీ. ‘మిస్ లీలావతి’ లో కథాపరంగా నాయిక చాలా ఆధునికంగా కనిపించాలి. దుస్తులు, హీరో స్టైల్స్, నడక ఇలా అన్నింటిలోనూ ఆమె అసాధారణంగా ఉండాలి. దానికి తగ్గట్టు ఆహార్యం ఉండాలి, మోడ్రన్ దుస్తులు ధరించాలి. ఆ పాత్ర నచ్చినా దుస్తులు, ఫ్యాషన్స్ విషయంలో, ముఖ్యంగా నాయిక ఈతకొట్టే దృశ్యాల్లో పాత్రోచితంగా స్విమ్ సూట్ లో ఉండాల్సిన అవసరం ఉండేసరికి కొందరు హీరోయిన్లు ఆ పాత్రని వదులుకున్నారు. కానీ, జయంతి ఆ పాత్రని ఒక ఛాలెంజ్ గా తీసుకొని చేసింది.


స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు చీర కట్టుకుంటామా, స్విమ్మింగ్ డ్రెస్ లోనే కదా ఉండాలి, అని ఆమె అభిప్రాయపడింది. పైగా పాత్రను రూపొందించిన తీరు బాగా నచ్చి నటించింది జయంతి. సినిమా విడుదలయ్యాక, ఆ పాత్రలో నటించిన జయంతి ధైర్యానికి అందరూ ఆశ్చర్యపోయారు. విశేషం ఏమిటంటే, ఆమె నటించిన ‘మిస్ లీలావతి’ చిత్రం ప్రాంతీయస్థాయిలో ఉత్తమ కన్నడ చిత్రంగా జాతీయ బహుమతిని గెల్చుకుంది. వీటన్నింటికీ మించి విశేషం ఏమిటంటే, స్విమ్మింగ్ సూట్ లో కూడా జయంతి వల్గర్ గా అనిపించలేదని విమర్శకులు ప్రశంసించడం.


కమలకుమారి జయంతిగా ఎలా మారింది?

జయంతి 1945లో జనవరి 6న బళ్లారిలో పుట్టింది. తల్లిందండ్రులు సంతానలక్ష్మి, బాలసుబ్రమణ్యం తండ్రి కాలేజీ లెక్చరర్. తండ్రిగారి ఉద్యోగరీత్యా కొంతకాలం శ్రీకాళహస్తిలో ఉన్నారు. జయంతి తల్లిగారికి నాట్యం అంటే అభిమానం. అందువల్ల జయంతి చదువుకునే రోజుల్లో సినిమాల్లోని డ్యాన్సులు చూసి తనూ అలా చేయడానికి ప్రయత్నిస్తే బాగా ప్రోత్సహిస్తూ ఉండేవారు. అలా స్కూలు వార్షికోత్సవాల్లో కానీ లేదా ఏమైనా ఫంక్షన్ కానీ ఉంటే తప్పనిసరిగా జయంతి డ్యాన్సు ప్రోగ్రాం ఉండేది. జయంతి టీనేజిలో ఉండగాస్కూల్ వార్షికోత్సవంలో ‘మిస్సమ్మ’ చిత్రంలోని ‘బృందావనమది అందరిదీ’ పాటకు చేసిన డ్యాన్సును అందరూ బాగా మెచ్చుకోవడంతో తన కుమార్తెను మంచి నర్తకిగా తీర్చిదిద్దాలని తీర్మానించుకున్నారు.


ఆమె తల్లిగారు ఆ తర్వాత ఆ కుటుంబం మద్రాసుకు చేరుకోవడంతో జయంతిని చంద్రకళ అనే డ్యాన్స్ టీచర్ దగ్గర చేర్పించారు. చంద్రకళ గారు డ్యాన్సులు నేర్పించడమే కాదు సినిమాల్లో కూడా డ్యాన్సులు చేసేవారు.ఒక రోజు ఓ సినిమా షూటింగ్ లో తన డ్యాన్స్ చిత్రీకరణ జరుగుతున్న సందర్భంగా తన శిష్యురాళ్లందరినీ అక్కడకు తీసుకువెళ్లారు చంద్రకళ.


