సౌత్‌ సినిమా సత్తా!

ABN , First Publish Date - 2022-03-09T06:44:37+05:30 IST

ఇటీవల ప్రముఖ నిర్మాత బోనీకపూర్‌ ఓ మాటన్నారు. బాలీవుడ్‌ సినిమా అంటే కేఎఫ్‌సీ లాంటిదట...

సౌత్‌ సినిమా సత్తా!

ఇటీవల ప్రముఖ నిర్మాత బోనీకపూర్‌ ఓ మాటన్నారు. బాలీవుడ్‌ సినిమా అంటే కేఎఫ్‌సీ లాంటిదట. ఒకటే ఐటెమ్‌... ఒకటే టేస్ట్‌.

కానీ, సౌత్‌ సినిమా ‘థాలీ’ లాంటిదట. అంటే... పసందైన విందు భోజనం. పప్పు, చారు, కూర, పచ్చడి, చికెనూ.. ఇలా అన్ని రకాల ఐటెమ్స్‌ ఉంటాయి. అందుకే ఇండియన్‌ ప్రేక్షకులంతా సౌత్‌ సినిమాలవైపు చూస్తున్నారన్నది ఆయన అభిప్రాయం. ఇది ఆయన మాటే కాదు. బాలీవుడ్‌ విశ్లేషకులు, అక్కడి సినీ మేధావులు కూడా దాదాపుగా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సౌత్‌ చిత్రాలు బాలీవుడ్‌లో విజయఽ ఢంకా మోగించడానికి కారణమేమిటా? అని విశ్లేషిస్తే, ఇక్కడి కథలు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా తయారవుతున్నాయని స్పష్టం అవుతోంది. అందుకే సౌత్‌ చిత్రాలు మ్యాజిక్‌ చేస్తున్నాయి.


నాలుగైదేళ్ల క్రితం వరకూ ఇండియన్‌ సినిమా అంటే, హిందీ సినిమానే. బాలీవుడ్‌ దే పెత్తనం అంతా. సౌత్‌ చిత్రాల్ని ఏమాత్రం పట్టించుకునేవారు కాదు. ఇక్కడి బడ్జెట్లు తక్కువనో, లేదంటే రొటీన్‌ సినిమాలు వస్తాయనో తెలీదుగానీ, తెలుగు, తమిళ చిత్రాల్ని చిన్నచూపు చూసేవారు. కన్నడ, మలయాళ చిత్రాలైతే మరింత. ఇప్పుడు సీన్‌ మారిపోయింది. తెలుగు సినిమా బాలీవుడ్‌ చిత్రాలను తలదన్నే వసూళ్లు సంపాదిస్తోంది. అన్ని భాషల్లోకి విస్తరించి, ఇండియన్‌ సినిమాకి సరికొత్త నిర్వచనంలా మారింది. దీనంతటికీ కారణం... ‘బాహుబలి’ చిత్రమే. ఓ తెలుగు సినిమా బాలీవుడ్‌ గడ్డపై వసూళ్ల వర్షం కురిపించడం అశ్చర్యపరిచింది. ‘దంగల్‌’ తరవాత ఆ స్థాయి వసూళ్లు సాధించిన సినిమా.. ‘బాహుబలి’నే. తెలుగు సినిమా సరిహద్దుల్ని చెరిపేయగలదని నిరూపించిన సినిమా అది. అయితే... ఆ వెంటనే ‘కేజీఎఫ్‌’ రంగ ప్రవేశం చేసింది. అప్పటి వరకూ కన్నడ చిత్రాలకు ఏమాత్రం మైలేజీ ఉండేది కాదు. యశ్‌ అనే హీరో ఒకడున్నాడన్న సంగతి కూడా బాలీవుడ్‌కి తెలీదు. అలాంటిది.. కేజీఎఫ్‌ హిందీనాట దుమ్ము దులిపింది. నార్త్‌లో అన్ని మూలలా మంచి వసూళ్లని సాధించింది. అప్పటి నుంచీ సౌత్‌ సినిమా సౌండ్‌ బాలీవుడ్‌లో గట్టిగా ప్రతిధ్వనించడం మొదలైంది. తాజాగా ‘పుష్ప’ ఓ సంచలనం. ఏమాత్రం పబ్లిసిటీ లేకపోయినా సరే, హిందీనాట ‘పుష్ప’ వసూళ్లు అదిరిపోయాయి. మూడ్రోజుల పాటు అక్కడ టికెట్లే దొరకలేదు. నార్త్‌లో బీ, సీ సెంటర్లలో ‘పుష్ప’కి రిపీటెడ్‌ ఆడియన్స్‌ వచ్చారు. అందుకే బాలీవుడ్‌లో దాదాపు 85 కోట్ల వసూళ్లు అందుకుంది. హిందీనాట... హిందీ సినిమాలు చూడ్డానికే ప్రేక్షకులు ఇళ్లని వదిలి బయటకు రాని పరిస్థితుల్లో, ఓ డబ్బింగ్‌ సినిమాకు ఈ స్థాయి వసూళ్లు లభించడం నివ్వెరపరిచే విషయమే. దేశమంతా థియేటర్ల పరిస్థితి క్లిష్టంగా ఉంది. జనాలు థియేటర్లకు రావడం తగ్గించేశారు. అలాంటి పరిస్థితుల్లో కూడా తెలుగులో వంద కోట్ల సినిమాలొచ్చాయి. ‘అఖండ’, ‘పుష్ప’, ‘భీమ్లా నాయక్‌’ వసూళ్లు చూస్తే.. తెలుగు నేలపై సినిమాని ఎంత ప్రేమిస్తారన్న విషయం అర్థమవుతుంది. ఇప్పుడు రాబోతున్న ‘రాఽధేశ్యామ్‌’, ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లు కూడా బాలీవుడ్‌లో గట్టి ప్రభావం చూపించడం ఖాయం. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ కోసం బాలీవుడ్‌ ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. కేవలం బాలీవుడ్‌లోనే ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ దాదాపుగా రూ.200 కోట్లు వసూలు చేయగలదన్నది ఓ అంచనా. త్వరలో విడుదల కాబోతున్న ‘కేజీఎఫ్‌ 2’ కూడా బాలీవుడ్‌లో దుమ్ము రేపే అవకాశం ఉంది. ఎప్పుడూ పాన్‌ ఇండియా సినిమాల గురించి పట్టించుకోని విజయ్‌ కూడా తన ‘బీస్ట్‌’ని హిందీలో విడుదల చేయాలనుకుంటున్నారు. అఖిల్‌, విజయ్‌దేవరకొండ లాంటి స్టార్లు కూడా పాన్‌ ఇండియా స్థాయి సినిమాలు తీయాలన్న ప్రణాళికల్లో ఉన్నారు. విజయ్‌ దేవరకొండ ‘లైగర్‌’ పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల అవుతోంది. ఈ సినిమా వెనుక కరణ్‌ జోహార్‌ లాంటి వ్యక్తి ఉండడం.. కలిసొచ్చే అంశం.


