Hanu Raghavapudi: రాముడు.. రావణుడిని చంపడం అసలు యుద్ధమే కాదు

ABN , First Publish Date - 2022-07-24T03:03:03+05:30 IST

దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా వైజయంతీ మూవీస్ (Vyjayanthi Movies) సమర్పణలో స్వప్న సినిమా (Swapna Cinema) పతాకంపై హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో.. నిర్మాత అశ్వినీదత్..

Hanu Raghavapudi: రాముడు.. రావణుడిని చంపడం అసలు యుద్ధమే కాదు

దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా వైజయంతీ మూవీస్ (Vyjayanthi Movies) సమర్పణలో స్వప్న సినిమా (Swapna Cinema) పతాకంపై హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో.. నిర్మాత అశ్వినీదత్ (Aswini Dutt) నిర్మిస్తోన్న చిత్రం ‘సీతా రామం’ (Sita Ramam). ‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’గా రూపొందిన ఈ చిత్రంలో దుల్కర్ సరసన మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్‌గా నటిస్తుండగా.. రష్మిక మందన్న (Rashmika Mandanna) ఓ కీలక పాత్రలో కనిపించనుంది. భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక విలువలతో తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ 5న  ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా శనివారం చిత్ర దర్శకుడు హను రాఘవపూడి మీడియాకు ‘సీతా రామం’ చిత్ర విశేషాలను తెలియజేశారు. 


ఆయన మాట్లాడుతూ..

‘‘మొదటి సినిమా ‘అందాల రాక్షసి’ చేసినప్పుడు ఇప్పుడున్నంత వనరులు లేవు. అయితే నిర్మాత సాయిగారు ఇచ్చిన స్వేచ్ఛ వలన చాలా సౌకర్యంగా పని చేశాను. ఆ సినిమాకి మొదట్లో సక్సెస్ రాలేదు కానీ.. తర్వాత రోజుల్లో కల్ట్ స్టేటస్ వచ్చింది. తర్వాత ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ చేశాను. అయితే ఈ గ్యాప్‌లో కొంత కష్ట సమయం ఎదురైయింది. రానా గారితో అనుకున్న ఒక సినిమా బడ్జెట్ కారణాల వలన కుదరలేదు.  ‘లై’, ‘పడి పడి లేచే మనసు’ ఏడాది గ్యాప్‌లోనే వచ్చాయి. తర్వాత అందరిలానే కరోనా గ్యాప్ వచ్చింది. అయితే నా జర్నీలో సక్సెస్ గురించి ఎప్పుడూ దిగులు లేదు. ఈ ప్రయాణంలో నిరాశ చెందలేదు. పని దొరుకుతుందా లేదా? అని ఎప్పుడూ అలోచించలేదు. క్రాఫ్ట్ తెలిసుంటే ఏ పరిశ్రమలోనైనా పని ఉంటుందని నమ్ముతాను. అంచనాలని క్రియేట్ చేయడం నా ఉద్దేశం కాదు. ఒక మనిషికి ఒకసారి గౌరవించామంటే ఆ గౌరవం ఎప్పుడూ వుంటుంది. తప్పు చేస్తే తప్ప అది బ్రేక్ అవ్వదు. ఒక సినిమా బాలేదని అనుకుంటే ఆ సినిమా వరకే అనుకుంటారు కానీ.. తర్వాత వచ్చిన సినిమాకు అది వర్తించదు. బహుశా నేను బిజీగా ఉండటానికి అదే కారణం అనుకుంటాను.


‘సీతా రామం’ ఖచ్చితంగా అంచనాలను అధిగమిస్తుంది. ఈ సినిమా చాలా ప్రత్యేకమైన చిత్రం. సినిమా చూడటానికి మొదట కావలసింది క్యూరియాసిటీ. ‘సీతా రామం’ థియేటర్‌లోనే చూడాలనే ఎక్జయిట్మెంట్, క్యూరియాసిటీ ప్రతి ప్రమోషనల్ ఎలిమెంట్‌లో కనిపిస్తుంది. థియేటర్‌లోకి వచ్చిన తర్వాత ‘సీతా రామం’ అద్భుతమని ప్రేక్షకులు ఖచ్చితంగా అంటారు. ఈ కథ రాసుకున్నప్పుడు మైండ్‌లో నటులు ఎవరూ లేరు. ఒక డిమాండింగ్ ఫేస్ కావాలి. తెలుగులో వున్నవాళ్ళంతా ఆ సమయంలో బిజీగా వున్నారు. నేను, స్వప్న గారు కలసి దుల్కర్‌ని అనుకున్నాం. మార్కె‌ట్‌ని విస్తరించాలనే ఆలోచన మాత్రం లేదు. ‘సీతా రామం’ లార్జర్ దెన్ లైఫ్ స్టొరీ. (Sita Ramam Director Hanu Raghavapudi Interview)


నాకు కోఠి వెళ్లి పాత పుస్తకాలు కొనుక్కునే అలవాటు వుంది. అలా కొనుక్కున్న పుస్తకంలో ఒక లెటర్ కనిపించింది. ఓపెన్ చేయని లెటర్ అది. అది ఓపెన్ చేస్తే పెద్ద మేటర్ ఏమీ లేదు. ఒక అబ్బాయికి వాళ్ళ అమ్మ రాసిన ఉత్తరం అది. అతను కనీసం దాన్ని ఓపెన్ కూడా చేయలేదు. ఇది నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఒకవేళ అందులో చాలా ముఖ్యమైన విషయం వుండి ఓపెన్ చేయకపోతే జర్నీ ఎలా వుండేది? మనిషి జీవితాన్ని నిర్దేశించే విషయం కదా అనిపించింది. ఆ ఆలోచననే కథగా రాశా. సీతారామం పూర్తిగా ఫిక్షన్. ఇందులో రెండు టైం పీరియడ్స్ వున్నాయి. 1964 కథ టేకాఫ్ పిరియడ్. స్క్రీన్ ప్లే వర్తమానానికి, గతానికి నడుస్తూ వుంటుంది.