జయంతికి ఆ సినిమా వాతావరణం పెద్ద పెద్ద లైట్లు, సెట్టింగులు, కెమెరాలు మొదటిసారిగా చూస్తూ ఆశ్చర్యానికి గురయ్యారు. పెద్ద కళ్లేసుకొని, ప్రతీదీ వింతగా చూస్తూ ఆశ్చర్యపోతున్న ఆ బంగారు బొమ్మని చూసి ముచ్చటపడిపోయారు ప్రముఖ కన్నడ దర్శకులు వై.ఆర్.స్వామి. ఆప్యాయంగా అక్కునజేర్చుకొని, పలకరించారట. జయంతి అసలు పేరు కమలకుమారిని జయంతిగా ఆ తర్వాత మార్చింది కూడా ఆయనే. జయంతి తల్లిదంద్రుల్ని కలిసి ఒప్పించి,  జయంతిని సినీరంగానికి పరిచయం చేశారు స్వామి. జయంతి తల్లిదండ్రులు ముందు వెనకాడినా, తమ బిడ్డకి గొప్ప భవిష్యత్తు ఉంటుందని అందరూ చెప్పడంతో ఒప్పుకున్నారు.


తొలిచిత్రం ‘జెను గూడు’(తేనెతుట్టె  అని అర్ధం) విడుదలై మంచి విజయం సాధించింది. అది తొలి అడుగుగా, కన్నడ సినిమా రంగాన్ని ఏలింది జయంతి. జయంతి తెలుగునటి అయినా కన్నడ చిత్ర రంగం ఆమె ప్రతిభను గుర్తించి, బాగా ప్రోత్సహించిన తర్వాతే తెలుగు చిత్ర సీమ ఆదరించింది. జయంతి కన్నడంలో అగ్రహీరో రాజ్ కుమార్ సరసన దాదాపు 25 చిత్రాలలో నటించిందంటే అక్కడి ప్రేక్షకులు ఆ చిత్ర పరిశ్రమ ఆమెను ఎంతగా అభిమానించారో అర్ధమవుతుంది.


బహుభాషానటిగా దక్షిణాది నుంచి ఉత్తరాది వరకూ…

అసలు జయంతి అనే ఒక తార లేకపోతే కన్నడ పరిశ్రమ  ఏమైపోయేదో అనేవారు సినీపండితులు. జయంతి కన్నడ, తెలుగు చిత్రాలలోనే కాదు తమిళంలో కూడా విశేష ప్రజాదరణ పొందారు. మలయాళం, హిందీ చిత్రాలలో కూడా నటించారు. అన్ని భాషల్లోనూ దాదాపు 350 చిత్రాల్లో నటించారు. కన్నడంలో ఆమెకు ఆరుసార్లు ఉత్తమ నటిగా ప్రభుత్వ అవార్డులు లభించాయి. 2005-2006సంవత్సరానికి డాక్టర్ రాజ్ కుమార్ పురస్కారం దక్కింది. ఇక తెలుగులో ‘శారద’, ‘మాయదారి మల్లిగాడు’, ‘కొండవీటి సింహం’, ‘జస్టీస్ చౌదరి’, ‘స్వాతి కిరణం’, ‘పెదరాయుడు’, ‘కంటే కూతుర్నే కను’, ‘రాఘవయ్య గారిఅబ్బాయి’  మొదలైన పలు చిత్రాలు జయంతికి ఎంతో పేరు తెచ్చాయి. హిందీలో జయంతి ‘లాల్ బంగ్లా’, ‘గూండా’, ‘తుమ్ సే అచ్చా కౌన్ హై’, ‘ఓం శాంతి ఓం’ మొదలైన చిత్రాల్లో నటించారు.


జయంతి అందం అభినయం ఆంగికం వల్ల అన్ని భాషల్లోనూ దర్శకుల అభిమానాన్ని చూరగొన్నారు. ప్రఖ్యాత దర్శకులు కె.వి.రెడ్డి, కె.విశ్వనాథ్ జయంతి అంటే ప్రత్యేక అభిమానంతో నటనలో ఆమెకెన్నో మెళకువలు నేర్పించారు. ప్రసిద్ధ దర్శకులు కె.బాలచందర్ తన దాదాపు ప్రతి చిత్రంలోనూ ఆమెకు మంచిపాత్రలు ఇచ్చారు. బాలచందర్ దర్శకత్వంలో తమిళంలో భామా విజయం పేరిట తీసిన సినిమా, తెలుగులో ‘భలే కోడళ్ళు’ గాను, హిందీలో ‘తీన్ బ్వజరానియా’ గాను వస్తే ఈ మూడు భాషల్లోనూ జయంతి నటించారు. అలా ఉండేది ఆమె పట్ల దర్శకుల అభిమానం.


అటువంటి ఆంగికాభినయవాచకాలలో వైవిధ్య వైజయంతి గత ఏడాది ఇదే రోజున (26 జూలై, 2021) తన 76 ఏట కన్నుమూశారు. భౌతికంగా జయంతి లేకున్నా, ఆమె చిత్రాల ద్వారా అభిమానుల గుండెల్లో అజరామరంగా నిలిచే ఉంటారు.

Updated Date - 2022-07-26T15:09:57+05:30 IST