Sita Ramam: ‘ఓ సీతా- హే రామా’తో వింటేజ్ ఇళయరాజా-ఎస్పీబీ టచ్

ABN , First Publish Date - 2022-05-10T04:40:55+05:30 IST

వైజయంతీ మూవీస్ (Vyjayanthi Movies).. ఈ బ్యానర్‌కి ఉన్న విశిష్టత ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. టాలీవుడ్ చరిత్రలో ఈ బ్యానర్‌కి ఓ ప్రత్యేక పేజీ ఉంటుంది. ఈ బ్యానర్ సినిమాలకు ప్రత్యేక అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. అలాంటి హిస్టరీ

Sita Ramam: ‘ఓ సీతా- హే రామా’తో వింటేజ్ ఇళయరాజా-ఎస్పీబీ టచ్

వైజయంతీ మూవీస్ (Vyjayanthi Movies).. ఈ బ్యానర్‌కి ఉన్న విశిష్టత ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. టాలీవుడ్ చరిత్రలో ఈ బ్యానర్‌కి ఓ ప్రత్యేక పేజీ ఉంటుంది. ఈ బ్యానర్ సినిమాలకు ప్రత్యేక అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. అలాంటి హిస్టరీ ఈ బ్యానర్‌కి ఉంది. ఇక మే 9వ తేదీ.. వైజయంతీ మూవీస్ బ్యానర్‌కి ఎంతో ప్రత్యేకమైనది. ఆ తేదీన ఈ బ్యానర్‌లో ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, ‘మహానటి’ వంటి మేటి చిత్రాలు విడుదలై.. వైజయంతీ ప్రతిష్టను శిఖరాగ్రానికి చేర్చాయి. ఆ సెంటిమెంట్‌ని కంటిన్యూ చేస్తూ.. ఇప్పుడీ బ్యానర్ సమర్పణలో రూపొందుతోన్న ‘సీతా రామం’ చిత్రానికి సంబంధించిన ఓ లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.


వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్ (Ashwini Dutt), ప్రియాంక దత్ (Priyanka Dutt) నిర్మిస్తున్న చిత్రం ‘సీతా రామం’ (Sita Ramam). వెండితెరపై హృద్యమైన ప్రేమ కథలు తెరకెక్కించే దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో.. స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) కథానాయకుడిగా.. యుద్ధం నేపథ్యంలో ఓ అందమైన ప్రేమకథగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. ఈ చిత్ర ఫస్ట్ సింగిల్ ‘ఓ సీతా- హే రామా’ను సోమవారం విడుదల చేశారు. ఈ పాట సంగీత ప్రేమికుల మనసులో ఎప్పటికీ నిలిచిపోయేలా సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ (Vishal Chandrashekar) స్వరపరిచారు. ఈ లవ్లీ మెలోడీకి అనంత శ్రీరామ్ (Anantha Sriram) అందించిన సాహిత్యం.. పాటని మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా చేస్తోంది. వింటేజ్ ఇళయరాజా-ఎస్పీబీ (vintage Ilayaraja-SPB) మ్యూజికల్ మెమోరీస్‪ని ఈ పాట గుర్తుకు తెస్తోంది. అలాగే పాటని ఎస్పీ చరణ్ (SP Charan), రమ్య బెహరా (Ramya Behara) ఆలపించిన తీరు పాటని మరో స్థాయికి తీసుకెళ్లింది.




‘‘ఓ.. సీతా.. వదలనిక తోడౌతా

రోజంతా వెలుగులిడు నీడవుతా

దారై నడిపేనే చేతి గీత

చేయి విడువక సాగుతా

తీరం తెలిపేనే నుదిటి రాత

నుదుట తిలకమై వాలుత’’ అంటూ సాగిన పాటను.. హీరోహీరోయిన్లపై చిత్రీకరించారు. దుల్కర్, మృణాల్‌ల (Mrunal Thakur) కెమిస్ట్రీ బ్యూటీఫుల్‌గా ఉంది. పాట చిత్రీకరించిన తీరు కూడా అద్భుతంగా ఉంది. పాటలో కనిపించిన విజువల్స్ గ్రాండ్‪గా వున్నాయి. పాటలో మ్యూజిక్ మేకింగ్ కూడా చూపించారు. పెద్ద వయోలిన్ ట్రూప్‪తో గ్రాండ్ సింఫనీ ఆర్గనైజ్ చేసి ఈ పాటని రికార్డ్ చేశారు. ఈ సినిమా మ్యూజిక్ విషయంలో నిర్మాతలు ప్రత్యేక దృష్టి పెట్టి అద్భుతమైన ఆల్బమ్‪ని ప్రేక్షకులకు వినిపించే లక్ష్యంతో ఉన్నారనేది.. ఈ ఫస్ట్ సింగల్ రికార్డింగ్ చూస్తేనే తెలిసిపోతుంది. కాగా.. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అఫ్రీన్ అనే కీలకమైన పాత్రలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) నటించింది. ప్రస్తుతం విడుదలైన ఈ పాట.. మూడు భాషల్లోనూ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.



Updated Date - 2022-05-10T04:40:55+05:30 IST