కథ.. మ్యూజిక్‌ని డిమాండ్ చేయాలి: Sita Ramam సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్

ABN , First Publish Date - 2022-07-28T03:14:10+05:30 IST

స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) - మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా.. వైజయంతీ మూవీస్ (Vyjayanthi Movies) సమర్పణలో స్వప్న సినిమా (Swapna Cinema) పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మిస్తున్న

కథ.. మ్యూజిక్‌ని డిమాండ్ చేయాలి: Sita Ramam సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్

స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) - మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా.. వైజయంతీ మూవీస్ (Vyjayanthi Movies) సమర్పణలో స్వప్న సినిమా (Swapna Cinema) పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మిస్తున్న చిత్రం ‘సీతా రామం’ (Sita Ramam).  హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై.. భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఆగస్ట్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న నేపథ్యంలో.. సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ (Vishal Chandrashekhar) మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు. 


‘సీతా రామం’ మ్యూజిక్ డిమాండ్ ఉన్న చిత్రమా..?

‘సీతా రామం’ కథ అద్భుతం. దర్శకుడు హను రాఘవపూడి చాలా గొప్ప కథ రాశారు. కథలో పాటలు వచ్చే సందర్భాలు అద్భుతంగా వుంటాయి. మంచి మ్యూజిక్ రావాలంటే కథ మ్యూజిక్‌ని డిమాండ్ చేయాలి. అలా మ్యూజిక్‌ని డిమాండ్ చేసిన కథ ‘సీతా రామం’. ఈ సినిమాకు గొప్ప మ్యూజిక్ రావడానికి కారణం ఈ కథ ఇచ్చిన స్ఫూర్తి. దర్శకుడు హనుతో ఇదివరకు ‘పడిపడి లేచే మనసు’ సినిమా చేశాను. ఆయన కథ రాసుకునే విధానం నన్నెంతగానో ఆకట్టుకుంటుంది.


పాటల్లో మంచి సాహిత్యం వినిపించింది. లిరిక్ రైటర్స్‌తో మీకున్న బాండింగ్ గురించి..?

ఈ సినిమా మ్యూజిక్ జర్నీ అద్భుతంగా సాగింది. కానున్న కళ్యాణం పాట రాసిన సిరివెన్నెల గారు సాంగ్ కంపోజ్ చేసినప్పుడు స్టూడియోకి రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. నాకు చాలా విషయాలు చెప్పారు. తెలుగు, తమిళ్.. ఇలా అన్నీ భాషల్లోని అలంకారాలు గురించి వివరించారు. ఒకే లిరిక్‌లో డిఫరెంట్ ట్యూన్స్, డిఫరెంట్ లిరిక్స్‌లో అదే ట్యూన్ ఎలా ప్రజంట్ చేయాలో చెప్పారు. కేకే గారు, అనంత్ శ్రీరామ్‌లతో కూడా మంచి అనుబంధం వుంది. పాటలని డబ్బింగ్‌లా కాకుండా తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో విడివిడిగా వాటి నేటివిటీకి తగ్గట్టు ఒరిజినల్‌గా చేశాం. ‘ఇంతందం’ పాట‌ని తమిళ్ కోసం డిఫరెంట్ ట్యూన్ చేశాం.


SP చరణ్‌తో పాడించాలనే ఛాయిస్ ఎవరిది?

ఇది నిర్మాతల ఛాయిస్. అయితే ఈ విషయంలో నాకు పూర్తి స్వేచ్ఛ వుంది. ది గ్రేట్ బాలుగారిలా మరొకరు పాడుతున్నారంటే పాడించుకోవడం ఆనందమే కదా.


‘ఇంతందం’ పాటలో పిల్లలతో పాడించిన కోరస్ చాలా బావుంది.. ఈ ఆలోచన ఎవరిది?

పిల్లలతో కోరస్ పాడించాలనే ఆలోచన దర్శకుడు హనుగారిది. ఈ పాట విన్నప్పుడు.. ఇక్కడ పిల్లలతో కోరస్ పాడిస్తే ఎలా వుంటుందని అన్నారు. రికార్డ్ చేశాం.. అద్భుతంగా వచ్చింది.


‘సీతా రామం’లో నేపథ్య సంగీతం ఎలా వుండబోతుంది?

అద్భుతమైన నేపధ్య సంగీతం వినబోతున్నారు. జర్మనీ, యుఎస్, ఫ్రాన్స్.. ఇలా విదేశీ వాయిద్య కారులతో పాటు దాదాపు 140మంది మ్యుజిషియన్స్ నేపథ్య సంగీతం కోసం పని చేశారు. అలాగే నేపథ్య సంగీతంలో చాలా రాగాల మీద వర్క్ చేశాం. సంప్రదాయ సంగీతం పరంగా ఈ సినిమా చాలా రిచ్‌గా వుంటుంది. మ్యూజిక్ విషయంలో చాలా హార్డ్ వర్క్ చేశాం. నేను, నా భార్య, టీమ్.. రౌండ్ ది క్లాక్ పని చేశాం. నేను హైదరాబాద్‌లో వుండి మ్యూజిక్ నోట్స్ రాసిస్తే,.. నా భార్య చెన్నై, కొచ్చి వెళ్లి అక్కడి సింగర్స్‌తో రికార్డ్ చేసేవారు. ఇక్కడ నుండి నేను మానిటర్ చేసేవాడిని.