సంగీత దర్శకుడు విశాల్ నాకు మంచి స్నేహితుడు. అతనితో పని చేయడం చాలా సౌకర్యంగా వుంటుంది. మా ఇద్దరికి మ్యూజిక్ పట్ల ఒకే అభిరుచి వుంది, ప్రతీది స్పూన్ ఫీడింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇందులో మ్యూజిక్ అద్భుతంగా వుంటుంది. ‘సీతా రామం’ పాటలకు వృద్దాప్యం రానే రాదు. రష్మికది చాలా కీలకమైన పాత్ర. కథని మలుపు తిప్పే పాత్ర. ఆ పాత్ర జర్నీలో ఏం జరుగుతుందో అనేది ఒకరకంగా ఈ కథ. అదే కాదు.. ఇందులో పాత్రలన్నీ కథని ఎదో ఒక మలుపుతిప్పుతాయి. సుమంత్, భూమిక, ప్రియదర్శి.. అన్నీ ముఖ్యమైన పాత్రలే.


బేసిగ్గా యుద్ధ నేపధ్యంలో జరిగే కథ అంటే యుద్ధం మనకి కనిపిస్తుంది. ‘యుద్ధంతో రాసిన ప్రేమ’ ఎందుకంటే ఇది ఫిజికల్ వార్ కాదు. ఈ యుద్ధం ఇన్ విజిబుల్. కథలోని ప్రతి పాత్రకు ఒక యుద్ధం వుంటుంది.  ఒక ఉదారణగా చెప్పాలంటే.. రాముడు.. రావణుడిని చంపడం అసలు యుద్ధమే కాదు. ఎందుకంటే రాముడి వీరత్వం ముందు ఎవరూ సరిపోరు. రాముడు విష్ణుమూర్తి అవతారం. రాముడు లాంటి లక్షణాలతో మరొకరు పుట్టలేదు. అందుకే రాముడు దేవుడయ్యాడు. అయితే రావణసంహారం చేయడానికి రాముడు చేసిన ప్రయాణంలో గొప్ప యుద్ధం, సంఘర్షణ వుంది. అలాంటి సంఘర్షణ, యుద్ధం ‘సీతా రామం’లో వుంటుంది.


టీజర్‌లో సీతా పేరుతో వచ్చిన లెటర్ గురించి చెప్పాలంటే.. రామ్ ఒక అనాధ. కశ్మీర్ కొండల్లో పహారా కాస్తున్న ఒక సైనికుడు. రేడియోలో తన గురించి ఒక కార్యక్రమం ప్రసారం అవుతుంది. తను అనాధ అని తెలిసిన తర్వాత చాలా మంది అతనికి  ఉత్తరాలు రాశారు. అలా వచ్చిన ఒక సర్‌పైజ్ లెటర్ తన జీవితాన్ని మరో మలుపు తిప్పుతుంది. ఆ లెటర్‌లో ఏముందో ఇప్పటికీ సస్పెన్స్. ఆ లెటర్ ఓపెన్ అయిన తర్వాత ఎలాంటి మ్యాజిక్ జరగబోతుందో అదే సీతా రామం కథ. ఉత్తరం అనేది చాలా ప్రత్యేకమైన ఎమోషన్. ప్రేమ కథకి కమ్యునికేషన్ ప్రధాన సమస్య. ఒకప్పుడు ప్రేమ కథలు చాలా హృద్యంగా ఉండటానికి కారణం.. ఇప్పుడంత కమ్యునికేషన్ లేకపోవడమేనని భావిస్తా. ఉత్తరంలో ఎమోషన్ వేరు. ఆ మ్యాజిక్ మిస్ అయిపోయాం. ఆ మ్యాజిక్‌ని బాగానే డీల్ చేశానని అనుకుంటున్నా.


వైజయంతి మూవీస్‌లో చేయడం వండర్ ఫుల్ ఎక్స్‌పీరియన్స్. కాగితం మీద వున్నది స్క్రీన్ మీదకి రావాలంటే విజన్ ఒక్కటే సరిపోదు. దీనిని బలంగా నమ్మే నిర్మాత వుండాలి. వైజయంతి మూవీస్, స్వప్న దత్ సినిమా పట్ల గొప్ప సంకల్పం వున్న నిర్మాతలు. కథ ఒప్పించడానికి ప్రయత్నించకూడదు. కథ బావుండాలి. కథ బావుంటే అన్నీ జరిగిపోతాయి. సినిమా అనేది నచ్చితేనే చేస్తారు. అందులో వైజయంతి మూవీస్ మరింత క్లారిటీ‌గా వుంటుంది.


ప్రస్తుతం బాలీవుడ్‌లో సన్నీ డియోల్, నవాజ్‌తో ఒక యాక్షన్ ఫిల్మ్ చేయబోతున్నా. అలాగే అమెజన్‌తో ఒక వెబ్ సిరీస్ ప్లాన్‌లో వుంది..’’ అని తెలిపారు.

Updated Date - 2022-07-24T03:03:03+05:30 IST