Mahesh Babu నుంచి Allu Arjun వరకు.. బాలీవుడ్‌పై ఈ సౌత్ స్టార్లు చెప్పిన మాటలివి..!

ABN , First Publish Date - 2022-05-16T22:01:02+05:30 IST

సౌత్ సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్నాయి. యస్‌యస్. రాజమౌళి(SS Rajamouli) తెరకెక్కించిన ‘బాహుబలి’ (Baahubali) తో ఈ ప్రభంజనం మొదలైంది.

Mahesh Babu నుంచి Allu Arjun వరకు.. బాలీవుడ్‌పై ఈ సౌత్ స్టార్లు చెప్పిన మాటలివి..!

సౌత్ సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్నాయి. యస్‌యస్. రాజమౌళి(SS Rajamouli) తెరకెక్కించిన ‘బాహుబలి’ (Baahubali) తో ఈ ప్రభంజనం మొదలైంది. ‘పుష్ప’(Pushpa), ‘ఆర్‌ఆర్‌ఆర్’(RRR), ‘కెజియఫ్: చాప్టర్-2’(KGF Chapter 2) సినిమాలు అదే బాటలో నడుస్తూ భారీ వసూళ్లను రాబట్టాయి. ఈ నేపథ్యంలో దక్షిణాది చిత్రాల గురించి అందరు చర్చించుకోవడం మొదలుపెట్టారు. అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్‌టీఆర్, యశ్ మొదలైన స్టార్ హీరోలందరికీ బీ టౌన్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అందువల్ల మీడియా బాలీవుడ్‌పై పలువురు  స్టార్స్‌ను ప్రశ్నించింది. ఈ క్రమంలో సౌత్ స్టార్స్ వివిధ సందర్భాల్లో బాలీవుడ్‌పై చేసిన కామెంట్స్‌పై ఓ లుక్కేద్దామా..


మహేశ్ బాబు (Mahesh Babu):

మాస్, కమర్షియల్ అంశాలను మేళవిస్తూ సందేశాత్మక సినిమాలు చేస్తున్న నటుడు మహేశ్ బాబు. అడవి శేష్ హీరోగా తెరకెక్కిన ‘మేజర్’ సినిమాకు సూపర్ స్టార్ మహేశ్ నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సందర్భంగా నేషనల్ మీడియాతో మాట్లాడాడు. ఓ రిపోర్టర్ బాలీవుడ్‌కు ఎప్పుడు ఎంట్రీ ఇస్తున్నారని అడిగాడు. అందుకు మహేశ్ బాబు ఈ విధంగా స్పందించాడు.  ‘‘హిందీ నుంచి నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ, బాలీవుడ్ నన్ను భరించలేదని నేను నమ్ముతున్నాను. అక్కడ సినిమాలు చేసి సమయాన్ని వృథా చేసుకోవాలనుకోవట్లేదు’’ అని మహేశ్ బాబు చెప్పాడు. 


ప్రియమణి ( Priyamani):

దక్షిణాదిలోని అన్ని భాషల్లో చిత్రాలు చేసిన నటి ప్రియమణి. షారూఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ లో స్పెషల్ సాంగ్ చేసి భారీ స్థాయిలో అభిమానులను సంపాదించుకుంది. బాలీవుడ్‌పై తనకున్న అభిప్రాయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ‘‘గతంలో శ్రీదేవి, రేఖ, హేమమాలిని వంటి తారలు బాలీవుడ్‌ను ఏలారు. అనంతరం వారి స్థానాలకు కొరత ఏర్పడింది. తర్వాత సౌత్ టెక్నిషియన్స్‌ బీ టౌన్‌లో తమదైన ముద్ర వేశారు. ప్రస్తుతం సౌత్ స్టార్స్‌కు గుర్తింపు రావడం చాలా సంతోషంగా ఉంది’’ అని ప్రియమణి తెలిపింది.


శ్రుతి హాసన్ (Shruti Haasan):

కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీకీ ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న నటి శ్రుతి హాసన్. బాలీవుడ్‌లో తనను ఔట్ సైడర్‌లా చూశారని పేర్కొంది. దక్షిణాది సినిమాలు చేస్తున్నప్పుడు బాలీవుడ్‌పై ఎందుకు దృష్టి సారించడం లేదని అడిగారని చెప్పింది. ఇండియా అంత ఒకే ఇండస్ట్రీ ఉంటే ఈ విధమైన ప్రశ్నలు అడగరు కదా అని వాపోయింది.


