Sonal chauhan: తట్టుకొనే శక్తి ఉండాలి!

ABN , First Publish Date - 2022-10-02T21:59:13+05:30 IST

తెలుగులో సోనాల్‌ చౌహాన్‌ సుపరిచితమే. కాకపోతే కెరీర్‌ని టర్న్‌ చేసే పాత్రలేం ఆమెకు ఇప్పటిదాకా రాలేదు. అయినా సరే... తన ప్రయాణం హ్యాపీగా సాగిపోతోందని చెబుతోంది. ఈ ముద్దుగుమ్మ ఇంకేం అంటోందంటే...?!

Sonal chauhan: తట్టుకొనే శక్తి ఉండాలి!

తెలుగులో సోనాల్‌ చౌహాన్‌ (Sonal chauhan) సుపరిచితమే. కాకపోతే కెరీర్‌ని టర్న్‌ చేసే పాత్రలేం ఆమెకు ఇప్పటిదాకా రాలేదు. అయినా సరే... తన  ప్రయాణం హ్యాపీగా సాగిపోతోందని చెబుతోంది. ఈ ముద్దుగుమ్మ ఇంకేం అంటోందంటే...?!

‘‘నేను చాలా నాజూగ్గా కనిపిస్తా. కానీ తిండి విషయంలో నాతో పోటీకి వచ్చేవారే ఉండరు. ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఎంత తింటానో నాకే తెలీదు. నెయ్యి తింటే లావైపోతామని అంటుంటారు. కానీ నాకు ప్రతీ పూట నెయ్యి ఉండాల్సిందే. లైట్‌ ఫుడ్‌, డైట్‌ ఫుడ్‌ అని ఏవేవో చెబుతుంటారు. వాటిని నేను పెద్దగా నమ్మను. ‘కొంచెం బొద్దుగా మారితే బాగుంటావు’ అని చాలామంది సలహా ఇచ్చారు. కానీ ఎంత తిన్నా నేను లావు అవ్వను. ఒక్కసారైనా నన్ను నేను బొద్దుగా చూసుకోవాలని కోరిక.’’


ప్రభాస్‌.. ది బెస్ట్‌...

‘‘నాకు నేను త్వరగా బోర్‌ కొట్టేస్తా. అందుకే నాపై నేను ప్రయోగాలు చేస్తుంటా. ఒక్కోసారి ఒక్కో లుక్‌లో కనిపించడం నాకిష్టం. ఇప్పటి వరకూ గ్లామర్‌ పాత్రలే చేశా. ఒక్కసారైనా డీ గ్లామర్‌ పాత్ర చేయాలని ఉంది... ‘బాహుబలి’లో అనుష్కలా. అనుష్క, కంగనా నా అభిమాన కథానాయికలు. తెలుగు హీరోల్లో ప్రభాస్‌ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు తను పెద్ద స్టార్‌. అయినా సరే.. చాలా వినమ్రంగా ఉంటాడు. అలా... ఒదిగి ఉండడం ఎవరికోగానీ సాధ్యం కాదు.’’

తట్టుకొనే శక్తి ఉండాలి!

‘‘చిత్రసీమలో ప్రతిభ, అదృష్టం ఉంటే సరిపోతుందని అంటారు. కానీ వీటితో పాటు మానసిక దృఢత్వం కూడా చాలా అవసరం. ఎందుకంటే... మన ఊహకు అందని చాలా విషయాలు జరుగుతుంటాయి. వాటిని తట్టుకొనే శక్తి ఉండాలి. అందులో కాస్టింగ్‌ కౌచ్‌ ఒకటి. ఇలాంటి పరిణామాలు నాకు చాలాసార్లు ఎదురయ్యాయి. దీనికి ఎవరూ అతీతులు కాదు.’’

సగం ఖర్చు వాటికే...

‘‘నేనెక్కువగా స్టీరియో టైపు పాత్రలే ఎంచుకొంటాననే విమర్శ ఉంది. అందులో కొంత నిజం ఉంది. కమర్షియల్‌ చిత్రాల్లో కథానాయికల పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం ఉండకపోవొచ్చు. కానీ ఆ పాత్ర లేకుండా మీరు కథని నడపలేరు. ఎంత రొటీన్‌ పాత్ర ఇచ్చినా.. అందులో నేనేం చేయగలనో ఆలోచిస్తా. నా దుస్తుల ఎంపిక బాగుంటుందని అంతా అంటుంటారు. దానికోసం నేను చేసే కసరత్తు చాలానే ఉంటుంది. నా సగం పారితోషికం వాటికే ఖర్చు పెడుతుంటా.’’


విషయం అర్థమైంది...

‘‘నేను నాలాగే ఉంటా. ఇంకొకరి మెప్పు కోసం బతకలేను. ఇది వరకు అది కూడా ట్రై చేసి చూశా. ‘జన్నత్‌’ తరవాత ‘నువ్వు ఎంత హాట్‌గా ఉంటే అంత బాగుంటావు’ అన్నారు. అలా ఉంటేనే ప్రేక్షకులు ఇష్టపడతారేమో అనుకొని రకరకాల ప్రయత్నాలు చేశా. అవి చూశాక.. ‘నువ్వు పక్కింటి అమ్మాయిలా ఉండొచ్చు కదా’ అని ఇంకొందరు అన్నారు. మన చుట్టూ ఉన్న వారందర్నీ సంతృప్తి పరిచేలా బతకలేం అనే విషయం నాకు అర్థమైంది.’’ 


మంచి పరిణామం

‘‘ఓటీటీతో (OTT)చాలా మార్పులొచ్చాయి. కథానాయికల ప్రాధాన్యం పెరిగింది. దక్షిణాది చిత్రాల నాణ్యత అందరికీ అర్థమైంది. మలయాళ, కన్నడ పరిశ్రమల నుంచి ఎన్నో గొప్ప చిత్రాలొస్తున్నాయి. ఇక తెలుగు సినిమాలు చరిత్ర సృష్టిస్తున్నాయి. దేశంలోని గొప్ప గొప్ప స్టార్లంతా తెలుగులో నటించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఇది చాలా గొప్ప పరిణామం’’.

విచిత్రమైన కల

‘‘నాకెప్పుడూ ఓ విచిత్రమైన కల వస్తుంటుంది. సముద్రం ఒడ్డున ఒంటరిగా నిలబడి ఉంటే.. పెద్ద పెద్ద కెరటాలు నన్ను ముంచేయడానికి వస్తుంటాయి. కానీ నన్ను ఒక్క అల కూడా తాకదు. ప్రతీసారీ ఇదే కల వస్తూ ఉంటుంది. ప్రతీ కలకీ ఓ అర్థం ఉంటుందట. మరి నా కలకి అర్థమేమిటి? అని చాలామందిని అడిగాను. కానీ ఎవరూ చెప్పలేదు. ఆ కెరటాలన్నీ డబ్బు మూటలు అయిపోతే బాగుంటుంది.’’


Updated Date - 2022-10-02T21:59:13+05:30 IST