సీతారామశాస్త్రి.. నిశ్శబ్ద పాటల విప్లవం

ABN , First Publish Date - 2022-05-21T05:30:00+05:30 IST

‘‘తెలుగు సినీసాహిత్యంలో విలువలను రాసులుగా పోసిన అరుదైన కవి సిరివెన్నెల సీతారామశాస్త్రి’’ అంటూ భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు.

సీతారామశాస్త్రి.. నిశ్శబ్ద పాటల విప్లవం

‘‘తెలుగు సినీసాహిత్యంలో విలువలను రాసులుగా పోసిన అరుదైన కవి సిరివెన్నెల సీతారామశాస్త్రి’’ అంటూ భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. పాట విలువను ఆర్థికంగా గాక, అర్థవంతంగా కొలిచే వారిలో ఆయన అగ్రగణ్యులంటూ కొనియాడారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక, సిరివెన్నెల కుటుంబం కలిసి శుక్రవారం శిల్పకళా వేదికలో సిరివెన్నెల జయంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు  ప్రచురించిన ‘సిరివెన్నెల సమగ్ర సాహిత్య తొలి సంపుటి’ని  వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. సిరివెన్నెల కేవలం సినీపాటల రచయిత మాత్రమేకాదు, ఒక నిశ్శబ్ద పాటల విప్లవం, నవ్యవాగ్గేయకారుడు అంటూ అభివర్ణించారు. అశ్లీలత, హింస, ద్వంద్వార్థాలకు అతీతంగా కుటుంబమంతా కలిసి చూసే వినోద, విజ్ఞాన భరితమైన సినిమాలు తీయాలని చలనచిత్ర నిపుణులకు ఉపరాష్ట్రపతి హితవు పలికారు. సిరివెన్నెల సమగ్ర సాహిత్య సంపుటిని పద్మశ్రీ పురస్కార గ్రహీత గరికపాటి నరసింహారావు సమీక్షించారు. సిరివెన్నెల సాహిత్య పురస్కారాన్ని త్వరలో ప్రారంభించనున్నట్టు తానా ప్రపంచ సాహిత్య వేదిక అధ్యక్షుడు తోటకూర ప్రసాద్‌ ప్రకటించారు. కార్యక్రమంలో తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, సిరివెన్నెల కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీప్రముఖులు పాల్గొన్నారు. 


దర్శకుడు త్రివిక్రమ్‌ మాట్లాడుతూ ‘‘సీతారామశాస్త్రి గారితో చాలా వెన్నెల రాత్రులు గడిపాను. కేవలం నా సినిమాలకే కాదు, ఇతర సినిమాలకు పాటలు రాసినా సరే, ఒక మంచి లైను వచ్చిందంటే అర్థరాత్రి ఫోను చేసిమరీ వినిపించేవారు. ఒక కవి రాసిన పాటను తానే పాడినప్పుడు... వినడానికి మించిన ఉల్లాసం మరొకటి ఉండదు. సిరివెన్నెల... ిసినిమా పాటకన్నా ఎత్తైన మనిషి. ఆ పాటలోని భావంకన్నా లోతైన మనిషి. దాన్నిమనం విశ్లేషించేదాని కన్నా గాఢమైన మనిషి. అలాంటి మనిషితో ఇంకా కొన్నేళ్లు గడపలేకపోవడం బాధాకరం. కొన్ని కావ్యాలకు ముగింపు ఉండకూడదు అనిపిస్తుంది. సీతారామశాస్త్రిగారు కూడా అలాంటి ఒక ముగింపు లేని కావ్యం. కళ్లకు రంగు ఉంటుంది కానీ, కన్నీళ్లకు రంగు ఉండదు. అలాగే పదాలకు రకరకాల అర్థాలు, భావాలు ఉంటాయి. కానీ వాటన్నింటినీ కలిపి ఒక మనిషి గుండెల మీదకు విసరగలిగే బాణంగా తయారుచేయగలిగిన సాహిత్య మూర్తి ఆయన. పింగళి, సముద్రాల, మల్లాది, వేటూరి వంటి మహావృక్షాల ఛాయలో ఇంకో మొక్క మొలవడం అంటే, దానికెంత బలం ఉంటుందో.! దానికెంత పొగరుంటుందో.! దానికెంత సొంతగొంతుక ఉండాలి.! దానికి ‘నాది’ అనేటువంటి నిర్మాణం ఉండాలి. తన ఉనికిని చాటడానికి, శబ్దాన్ని  శూన్యంగా చేశాడు, నిశ్శబ్దంలోనూ యుద్ధం చేశాడు. అలాంటి గొప్పకవి మన మధ్య లేకపోయినా, ఆయన తాలూకూ అక్షరాలు అజరామరం. నేను, ఆయన చాలాసార్లు వాదులాడుకున్నాం. ఇప్పుడు నాకు అనిపిస్తుంది, నాలాంటి వాడు కూడా మాట్లాడుతుంటే, ఆయన వినడం, సమాధానం ఇవ్వడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. సీతారామశాస్త్రి... నాకు తెలిసిన ఒక అద్భుతం’’ అని భావోద్వేగంతో అన్నారు.


- ఆంధ్రజ్యోతి,హైదరాబాద్‌ సిటీ

Updated Date - 2022-05-21T05:30:00+05:30 IST