యశ్ (Yash):

‘కెజియఫ్’ ప్రాంచైజీతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుడు యశ్. బాలీవుడ్‌పై తన అభిప్రాయాన్ని మీడియాకు చెప్పాడు. ‘‘కొన్ని హిందీ ఛానల్స్‌లో దక్షిణాది చిత్రాల డబ్బింగ్ వెర్షన్‌లను ప్రసారం చేస్తున్నారు. సౌత్ సినిమాలు ఏవిధంగా ఉంటాయో బాలీవుడ్ వారికీ తెలుసు. గత కొన్నేళ్లుగా కంటెంట్‌ను చూస్తుండటంతో వారికీ ఆ కథలు బాగా నచ్చాయి. శాటిలైట్ మార్కెట్‌లో సౌత్ మూవీస్ దుమ్ము రేపుతోన్న సమయంలో ‘బాహుబలి’ రిలీజ్ అయింది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. ‘కెజియఫ్’ కూడా ఇదే బాటలో పయనించింది. హిందీ సినిమాలను కూడా దక్షిణాది ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. సల్మాన్ ఖాన్ లాంటి స్టార్స్ చిత్రాలను దక్షిణాది వారు ఎన్నో ఏళ్లుగా చూస్తున్నారు’’ అని యశ్ పేర్కొన్నాడు. 


అల్లు అర్జున్ (Allu Arjun): 

‘పుష్ప’ సినిమాతో ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు అల్లు అర్జున్. ‘‘బాలీవుడ్ నుంచి నాకు ఆఫర్స్ వచ్చినప్పటికీ అంత ఆసక్తికరంగా లేవు. వేరే ఇండస్ట్రీలో నటించాలంటే కొంచెం ధైర్యం ఉండాలి. హీరోగా సినిమాలు చేస్తున్నప్పుడు విలన్ పాత్రలు చేయాలంటే కష్టం. అటువంటి పాత్రలపై నేను ఆసక్తి చూపించను’’ అని బన్నీ తెలిపాడు. 


రామ్ చరణ్ (Ram Charan)

‘ఆర్‌ఆర్‌ఆర్’ లో తనదైన మార్కు నటనతో అభిమానులను అలరించిన నటుడు రామ్ చరణ్. హిందీ సినిమాలను దక్షిణాదిలో ఆదరించారని సల్మాన్ ఖాన్ చెప్పాడు. దీంతో ఆ వ్యాఖ్యలపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పందించాడు. ‘‘నిజం చెప్పాలంటే అది సల్మాన్ తప్పు కాదు, సినిమా తప్పు కాదు. కథలోనే లోపం ఉందని నేను నమ్ముతున్నాను. సరిహద్దులను చెరిపేయాల్సింది దర్శకులే.  ప్రతి రైటర్ విజయేంద్ర ప్రసాద్, రాజ‌మౌళి లాగా కథలు రాయగలరు. బాలీవుడ్ డైరెక్టర్స్‌తో నేను పనిచేయాలనుకుంటున్నాను. కానీ, ఆ దర్శకులు సౌత్‌కు అనుగుణంగా పాన్ ఇండియా సినిమాను తెరకెక్కించాలి’’ అని రామ్ చరణ్ పేర్కొన్నాడు. 



ప్రభాస్ (Prabhas):

‘బాహుబలి’ ప్రాంచైజీతో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్న నటుడు ప్రభాస్. ‘‘..‘బాహుబలి’, ‘కెజియఫ్’ సినిమాలు బాలీవుడ్‌లో బాగా ఆడాయి. ‘బ్రహ్మాస్త్రం’ దక్షిణాదిలో బాగా నడుస్తుందనుకుంటున్నాను. ఏ సినిమా వసూళ్లను రాబడుతుందో మనం చెప్పలేం. ‘బాహుబలి’, ‘పుష్ప’, ‘కెజియఫ్’ చిత్రాలు కలెక్షన్లను కొల్లగొడతాయని ఎవరు ఊహించలేదు. భవిష్యత్తులో అన్ని భాషల నుంచి పాన్ ఇండియా సినిమాలు వస్తాయి’’ అని రెబల్ స్టార్ ప్రభాస్ స్పష్టం చేశాడు. 



Updated Date - 2022-05-16T22:01:02+05:30 IST