మిగతా సినిమాలకి, ఈ సినిమాకి మ్యూజిక్ విషయంలో తేడా ఏమిటి?

ఇలాంటి స్టయిల్‌లో ఇంత రిచ్ మ్యూజిక్  గతంలో నేను ఎప్పుడూ చేయలేదు. మ్యూజికల్‌గా చాలా రిచ్‌గా వుంటుంది. సింథటిక్, ఫ్లాస్టిక్ మ్యూజిక్ కాకుండా చాలా ఆర్గానిక్‌గా చేసిన సినిమా ఇది. ఈ సినిమా కోసం రాగాల విషయంలో రీసెర్చ్ కూడా చేశాను. 60, 80 దశకాలలో తెలుగు సినిమాలో ఎలాంటి రాగాలతో పాటలు వచ్చాయనే విషయంలో చాలా పరిశోధన చేశాను.


లిరిక్‌కి ట్యూన్ చేయడానికి ఇష్టపడతారా?

నా వరకూ లిరిక్‌కి ట్యూన్ చేయడమే ఈజీ.


సాహిత్యాన్ని అర్థం చేసుకోవడానికి ఎలాంటి కసరత్తు చేస్తారు?

పాటలో ఎక్స్ ప్రెషన్ ఉండాలంటే సాహిత్యాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ప్రతి మాటకి ఖచ్చితంగా అర్థం తెలుసుకుంటాను. అప్పుడే ఎక్స్‌ప్రెషన్‌ని పట్టుకోగలం.


ఈ సినిమాలో ఎన్ని పాటలు వున్నాయి?

‘సీతా రామం’లో మొత్తం తొమ్మిది పాటలు వున్నాయి. ఇప్పటికే మూడు పాటలు రిలీజ్ అయ్యాయి. నా ఫేవరెట్ సాంగ్ ఇంకా విడుదల కావాల్సివుంది. ఇప్పటివరకూ విడుదలైన పాటల్లో ‘ఓహ్ సీత’ పాట నాకు చాలా ఇష్టం.


మీకు ట్యూన్ చేయడానికి కష్టం అనిపించిన సందర్భం ఉందా?

‘సీతా రామం’లో సెకండాఫ్‌లో ఒక పాట వస్తుంది. బాధ, ఆనందానికి సంబంధించిన పాట కాదు.. మనల్ని వెంటాడే పాట అది. అలాంటి పాట చేయడం కష్టం. మెలోడి నా బలం.


మీకు స్ఫూర్తిని ఇచ్చే సంగీత దర్శకుడు?

రజింత్ బరోట్. తమిళ్‌లో ప్రభుదేవా హీరోగా వీఐపీ అనే సినిమాకి సంగీతం అందించారు. చాలా తక్కువ సినిమాలకే చేశారు. ఆయన సంగీతం నాలో చాలా స్ఫూర్తిని నింపింది. వీఐపీ పాటలు విని రెహమాన్ గారు చేశారా అనుకున్నాను. కానీ ఆ పాటలు చేసింది రంజిత్ బరోట్. తర్వాత ఆయన సంగీత దర్శకుడిగా కొనసాగలేదు. రెహమాన్‌గారి ట్రూప్‌లో మెయిన్ డ్రమ్మర్. 


మీ సంగీత ప్రయాణం ఎలా మొదలైంది?

నా బాల్యం నుండే ప్రయాణం మొదలైంది. మా అంకుల్ ఒకరు బుల్ బుల్ తరంగ్ అనే వాయిద్యం తెచ్చి ఇంట్లో పెట్టారు. అది శ్రద్ధగా వాయించే వాడిని. నా ఆసక్తి చూసి అమ్మనాన్న కీ బోర్డ్ కొనిపెట్టారు. అలా సంగీత ప్రయాణం మొదలైంది.


ఏ దర్శకులతో కలిసి పని చేయాలనుకుంటున్నారు?

మిస్కిన్‌గారి సినిమాలకి పని చేయాలని వుంది. మంచి కథ రాసే ఎవరైనా సరే.. వారితో కలిసి పని చేయాలని కోరుకుంటున్నాను. నా వరకూ మంచి సంగీతం ఇవ్వాలంటే మంచి కంటెంట్ వుండాల్సిందే.


కొత్తగా చేయబోతున్న సినిమాలు?

మాధవన్‌గారితో ఒక సినిమా చర్చల్లో వుంది.

Updated Date - 2022-07-28T03:14:10+05:30 IST