శాటిలైట్‌ ఛానళ్ల పుణ్యం

ఓటీటీలు విస్తరించాక.. మలయాళ చిత్రాల విలువ భారతీయ సినీ ప్రేక్షకులకు అర్థమైంది. డబ్బింగ్‌ రూపంలో మలయాళ చిత్రాలన్నీ చూడడం మొదలెట్టారు. ఓటీటీలో మలయాళ సినిమా తిరుగులేని ఆధిపత్యం చూపిస్తోందన్నది సినీ విశ్లేషకుల మాట. తెలుగు, తమిళం నుంచి మాస్‌ చిత్రాలు ఎక్కువగా వస్తుంటాయి. యాక్షన్‌ సీక్వెన్స్‌లకు పెద్ద పీట వేస్తుంటారు. ఇవన్నీ నార్త్‌ ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తున్నాయి. ఈ మసాలా కథల్ని వాళ్లు ఇష్టపడుతున్నారు. ఇది వరకు కొన్ని హిందీ ఛానల్స్‌ లో తెలుగు సినిమాల్ని డబ్‌ చేసి, హిందీలో ప్రదర్శించడం మొదలెట్టారు. ఏదో టైమ్‌ పాస్‌ కోసం మన తెలుగు సినిమాల్ని చూడడం మొదలెట్టిన నార్త్‌ ప్రేక్షకులు, తెలుగు సినిమాలపై, తెలుగు హీరోలపై మెల్లమెల్లగా అభిమానం పెంచుకున్నారు. ఇప్పుడు హిందీ శాటిలైట్‌ ఛానల్స్‌లో మన సినిమాలే ఆధిపత్యం చూపిస్తున్నాయి. తెలుగులో ఫ్లాప్‌ అయిన సినిమాలకూ, హిందీ శాటిలైట్‌లో వ్యూవర్‌ షిప్‌ ఎక్కువ. అలా కేవలం శాటిలైట్‌ ఛానళ్ల పుణ్యాన... తెలుగు చిత్రాలు బాలీవుడ్‌ ప్రేక్షకులకు దగ్గరయ్యాయి. ఇప్పటి ‘పుష్ప’, ‘కేజీఎఫ్‌’లకు ఇన్ని వసూళ్లు వచ్చాయంటే కారణం.. ఒకప్పటి డబ్బింగ్‌ చిత్రాలే. 


ఎందులోనూ తీసిపోం

హిందీ సినిమాలకు మార్కెట్‌ ఎక్కువ. దేశమంతా విడుదల చేసుకునే సౌలభ్యం ఉంది. కాబట్టి.. బడ్జెట్లూ ఎక్కువే. అందుకే ఖర్చుకి వెనుకాడేవారు కాదు. వాళ్ల సినిమాల్లో గ్రాండియర్‌ కనిపించేది. నాణ్యత విషయలో సౌత్‌ సినిమాలకంటే పది మెట్లు పైన ఉండడానికి కారణం అదే. అయితే బడ్జెట్‌ పరిమితులు దాటుకుని వచ్చింది సౌత్‌ సినిమా. ఓరకంగా చెప్పాలంటే బాలీవుడ్‌ స్టార్‌ హీరో సినిమా కంటే ఎక్కువే ఖర్చు పెడుతున్నారు. పేరెన్నదగిన టెక్నీషియన్లని తీసుకొస్తున్నారు. అందుకే బాలీవుడ్‌కి దీటుగా క్వాలిటీ చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఆ రకంగానూ... బాలీవుడ్‌ ని దాటుకుని వెళ్లిపోయింది సౌత్‌ సినిమా. విచిత్రం ఏమిటంటే కరోనా తరవాత... తెలుగులో, తమిళంలో సూపర్‌ హిట్లు పడ్డాయి గానీ, హిందీలో డబ్బులు తీసుకొచ్చిన సినిమా ఒక్కటీ లేదు. హిట్‌ టాక్‌ సంపాదించిన సినిమా కనిపించలేదు. అందుకే తెలుగు సినిమాలవైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మున్ముందూ ఇదే ఊపు కొనసాగితే.. సౌత్‌ చిత్రాలు బాలీవుడ్‌లో ఇలానే వసూళ్ల వర్షం కురిపించుకుంటే, బాలీవుడ్‌ ఆధిపత్యానికి శాశ్వతంగా గండి పడినట్టే. 


Updated Date - 2022-03-09T06:44:37+05:30 IST